Share News

Rajya Sabha: కేవలం నాలుగే సీట్లు... రాజ్యసభలో మెజారిటీ మార్క్‌కు చేరువలో ఎన్డీయే

ABN , Publish Date - Feb 28 , 2024 | 03:36 PM

రాజ్యసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన హవా చాటుకుంది. పెద్దలసభలో మెజారిటీ మార్క్‌కు అత్యంత చేరువలోకి వచ్చింది. మంగళవారంనాడు జరిగిన 56 రాజ్యసభ స్థానాల ఎన్నికల్లో బీజేపీ 30 సీట్లు కైవసం చేసుకుని పైచేయి సాధించింది. వీటిలో పోటీ లేకుండానే గెలిచిన 20 సీట్లు ఉన్నాయి. దీంతో రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీ ఎంపీల సంఖ్య 97కు చేరింది.

Rajya Sabha: కేవలం నాలుగే సీట్లు... రాజ్యసభలో మెజారిటీ మార్క్‌కు చేరువలో ఎన్డీయే

న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల్లో (Rajya Sabha elections) భారతీయ జనతా పార్టీ (BJP) తన హవా చాటుకుంది. పెద్దలసభలో మెజారిటీ మార్క్‌కు అత్యంత చేరువలోకి వచ్చింది. మంగళవారంనాడు జరిగిన 56 రాజ్యసభ స్థానాల ఎన్నికల్లో బీజేపీ 30 సీట్లు కైవసం చేసుకుని పైచేయి సాధించింది. వీటిలో పోటీ లేకుండానే గెలిచిన 20 సీట్లు ఉన్నాయి. దీంతో రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీ ఎంపీల సంఖ్య 97కు చేరింది. ఇదే సమయంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే (NDA) బలం 117కు చేరింది. 240 మంది సభ్యుల రాజ్యసభలో మెజారిటీ మార్క్ 121 కావడంతో మరో నాలుగు సీట్లు గెలుచుకుంటే ఎన్డీయే మెజారిటీ మార్క్‌ను దాటినట్టే.


ఖాళీగా ఉన్న 56 రాజ్యసభ స్థానాలకు మంగళవారంనాడు జరిగిన ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో క్రాస్ ఓటింగ్ చోటుచేసుకుంది. బీజేపీ 10 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్-3, సమాజ్‌వాదీ పార్టీ 2 స్థానాల్లో గెలుపొందాయి. గత వారంలో 41 మంది అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైంది. ప్రధాన పార్టీల్లో బీజేపీకి ఉత్తరప్రదేశ్‌ నుంచి అదనంగా మరో సీటు, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఏకైక సీటు దక్కాయి. మంగళవారం జరిగిన ఎన్నికలకు ముందు ఎగువసభలో ఎన్డీయేకు 109 మంది సభ్యుల బలం ఉంది. 238 సభ్యుల్లో హాఫ్ మార్క్ దాటడానికి మరో 10 మంది అవసరం ఉంది. విపక్ష 'ఇండియా' కూటమికి 89 మంది ఎంపీల బలం ఉంది. ఫలితాలు వెలువడిన తర్వాత సంఖ్యాబలంలో చోటుచేసుకున్న మార్పుల ప్రకారం రాజ్యసభలో బీజేపీ 97 మంది సభ్యులతో ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. వీరిలో పార్టీలో చేరిన ఐదుగురు నామినేటెడ్ సభ్యులు కూడా ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్ నిలిచింది. కాంగ్రెస్‌ సంఖ్యా బలం 29కి చేరుకోగా, తృణమూల్ కాంగ్రెస్-13, డీఎంకే-10, ఆప్-10, బీజేపీ-9, వైఎస్ఆర్‌సీపీ-9, బీఆర్ఎస్-7, ఆర్జేడీ-6, సీపీఎం-5, ఏఐఏడీఎంకే-4, జేడీ(యూ)-4 మంది ఎంపీలున్నారు. ఎన్డీయే సంఖ్యా బలం 117కు చేరింది. అంటే మెజారిటీ మార్క్ 121కి కేవలం నాలుగు సీట్లే తక్కువ.

Updated Date - Feb 28 , 2024 | 03:36 PM