Share News

NDA Vs INDIA: ఒకే విమానంలో నితీష్‌, తేజస్వి.. ప్రయాణం తర్వాత సీన్ ఇదీ..

ABN , Publish Date - Jun 05 , 2024 | 04:06 PM

కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై హస్తినలో చర్చలు ఊపందుకోనున్న తరుణంలో బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ యునైటెడ్ నేత నితీష్ కుమార్, రాష్ట్రీయ జనతా దళ్ నేత తేజస్వి యాదవ్ కలిసి ఒకే విమానంలో ప్రయాణించారు. ఉదయం 10.30 గంటలకు ఇద్దరూ విస్తారా విమానంలో ఢిల్లీకి బయలుదేరడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

NDA Vs INDIA: ఒకే విమానంలో నితీష్‌, తేజస్వి.. ప్రయాణం తర్వాత సీన్ ఇదీ..

న్యూఢిల్లీ: కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై హస్తినలో చర్చలు ఊపందుకుంటున్న తరుణంలో బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ యునైటెడ్ (JDU) నేత నితీష్ కుమార్ (Nitish Kumar), రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేత తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) కలిసి ఒకే విమానంలో ప్రయాణించారు. ఉదయం 10.30 గంటలకు ఇద్దరూ విస్తారా విమానంలో ఢిల్లీకి బయలుదేరడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ.. ఎన్డీయేలో భాగస్వామిగా ఉండగా, 'ఇండియా' (I.N.D.I.A.) కూటమిలో ఆర్జేడీ భాగస్వామిగా ఉంది. ఢిల్లీలో బుధవారంనాడు జరిగే ఎన్డీయే సమావేశంలో నితీష్, 'ఇండియా' కూటమి సమావేశంలో తేజస్వి పాల్గొనే అవకాశం ఉంది. ఇలాంటి కీలక తరుణంలో ఈ ఇద్దరు నేతలు కలిసి ఒకే విమానంలో ప్రయాణించడంతో మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి.


కొద్ది నెలల క్రితం వరకూ బీహార్‌లో జేడీయూ, ఆర్జేడీ కూటమి ప్రభుత్వం నడిచింది. నితీష్‌కు డిప్యూటీగా (ఉప ముఖ్యమంత్రి) తేజస్వి పనిచేశారు.ఆ తర్వాత నితీష్ 'యూ-టర్న్' తీసుకుని బీజేపీతో చేతులు కలిపి తిరిగి సీఎంగా పాలన కొనసాగించారు. ఈసారి ఎన్డీయేను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టే ప్రసక్తే లేదని నితీష్ పలు వేదకలపై సైతం గట్టిగానే చెప్పారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో పోటీ చేసిన జేడీయూ 12 సీట్లు కూడా కైవసం చేసుకుంది. అయితే ఎన్నికల ఫలితాలకు ముందు తేజస్వి చేసిన వ్యాఖ్యలు మళ్లీ నితీష్ పార్టీ మారే అవకాశాలున్నాయనే సంకేతాలనిచ్చారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నితీష్ చాలా పెద్ద నిర్ణయమే తీసుకోనున్నారంటూ తేజస్వి వ్యాఖ్యానించడంతో రాష్ట్రంలో తిరిగి రెండు పార్టీలు కలిసే అవకాశాలున్నాయనే సంకేతాలు వెళ్లాయి. ఈ క్రమంలో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఎన్డీయే, 'ఇండియా' కూటమి కీలక సమావేశాల కోసం ఇరువురూ ఢిల్లీకి బయలుదేరడం, ఒకే విమానంలో జర్నీ చేయడం మరోసారి ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. 'ఇండియా' కూటమి సైతం కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలపై దృష్టి సారించిన నేపథ్యంలో ఏ నిమిషంలో ఏమి జరుగుతుందనే ఆసక్తి సైతం నెలకొంది.

Modi Resignation: ప్రధాని మోదీ రాజీనామా.. మళ్లీ ముహూర్తం ఫిక్స్!


జేడీయూ వివరణ..

నితీష్, తేజస్వి ఒకే విమానంలో కలిసి జర్నీ చేయడంపై జేడీయూ నేత త్యాగి వెంటనే స్పందించారు. ''ఇద్దరూ ఒకే విమానంలో ప్రయాణించడం యాదృచ్ఛికం. జేడీయూ వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదు. మేము ఎన్డీయేతో ఉన్నాం, ఎన్డీయేతోనే ఉంటాం. దీనిపై మేము ఆశాభావంతోనే ఉన్నాం'' అని చెప్పారు.


తేజస్వి ఏమన్నారంటే..?

నితీష్‌ కుమార్‌తో కలిసి ఒకే విమానంలో ప్రయాణించడం, ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలపై తేజస్విని మీడియా ప్రశ్నించినట్టు ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ''నితీష్, నేనూ ఒకరినొకరు అభినందించుకున్నాం. ఆ తర్వాత ఏం జరుగుతుందనే దానిపై ఓపిక పట్టండి. జరిగేది చూస్తుండండి'' అని సమాధానమిచ్చారు.

For Latest News and National News Click Here

Updated Date - Jun 05 , 2024 | 04:32 PM