Share News

PM Modi: నేను చెన్నై వస్తున్నానంటేనే కొందరికి కడుపు నొప్పి వస్తోంది..

ABN , Publish Date - Mar 05 , 2024 | 10:47 AM

‘నేను చెన్నై వస్తున్నానంటేనే కొందరికి కడుపు నొప్పి వస్తోంది. రోజురోజుకు ప్రజల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణే దీనికి కారణం’ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) డీఎంకే పాలకులను ఎద్దేవా చేశారు.

PM Modi: నేను చెన్నై వస్తున్నానంటేనే కొందరికి కడుపు నొప్పి వస్తోంది..

- అవినీతిపరుల ఆటలు సాగనివ్వం

- రాష్ట్రంలో విచ్చలవిడిగా మాదకద్రవ్యాల వినియోగం

- బీజేపీ బహిరంగ సభలో మోదీ ధ్వజం

- డీఎంకే పాలకులపై నిప్పులు చెరిగిన ప్రధానమంత్రి

- ‘మోదీ’ నినాదాలతో మార్మోగిన వైఎంసీఏ మైదానం

చెన్నై: ‘నేను చెన్నై వస్తున్నానంటేనే కొందరికి కడుపు నొప్పి వస్తోంది. రోజురోజుకు ప్రజల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణే దీనికి కారణం’ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) డీఎంకే పాలకులను ఎద్దేవా చేశారు. అవినీతిపరుల ఆటలు సాగనివ్వబోమని, అవినీతి సొమ్మును కక్కిస్తామని ‘గ్యారెంటీ’ ఇచ్చారు. తమ పార్టీని బలోపేతం చేస్తే నీతివంతమైన పాలన అందిస్తామని హామీనిచ్చారు. రోజురోజుకు రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం పెరుగుతోందని, రాష్ట్ర బిడ్డల భవిష్యత్తుకు ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర బిడ్డల గురించే తన బాధంతానని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం స్థానిక వైఎంసీఏ మైదానంలో జరిగిన బీజేపీ బహిరంగసభలో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ.. డీఎంకే పాలకులపై మరోమారు నిప్పులు చెరిగారు. ‘‘నాకు మొదటి నుంచీ తమిళనాడుతో అవినాభావ సంబంధముంది. ఇప్పుడు చెన్నైలో జరుగుతున్న బహిరంగ సభ చూస్తుంటే మా పార్టీకి పెరుగుతున్న ఆదరణ స్పష్టమవుతోంది’’ అన్నారు. దేశాభివృద్ధిలో తమిళనాడు, చెన్నైది కీలక పాత్ర అని, అందుకే మౌలిక సదుపాయాల కోసం వేలాది కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నామన్నారు. చెన్నై మెట్రో, చెన్నై విమానాశ్రయం వంటివెన్నో ప్రాజెక్టుల ను అభివృద్ధి చేశామని, చెన్నై - మదురవాయల్‌ కారిడార్‌ కోసం వేలాది కోట్ల రూపాయ లు వ్యయం చేస్తున్నామన్నారు. ‘‘ఇటీవల పెద్ద తుఫాను వచ్చింది. దానివల్ల నగర ప్రజలంతా ఎన్నో నష్టపోయారు. కానీ డీఎంకే ప్రభుత్వం వారికి సహాయం చేయడానికి బదులు ఆ కష్టాల్ని పెంచేందుకు ప్రయత్నించింది. బాధితులకు సహాయం చేయడానికి బదులు మీడియా మేనేజ్‌మెంట్‌ చేశారు. ఇళ్లలో నీరు చేరితే... మీడియాతో మాత్రం అంతా బాగుందని చెప్పించారు. దీనిని వల్ల ప్రజల కష్టాలు వారికేమీ పట్టవని అర్థమైంది. బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వానికి ప్రజల కష్టనష్టాలు తెలుసు. అందుకే కరోనా సమయంలోనూ ప్రజలను ఆదుకునేందుకు అన్ని రకాలుగా శ్రమించింది’’ అని వివరించారు.

అవినీతి సొమ్మును కక్కిస్తాం

‘‘మా ప్రభుత్వం తమిళనాడు అభివృద్ధికి కట్టుబడి వుంది. అందుకే మేం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం. కానీ డీఎంకే పాలకులకు మాత్రం ఇది కడుపుమంటగా ఉంది. లక్షలాది కోట్ల రూపాయలు లబ్ధిదారులకు నేరుగా వెళ్తున్నాయని బాధ పడుతున్నారు. తాము దోచుకునేందుకు అవకాశం లేకుండాపోతోందని విలవిల్లాడిపోతున్నారు. అందుకే ఇక్కడి కుటుంబం బాధ పడుతోంది. మేం వారి అవినీతిని అడ్డుకోవడంతో.. కనీసం ఆ అభివృద్ధి పనుల క్రెడిట్‌ అయినా తమకు దక్కలేదే అని అల్లాడిపోతోంది. నేను డీఎంకే నేతలకు ఒక్కటే చెప్పదలచుకున్నా... తమిళనాడు ప్రజల డబ్బు మిమ్మల్ని దోచుకోనివ్వను. అంతేగాక ఇప్పటికే దోచుకున్న డబ్బును వసూలు చేసి తీరుతాం. ఆ అవినీతి డబ్బును కక్కిస్తాం. ఇది మోదీ హామీ. ఇది మోదీ గ్యారెంటీ’’ అంటూ బీజేపీ కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. కుటుంబ పార్టీలు తమ భవిష్యత్తును మాత్రమే చూస్తాయని, కానీ తాను దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పని చేస్తారన్నారు. తాను పదవి చేపట్టకముందు దేశంలోని 18 వేల గ్రామాల్లో కరెంటు లేదని, కానీ ఇప్పుడా గ్రామాలన్నీ విద్యుత్‌ సరఫరాతో కళకళలాడుతున్నాయన్నారు. ఆత్మనిర్భర్‌లో భాగంగా కల్పాక్కంలో స్వదేశీ బ్లాస్టర్‌ ప్రారంభించామన్నారు.

nani1.1.jpg

ఇంటి నుంచే విద్యుదుత్పత్తి

‘‘కొన్ని రోజుల క్రితం తమిళనాడులో గ్రీన్‌ హైడ్రోజన్‌ సెల్‌ను ప్రారంభించాం. అలాగే పలు చోట్ల విద్యుదుత్పత్తికి చర్యలు చేపట్టాం. కేంద్రప్రభుత్వం ద్వారా కోటి మంది కుటుంబాలకు ‘ముఫ్త్‌ బిజిలీ’ పథకం ప్రారంభించాం. ఇందుకోసం రూ.75 వేల కోట్లను వ్యయం చేస్తున్నాం. మీరంతా ఇంట్లోనే వుండి సౌరశక్తి విద్యుదుత్పత్తి చేపట్టగలరు. మీరు అదనపు విద్యుత్‌ ఉత్పత్తి చేస్తే కేంద్రం కొనుగోలు చేస్తుంది. అంటే ఇంట్లోనే వుండి విద్యుత్‌ను ఉత్పత్తి చేసి,దానిని విక్రయించడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు’’ అని ప్రధాని ప్రకటించారు.

కుటుంబమంటే అవినీతికి లైసెన్సా?

‘‘డీఎంకే, కాంగ్రెస్‌ నేతల గురించి మీకు బాగా తెలుసు. వారికి ఫ్యామిలీ ఫస్ట్‌... కానీ మోదీకి నేషన్‌ ఫస్ట్‌. అందుకే వీరంతా నన్ను తిట్టడంలో కొత్త ఫార్ములా తీశారు. ఇందులో భాగంగా మోదీకి కుటుంబం లేదు అంటున్నారు. అంటే కుటుంబం ఉంటే అవినీతికి లైసెన్స్‌ దొరుకుతుందా? నేను ఇల్లు వదిలింది ఆస్తిపాస్తుల కోసం కాదు. నా దేశం కోసం. ఇదే నా కుటుంబం. 145 కోట్లమంది నా కుటుంబీకులు. అందుకే నేను వారి భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడానికి రేయింబవళ్లు కృషి చేస్తున్నాను. దేశ రైతులు, పేదలు.. వీరంతా నా కుటుంబం. అందుకే నేను వారి సాధికారత కోసం కృషి చేస్తున్నాను. మేరా భారత్‌... మేరా పరివార్‌. అందుకే కన్నియాకుమారి నుంచి కశ్మీర్‌ దాకా ముక్త కంఠంతో చెబుతోంది ‘మై హూ మోదీ పరివార్‌.. నాన్‌ దాన్‌ మోదీ కుటుంబం’’ అంటూ ప్రకటించారు. దీంతో సభ ఒక్కసారిగా ‘మోదీ మోదీ.. అంటూ మారుమోగింది. కాంగ్రెస్‌, డీఎంకేతో పాటు వారితో కలిసిన పార్టీలు అవినీతిలో మునిగిపోయాయన్నారు. ఇలాంటి అవినీతిపరుల్ని సంరక్షించేవారికి సుప్రీంకోర్టు నేడు స్పష్టమైన తీర్పునిచ్చిందన్నారు. దీంతో ఇండియా కూటమి వారికి అవినీతికి పాల్పడడం తప్ప మరొకటి చేతకాదన్నారు. ఇలాంటివారివల్లనే వ్యవస్థలకు ముప్పు పొంచివుందన్నారు. కుటుంబ పార్టీలకు అహంకారం అధికమని, అందుకే వారు దేశాన్ని, ప్రజలను హీనంగా చూస్తారన్నారు. అందుకే ఈ రోజు సుప్రీంకోర్టు డీఎంకేకు చెందిన ఓ మంత్రిని మందలించిందని పరోక్షంగా మంత్రి ఉదయనిధి విషయాన్ని ప్రస్తావించారు. తమిళనాడులో డ్రగ్స్‌ వినియోగం పెరిగిందని, ఇది చాలా బాధాకరమైన విషయమన్నారు. ‘‘నాకు మీ భవిష్యత్తు తరాల గురించి బాధ వుంది. వారిని అప్రమత్తం చేయాల్సిన అవసరముంది. ఈ ప్రభుత్వం కళ్లు మూసుకుని కూర్చుంది. మీరు బీజేపీని బలపరిస్తే తమిళనాడులోనూ నీతివంతమైన, అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేలా పాలన అందిస్తాం అని ప్రకటించారు. తమను ఆశీర్వదించడానికి భారీగా తరలివచ్చిన వారిని చూస్తే ఢిల్లీలోని ఏసీ గదుల్లో కూర్చుని కుట్రలు పన్నేవారికి కూడా నిద్ర పట్టదన్నారు.

రాష్ట్రప్రజలంటే ప్రత్యేక అభిమానం

- కేంద్ర మంత్రి మురుగన్‌

తమిళనాడు, తమిళ భాష, తమిళ ప్రజలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక అభిమానం. ఏ దేశానికి వెళ్లినా తమిళనాడు భాష, సంస్కృతి, సంప్రదాయాల గురించి మాట్లాడుతున్నారు. ఇక నుంచి మనమంతా మోదీ కుటుంబం అని గుర్తెరగాలి.

మనది మోదీ కుటుంబం

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గతంలో ఎన్నిమార్లు వచ్చినా ప్రస్తుత పర్యటన ప్రత్యేకమైనది. ఆయన తన కుటుంబాన్ని చూసేందుకు ప్రప్రథమంగా వచ్చారు. మాది మోదీ కుటుంబం. గోపాలపురం లాంటి కుటుంబంలాంటిది కాదు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌, స్టాలిన్‌ కుటుంబం లాంటిది కాదు.రాబోయే పార్లమెంటు ఎన్నికలు అత్యంత ప్రధానమైనవి. మోదీ కుటుంబం నుంచి 400 మంది ఎంపీలుగా ఎన్నిక కానున్నారు. రాబోయే 25 ఏళ్లలో చేపట్టాల్సిన పథకాలపై ప్రధాని మోదీకి స్పష్టత ఉంది. రాబోయే 60 రోజులు ఎంతో ముఖ్యమైనవని.

ముగిసిన మోదీ పర్యటన

ఒక్కరోజు పర్యటన కోసం సాయంత్రం 3.30 గంటలకు చెన్నై చేరిన ప్రధాని మోదీ.. విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో కల్పాక్కంలోని అణు విద్యుత్‌ కేంద్రానికి వెళ్లారు. అక్కడ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన బ్లాస్టర్‌ను ప్రారంభించిన అనంతరం తిరిగి విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా స్థానిక వైఎంసీఏ మైదానం చేరుకుని, అక్కడ బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభకు భారీగా కార్యకర్తలు హాజరవడం విశేషం.

Updated Date - Mar 05 , 2024 | 10:47 AM