Share News

Karnataka: కర్ణాటకలో డర్టీ పిక్చర్‌.. రాజకీయాల్లో కుదుపు

ABN , Publish Date - Apr 30 , 2024 | 03:33 AM

కర్ణాటక రాజకీయాలను మాజీ ప్రధాని దేవెగౌడ మనవడి డర్టీపిక్చర్‌ కుదిపేస్తోంది! ఇప్పటికే ఒక దశ ఎన్నికలు ముగిసి, మే 7న మరో దశ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆ రాష్ట్రంలో.. దేవెగౌడ పెద్దకుమారుడైన రేవణ్ణ కొడుకు.. హసన్‌ సిటింగ్‌ ఎంపీ అయిన ప్రజ్వల్‌ రేవణ్ణకు సంబంధించిన 2976 అశ్లీల వీడియోల వ్యవహారం పెనుసంచలనం సృష్టిస్తోంది.

Karnataka: కర్ణాటకలో డర్టీ పిక్చర్‌.. రాజకీయాల్లో కుదుపు

  • దేవెగౌడ మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణ రాసలీలల సంచలనం

  • పెన్‌డ్రైవ్‌లో 2,976 అశ్లీల వీడియోలు.. జేడీఎస్‌లో కలకలం

  • ప్రజ్వల్‌ లీలలపై గత డిసెంబరులోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి బీజేపీ నేత దేవరాజె గౌడ 2 పేజీల లేఖ

  • ఐనా కూటమి కేటాయింపుల్లో భాగంగా అతనికి హసన్‌ సీటు

  • బీజేపీ, జేడీఎస్‌పై విరుచుకుపడుతున్న కాంగ్రెస్‌

  • మోదీజీ.. ఇంకా మౌనమేనా: ప్రియాంక గాంధీ

  • ప్రజ్వల్‌ వ్యవహారంపై సొంత పార్టీ నాయకుల ధ్వజం

    ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేయాలని డిమాండ్‌

బెంగళూరు, న్యూఢిల్లీ, హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాజకీయాలను మాజీ ప్రధాని దేవెగౌడ మనవడి డర్టీపిక్చర్‌ కుదిపేస్తోంది! ఇప్పటికే ఒక దశ ఎన్నికలు ముగిసి, మే 7న మరో దశ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆ రాష్ట్రంలో.. దేవెగౌడ పెద్దకుమారుడైన రేవణ్ణ కొడుకు.. హసన్‌ సిటింగ్‌ ఎంపీ అయిన ప్రజ్వల్‌ రేవణ్ణకు సంబంధించిన 2976 అశ్లీల వీడియోల వ్యవహారం పెనుసంచలనం సృష్టిస్తోంది. ఆ వీడియోల్లో వందలాది మంది సాధారణ మహిళలతోపాటు.. పలువురు ప్రభుత్వ ఉద్యోగినులు కూడా ఉన్నట్టు సమాచారం. ఆ వీడియోలన్నీ అతడి ఫోన్‌లో రికార్డ్‌ చేసుకున్నవే! ఎలా బయటపడ్డాయోగానీ.. ఆ వీడియోల పెన్‌డ్రైవ్‌లు


పలు పార్టీల నేతలకు, జాతీయ స్థాయిలో పలువురు కాంగ్రెస్‌ నేతలకు కూడా చేరాయి. సామాజిక మాధ్యమాల్లో కూడా ఆ వీడియోలు విపరీతంగా వైరల్‌ కావడం.. ఈ వ్యవహారం మీడియా ద్వారా ప్రపంచమంతా టాం టాం కావడం జేడీఎ్‌సను, ఆ పార్టీతో జట్టు కట్టిన బీజేపీని ఇరుకున పెడుతోంది. నిజానికి ప్రజ్వల్‌ కామలీలల గురించి బయటి ప్రపంచానికి తెలిసింది ఇప్పుడేగానీ.. ఆ వీడియోలు కన్నడనాట గత డిసెంబరు నుంచే వైరల్‌ అవుతున్నాయి! 2023 డిసెంబరు 8వ తేదీన.. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు, కర్ణాటక బీజేపీ చీఫ్‌ బీవై విజయేంద్రకు కర్ణాటక బీజేపీ నేత దేవరాజె గౌడ రెండు పేజీల సుదీర్ఘ లేఖ కూడా రాశారు. ‘‘మన (ఎన్డీయే) కూటమిలో ఉన్న జేడీఎస్‌ అభ్యర్థి ప్రజ్వల్‌ రేవణ్ణ సహా దేవెగౌడ కుటుంబానికి చెందిన పలువురు నేతలపై కిడ్నాప్‌, రేప్‌ వంటి దారుణమైన ఆరోపణలు వస్తున్నాయి.


వారిలో.. ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ స్త్రీలోలుడు, సైకో. అతడు మహిళలతో లైంగికచర్యలో పాల్గొంటూ తన ఫోన్‌లో వీడియోలు తీసుకున్నాడు. ఆ వీడియోలతో కూడిన పెన్‌డ్రైవ్‌ ఒకటి కాంగ్రెస్‌ నేతల వద్దకు చేరింది. అలాంటిదే మరో పెన్‌డ్రైవ్‌ నా వద్దకు కూడా వచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఈ వీడియోలను ట్రంప్‌ కార్డులా వాడుకుంటుంది’’ అని ఆయన ఆ లేఖలో పార్టీ అధిష్ఠానాన్ని ముందే హెచ్చరించారు. అయినప్పటికీ జేడీఎస్‌ ప్రజ్వల్‌ రేవణ్ణకే హసన్‌ సీటు కేటాయించడం.. బీజేపీ అందుకు అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం. దేవరాజెగౌడ అంచనా వేసినట్టుగానే.. ఏప్రిల్‌ 26న కర్ణాటకలో జరిగిన తొలిదశ ఎన్నికల సమయంలో విపక్ష నేతలు ప్రజ్వల్‌ అకృత్యాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

ఆ ప్రచార ప్రభావం ఎన్నికలపై పడే ప్రమాదాన్ని గ్రహించిన ప్రజ్వల్‌ రేవణ్న.. ఎన్నికల్లో లబ్ధి కోసం తన మార్ఫ్‌డ్‌ ఫొటోలు, వీడియోలతో కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. కానీ, ఈ వీడియోల వ్యవహారం రోజురోజుకూ పెద్దదై మహిళా కమిషన్‌ దృష్టికి వెళ్లడంతో.. ఎన్నికలైన మర్నాడే ఆయన జర్మనీకి వెళ్లారు. అంతలోనే.. రేవణ్ణ ఇంట్లో గతంలో పనిచేసిన ఒక మహిళ(47).. రేవణ్ణ, ప్రజ్వల్‌ తనను లైంగింకంగా వేధించారని ఫిర్యాదు చేసింది.


మాకేం సంబంధం లేదు..

ప్రజ్వల్‌ అశ్లీల వీడియోల వ్యవహారం జాతీయస్థాయిలో చర్చనీయాంశం కావడంతో బీజేపీ.. దీంతో తమకు సంబంధం లేనట్టు ప్రవర్తిస్తోంది. ‘‘ఆ వీడియోలతో మా పార్టీకి ఏ సంబంధమూ లేదు’’ అని కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ఎస్‌ ప్రకాశ్‌ ప్రకటించారు. జేడీఎ్‌సనైతే ఈ వ్యవహారం తీవ్ర సంక్లిష్ట పరిస్థితిలో పడేసింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని సొంతపార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. అయితే.. ప్రజ్వల్‌ తండ్రి రేవణ్ణ మాత్రం ఆ వీడియోలు ఇప్పటివి కావని, నాలుగైదేళ్ల కిందటివంటూ తేలిగ్గా తీసిపారేసే ప్రయత్నం చేయడం గమనార్హం.

ప్రజ్వల్‌ను బీజేపీయే కాపాడుతోందని కర్ణాటక మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్‌ ఆరోపించారు. ‘‘ప్రధాని మోదీ హిందూ మహిళల మంగళసూత్రాలను కాపాడటం గురించి మాట్లాడుతున్నారు. మరి ఇందులో బాధితులంతా హిందూ మహిళలు కారా? వారి మంగళసూత్రాల మాటేమిటి? ప్రధాని దీనిపై మాట్లాడాలి’’ అని తూర్పారబట్టారు. కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక కూడా ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వందలాది మంది మహిళల జీవితాలు నాశనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె.. ‘ఇంత జరిగినా ఇంకా మౌనంగానే ఉంటారా?’ అని మోదీని నిలదీశారు.


తండ్రీకొడుకులకు నోటీసులు!

ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌.. ప్రజ్వల్‌తో పాటు రేవణ్ణకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే.. ప్రజ్వల్‌ ఇప్పటికే విదేశాలకు వెళ్లగా, కేసుల నుంచి ఉపశమనం పొందేందుకు రేవణ్ణ హైకోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నట్టు సమాచారం. కాగా, ప్రజ్వల్‌ పెన్‌డ్రైవ్‌ వివాదం వ్యక్తిగతమని, అందులో దేవెగౌడకు, తనకు ఎటువంటి సంబంధం లేదని జేడీఎస్‌ సీనియర్‌ నేత కుమారస్వామి అన్నారు. మంగళవారం పార్టీ కోర్‌ కమిటీ భేటీ ముగిశాక ప్రజ్వల్‌పై వేటు వేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.


నా కుటుంబంపై కుట్ర: రేవణ్ణ

ప్రజ్వల్‌ రేవణ్ణపై వచ్చిన రాసలీలల వివాదంపై ఆయన తండ్రి, మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్న తొలిసారి స్పందించారు. బెంగళూరులో తన తండ్రి, జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తనతో పాటు తన కుటుంబంపై కుట్ర జరిగిందని ఆరోపించారు. దీనిపై తాను న్యాయ పోరాటం చేస్తానన్నారు. తాను అజ్ఞాతంలోకి వెళ్లానని ప్రచారం చేస్తున్నారని, తాను ఎక్కడికీ వెళ్లలేదని స్పష్టం చేశారు. ప్రజ్వల్‌ విదేశాలకు వెళ్లడానికి, కేసు నమోదుకు సంబంధం లేదన్నారు. ముందస్తుగా నిర్ణయించుకున్న విఽధంగానే ప్రజ్వల్‌ విదేశాలకు వెళ్లాడని తెలిపారు. ఆ తర్వాత కేసు నమోదయిందని పేర్కొన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 07:54 AM