PM Modi: దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చిన కెప్టెన్
ABN , Publish Date - Jan 02 , 2024 | 08:01 PM
ప్రముఖ తమిళ నటుడు, దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత విజయకాంత్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ ఆయన 'కెప్టెన్' అనిపించుకున్నారని ప్రశంసించారు.
తిరుచిరాపల్లి: ప్రముఖ తమిళ నటుడు, దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం (DMDK) పార్టీ వ్యవస్థాపకుడు దివంగత విజయకాంత్ (Vijaykanth)కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఘనంగా నివాళులర్పించారు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ ఆయన 'కెప్టెన్' అనిపించుకున్నారని ప్రశంసించారు. తమిళనాడులో రెండు రోజుల పర్యటన కోసం వచ్చిన ప్రధాని తిరుచిరాపల్లిలోని భారతీదాసన్ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగానే దివంగత విజయకాంత్‌ను ప్రధాని గుర్తు చేసుకున్నారు.
''రెండు రోజుల క్రితమే విజయకాంత్‌ను మనం కోల్పోయాం. సినీ ప్రపంచంలోనే కాదు రాజకీయాల్లోనూ ఆయన కెప్టెన్. సినిమాల ద్వారా ప్రజల హృదయాలను ఆయన గెలుచుకున్నారు. రాజకీయత్తగా దేశ ప్రయోజనాలకే అన్నింటికంటే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ఆయనకు నివాళులర్పిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తు్న్నాను'' అని మోదీ అన్నారు. సుదీర్ఘ అస్వస్థతతో 71 ఏళ్ల విజయకాంత్ గత డిసెంబర్ 28న కన్నుమూశారు. 1991లో విడుదలైన 'కెప్టెన్ ప్రభాకరన్' చిత్రంలో ఆయన పాత్ర ప్రజాదరణ చూరగొనడంతో అప్పట్నించీ ఆయనను అభిమానులు 'కెప్టెన్' పేరుతోనే ఆప్యాయంగా పిలుచుకునే వారు. తన కెరీర్‌లో పోలీసు అధికారిగా 20కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. డీఎండీకే వ్యవస్థాపకుడిగా కూడా ఆయన రాజకీయరంగంలో తన సత్తా చాటుకున్నారు.