Share News

Priyanka Gandhi : దేశం కోసమే మా పోరాటం

ABN , Publish Date - Dec 02 , 2024 | 03:52 AM

దేశం కోసమే తాము పోరాడుతున్నామని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, వయనాడ్‌ ఎంపీ ప్రియాంకాగాంధీ అన్నారు.

Priyanka Gandhi : దేశం కోసమే మా పోరాటం

హక్కులను కేంద్రం కాలరాస్తోంది

విమర్శలు గుప్పించిన ప్రియాంక

వయనాడ్‌, బెంగళూరు డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): దేశం కోసమే తాము పోరాడుతున్నామని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, వయనాడ్‌ ఎంపీ ప్రియాంకాగాంధీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తోందని, కొద్దిమంది తమ వ్యాపార మిత్రులకు సంపదను దోచిపెడుతోందని విమర్శలు గుప్పించారు. వయనాడ్‌లో ఈ ఏడాది జూలై 30న సంభవించిన వరదలకు ఇక్కడి ప్రజలు సర్వస్వం కోల్పోయారని, వారిని ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని దుయ్యబట్టారు. వయనాడు పార్లమెంటు పరిధిలోని మనంతవాదీలో నిర్వహించిన సమావేశంలో ఆదివారం ప్రియాంకాగాంధీ ప్రసంగించారు. ‘‘ఏ వ్యవస్థలపై ఈ దేశ నిర్మాణం జరిగిందో ఆ వ్యవస్థలను అధికారంలో ఉన్న వారు నాశనం చేస్తున్నారు. అందుకే దేశం కోసం మేం పోరాటం చేస్తున్నాం’’ అని అన్నారు. వయనాడ్‌ విపత్తు బాధితులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొండిచేయి చూపాయని దుయ్యబట్టారు. మరోవైపు, కొద్ది మంది కుబేరులే లబ్ధి పొందున్నంత కాలం దేశం ప్రగతి సాధించలేదని ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ఒకవైపు అభివృద్ధి ఫలాలు కొద్ది మంది కోటీశ్వరులే అందుకుంటూ మరోవైపు ఆర్థిక విపత్తుల కారణంగా రైతులు, కార్మికులు, మధ్యతరగతి ప్రజలు జీవనం కోసం పోరాడుతుంటే అది ప్రగతి అనిపించుకోదని తెలిపారు. జీడీపీ వృద్ధి బాగా తగ్గినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆదివారం ఆయన ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

Updated Date - Dec 02 , 2024 | 03:52 AM