Share News

PM Modi: నేడు కన్నియాకుమారికి మోదీ.. భారీ భద్రతా ఏర్పాట్లు

ABN , Publish Date - Mar 15 , 2024 | 09:48 AM

ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) శుక్రవారం ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కన్నియకుమారికి విచ్చేయనున్నారు. బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించనున్నారు.

PM Modi: నేడు కన్నియాకుమారికి మోదీ.. భారీ భద్రతా ఏర్పాట్లు

చెన్నై: ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) శుక్రవారం ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కన్నియకుమారికి విచ్చేయనున్నారు. బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో గణనీయమైన సీట్లను సాధించాలన్న పట్టుదలతో బీజేపీ ప్రయత్నాలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రధాని రాష్ట్రంలో వరుస పర్యటనలు చేపడుతున్నారు. ఇటీవలే ఆయన తిరుప్పూరు, తిరునల్వేలి, చెన్నైలో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించి పాలకపక్షం డీఎంకేపై పలు విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన కన్నియాకుమారిలో పర్యటించనున్నారు. కన్నియాకుమారి సమీపంలోని అగస్తీశ్వరం వివేకానంద కళాశాల మైదానంలో శుక్రవారం జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ సభలో కేంద్రమంత్రి ఎల్‌.మురుగన్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, పార్టీ ప్రముఖులు, శాసనసభ్యులు పాల్గొంటారు. ఈ బహిరంగ సభ అనంతరం ప్రధాని తిరువనంతపురానికి బయలుదేరి వెళతారు. మోదీ పర్యటనను పురస్కరించుకున్ని కన్నియాకుమారి అంతటా పోలీసు ఉన్నతాధికారులు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. బహిరంగ సభ ప్రాంతం వద్ద ఇప్పటికే ప్రధాని ప్రత్యేక భద్రతా దళం అధికారులు నిఘా వేశారు. రాష్ట్ర పోలీసులు కూడా కళాశాల మైదానం చుట్టూ బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం భద్రతా విభాగం అధికారులు హెలికాప్టర్‌ ట్రయల్‌ రన్‌ చేసి పరిశీలించారు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల వరకూ ఆ రహదారిలో వాహనాల రాకపోకలపై నిషేధం అమలు చేయనున్నారు. కన్నియాకుమారి పర్యటన ముగించుకుని తిరువనంతపురానికి తిరిగి వెళ్ళనున్న ప్రధాని.. మళ్ళీ ఈ నెల 18న సేలంలో, 19న కోయంబత్తూరులో జరిగే బహిరంగసభలో పాలొనున్న విషయం తెలిసిందే.

Updated Date - Mar 15 , 2024 | 09:48 AM