Share News

BJP: బీజేపీవైపు నటి మీనా చూపు.. త్వరలో పార్టీలో చేరే అవకాశం..?

ABN , Publish Date - Jan 17 , 2024 | 08:14 AM

సినీ నటి మీనా(Movie actress Meena) బీజేపీలో చేరనున్నారా?.. అందుకే ఆమెకు బీజేపీ(BJP) అధిష్ఠాం తగిన ప్రాధాన్యం ఇస్తోందా?.. దీనిపై ఇప్పటికే ఇరువర్గాలు స్పష్టతకు వచ్చాయా?..

BJP: బీజేపీవైపు నటి మీనా చూపు.. త్వరలో పార్టీలో చేరే అవకాశం..?

చెన్నై, (ఆంధ్రజ్యోతి): సినీ నటి మీనా(Movie actress Meena) బీజేపీలో చేరనున్నారా?.. అందుకే ఆమెకు బీజేపీ(BJP) అధిష్ఠానం తగిన ప్రాధాన్యం ఇస్తోందా?.. దీనిపై ఇప్పటికే ఇరువర్గాలు స్పష్టతకు వచ్చాయా?.. అవుననే అంటున్నాయి విశ్వసనీయవర్గాలు. ఇందులో భాగంగానే ఇటీవల కేంద్ర సమాచార, మత్స్య అభివృద్ధి, పశు సంవర్థక శాఖ మంత్రి ఎల్‌.మురుగన్‌ నిర్వహించిన పొంగల్‌ వేడుకలకు మీనాకు ఆహ్వానం అందిందని, అక్కడ కూడా కాషాయదళం ఎనలేని ప్రాధాన్యం ఇచ్చిందని తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఆది నుంచి సినీ ప్రముఖులదే కీలకపాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, దివంగత సీఎంలు ఎంజీఆర్‌, జయలలితతో పాటు ప్రస్తుతం ముఖ్యమంత్రి పీఠంపై ఉన్న స్టాలిన్‌ సైతం సినీ రంగం నుంచి వచ్చినవారే. అందుకే రాష్ట్ర రాజకీయాల్లో సినీవర్గాలకు తగిన ప్రాధాన్యం, గుర్తింపు ఉంది. కానీ ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో సినీ ప్రముఖుల సందడి తగ్గినట్లు కనిపిస్తోంది. అయితే బీజేపీ మాత్రం సినీ ప్రముఖులకు విరివిగా సభ్యత్వం ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్‌.మురుగన్‌ ఇంట్లో జరిగిన పొంగల్‌ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పెద్దలు హాజరైన విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో సినీ నటి మీనా హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు. అంతేగాక ఆమెను మురుగన్‌ పలువురు అగ్రనేతలకు పరిచయం చేయడం కనిపించింది. ఒకరకంగా చెప్పాలంటే రాష్ట్రం నుంచి వెళ్లిన వారిలో మీనా ప్రత్యేక ఆకర్షణ నిలిచారు. ప్రధాని మోదీతో కలిసి పొంగల్‌ తయారీలోనూ పాల్గొన్నారు. ఆమె బీజేపీలో చేరనున్నారని, అందుకే ఆమెకు అంత ప్రాధాన్యత ఇచ్చారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎల్‌.మురుగన్‌ ఉన్నప్పుడు పలువురు సినీ ప్రముఖులు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు కూడా ఆయనే మీనాను పార్టీలో చేర్పించేందుకు సన్నాహాలు చేశారని తెలుస్తోంది. ఇందుకు మీనా కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

nani1.1.jpg

దక్షిణ చెన్నై నుంచి పోటీ?

‘ఇండియా’ కూటమిలో చేరనున్న ‘మక్కల్‌ నీదిమయ్యం’ అధినేత, సీనియర్‌ నటుడు కమలహాసన్‌ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో దక్షిణ చెన్నై నుంచి పోటీ చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయనకు పోటీగా మీనాను బరిలోకి దింపాలని బీజేపీ నేతలు భావిస్తున్నట్లు తెలిసింది. కమల్‌పై మీనా పోటీ చేస్తేనే అక్కడ గట్టిపోటీ ఇచ్చే అవకాశముందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీనికి తోడు దక్షిణ చెన్నైలో బీజేపీకి కొంతమేరకు పట్టుంది. అందుకే ఇక్కడి నుంచి మీనాను రంగంలోకి దింపాలని యోచిస్తున్నారని, ఇందుకు ఆమె కూడా చూచాయగా సరేనన్నట్లు బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే మీనా కుటుంబీకులు మాత్రం ఈ వ్యవహారాన్ని కొట్టి పారేస్తున్నారు. పొంగల్‌ వేడుకలకు ఆహ్వానం అందితేనే మీనా ఢిల్లీ వెళ్లారని, పార్టీలో చేరికకు సంబంధించి తమకెలాంటి సమాచారం లేదని వారు పేర్కొంటున్నారు.

Updated Date - Jan 17 , 2024 | 10:54 AM