Share News

PM Modi: 9న చెన్నైలో ప్రధాని మోదీ రోడ్‌షో

ABN , Publish Date - Apr 03 , 2024 | 10:30 AM

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ నెల 19న రాష్ట్రంలోని 39 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. దీంతో అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించి, క్షేత్రస్థాయిలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యాయి.

PM Modi: 9న చెన్నైలో ప్రధాని మోదీ రోడ్‌షో

- పనగల్‌ పార్కు నుంచి తేనాంపేట సిగ్నల్‌ వరకు

- 12న బహిరంగ సభ

చెన్నై: లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ నెల 19న రాష్ట్రంలోని 39 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. దీంతో అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించి, క్షేత్రస్థాయిలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నెల 9న రాజధాని చెన్నై మహానగరంలో ఆయన రోడ్‌షో నిర్వహిస్తారు. స్థానిక టి.నగర్‌లోని పనగల్‌ పార్క్‌ నుంచి తేనాంపేట సిగ్నల్‌ వరకు సాగుతుంది. అలాగే, ఈ నెల 12న ప్రధాని మోదీ మరోమారు రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఆ రోజున ధర్మపురిలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ఇందుకోసం రాష్ట్ర బీజేపీ నేతలు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాయి. ముఖ్యంగా, చెన్నైలో జరిగే రోడ్‌ షోను చరిత్రలో మిగిలిపోయే విధంగా నిర్వహించాలని వారు ఏర్పాట్లు చేస్తున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ(BJP) సారథ్యంలో డీఎండీకే, పీఎంకే, మరికొన్ని చిన్నాచితక పార్టీలు కలిసి 39 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. పైగా ఈ ఎన్నికల్లో కనీసం నాలుగు నుంచి ఐదు ఎంసీ సీట్లను బీజేపీ స్వతహాగా గెలుచుకోవాలన్న పట్టుదలతో కమలనాథులు ఉన్నారు.

అందుకే ఎన్నికల షెడ్యూల్‌ వెలువడకముందు నుంచే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు ప్రత్యేక దృష్టిసారించి పలుమార్లు పర్యటించారు. ఇపుడు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్రంలోని 39 లోక్‌సభ, పుదుచ్చేరిలోని ఒకేఒక్క ఎంపీ స్థానానికి ఈ నెల 19న పోలింగ్‌ జరగనుంది. దీంతో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలు మరోమారు రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ నెల 9, 12 తేదీల్లో ప్రధాని రాష్ట్ర పర్యటనకు వస్తే, ఈ నెల 5వ తేదీన హోం మంత్రి అమిత్‌ షా రాష్ట్రానికి రానున్నారు. 5వ తేదీన రామనాథపురం, తేని, చెన్నైలలో జరిగే బహిరంగ సభల్లో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. అలాగే, పలువురు బీజేపీ జాతీయ నేతలు సైతం రాష్ట్రానికి రానున్నారు.

Updated Date - Apr 03 , 2024 | 10:30 AM