Share News

BJP: ఒడిశా బీజేపీ సీఎం పదవిపై ఉత్కంఠ.. తెరపైకి మరొకరు

ABN , Publish Date - Jun 09 , 2024 | 07:06 PM

ఒడిశాలో తొలిసారి అధికారం దక్కించుకున్న బీజేపీ(BJP).. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ప్రమాణ స్వీకార తేదీని జూన్ 10గా నిర్ణయించగా.. తాజాగా దానిని 12కు వాయిదా వేశారు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండటంతో బీజేపీ పెద్దలంతా బిజీ బిజీగా గడపనున్నారు.

BJP: ఒడిశా బీజేపీ సీఎం పదవిపై ఉత్కంఠ.. తెరపైకి మరొకరు

ఇంటర్నెట్ డెస్క్: ఒడిశాలో తొలిసారి అధికారం దక్కించుకున్న బీజేపీ(BJP).. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ప్రమాణ స్వీకార తేదీని జూన్ 10గా నిర్ణయించగా.. తాజాగా దానిని 12కు వాయిదా వేశారు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండటంతో బీజేపీ పెద్దలంతా బిజీ బిజీగా గడపనున్నారు.

ఈ క్రమంలోనే ప్రమాణ స్వీకార తేదీని వాయిదా వేసినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తరువాతి రోజే కొత్తగా ఎన్నికైన ఎంపీలతో మోదీ భేటీ కానున్నారు. జూన్‌ 11న ఒడిశా బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ క్రమంలోనే ఒడిశా కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదాపడింది.


తెరపైకి మరొకరు..

ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారైనా ఒడిశా ముఖ్యమంత్రి పీఠం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. సీఎం పదవిని ఆశిస్తున్న వారు చాలా మంది ఉండటంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. పదవిని ఆశిస్తున్న వారిలో బీజేపీ సీనియర్ నేత సురేశ్‌ పుజారీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఢిల్లీకి బయల్దేరి వెళ్లడంతో ఆశావహుల జాబితాలో ఆయన పేరు ఉంటుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

సురేశ్ పూజారీ 2019 ఎన్నికల్లో బార్‌గఢ్‌ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బ్రజరాజ్‌నగర్‌ స్థానం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే సీఎం ఎవరనేది బీజేపీ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.


త్వరలోనే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు భువనేశ్వర్‌లోని జనతా మైదాన్‌లో సీఎం ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 147 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 78 చోట్ల విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. 25 ఏళ్లుగా అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ ఓటమిపాలైంది.

Updated Date - Jun 09 , 2024 | 07:06 PM