Share News

Supreme court: 'ఆప్' కార్యాలయం ఖాళీ చేయండి.. సుప్రీంకోర్టు ఆదేశం

ABN , Publish Date - Mar 04 , 2024 | 05:30 PM

ఆమ్ ఆద్మీ పార్టీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. న్యూఢిల్లీలోని రౌస్ అవెన్యూలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని జూన్ 15వ తేదీలోగా ఖాళీ చేయాల్సిందిగా ఆప్‌ను అత్యున్నత న్యాయస్థానం సోమవారంనాడు ఆదేశించింది. ఆ ప్రదేశాన్ని ఢిల్లీ హైకోర్టు విస్తరణకు కేటాయించినట్టుగా గుర్తించిన సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.

Supreme court: 'ఆప్' కార్యాలయం ఖాళీ చేయండి.. సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి సుప్రీంకోర్టు (Supreme Court)లో ఎదురుదెబ్బ తగిలింది. న్యూఢిల్లీలోని రౌస్ అవెన్యూలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సిందిగా ఆప్‌ను అత్యున్నత న్యాయస్థానం సోమవారంనాడు ఆదేశించింది. ఆ ప్రదేశాన్ని ఢిల్లీ హైకోర్టు విస్తరణకు కేటాయించినట్టుగా గుర్తించిన సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. జూన్ 15వ తేదీలోగా పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాల్సిందిగా ల్యాండ్ అండ్ డవలప్‌మెంట్ ఆఫీసు (L&DO)ను ఆమ్ ఆద్మీ పార్టీ అప్రోచ్ అయ్యేందుకు కోర్టు అనుమతించింది.


సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ (DY Chandrachud), న్యాయమూర్తులు జేబీ పరిడివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తాజా ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం కార్యాలయం ఏర్పాటు చేసిన స్థలంలో కొనసాగే చట్టబద్ధమైన హక్కు 'ఆప్‌'కు లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రత్నామాయ స్థలం కోసం ఎల్‌అండ్‌డీఓకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అప్లికేషన్ ప్రాసెస్‌ చేయడం, ప్రత్యామ్నాయ స్థలం కేటాయింపుపై నిర్ణయాన్ని నాలుగు వారాల్లోగా తమకు తెలియజేయాలని ఎల్‌అండ్‌డీఓను ధర్మాసనం ఆదేశించింది.


ఆప్‌ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తన వాదనలు వినిపించారు. దేశంలోని ఆరు జాతీయ పార్టీల్లో ఆప్ ఒకటని కోర్టుకు తెలిపారు. జాతీయ పార్టీ అని ప్రకటించినప్పటికీ ఎలాంటి కేటాయింపులు జరపలేదని అన్నారు. సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున పార్టీ కార్యాలయం ఖాళీ చేయడానికి జూన్ 15వ తేదీ వరకూ తమకు సమయం ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. కాగా, రౌస్ ఎవెన్యూ కోర్టులో హైకోర్టుకు కేటాయించిన భూమిలో ఆప్ ఆక్రమణలను తొలగించేందుకు సమావేశం జరపాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని, ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది.

Updated Date - Mar 04 , 2024 | 05:40 PM