Share News

PM Modi: నేడు తిరుచ్చికి ప్రధాని మోదీ.. విమానాశ్రయ కొత్త టెర్మినల్‌ ప్రారంభోత్సవం

ABN , Publish Date - Jan 02 , 2024 | 07:51 AM

తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మితమైన కొత్త టెర్మినల్‌ను ప్రారంభించేందుకు మంగళవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) రానున్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ రాష్ట్ర నాయకులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

PM Modi: నేడు తిరుచ్చికి ప్రధాని మోదీ.. విమానాశ్రయ కొత్త టెర్మినల్‌ ప్రారంభోత్సవం

- రాష్ట్ర బీజేపీ నేతలతో ప్రత్యేక భేటీ

- 31 మంది ముఖ్యులకు ఆహ్వానం

- కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా రాక

చెన్నై, (ఆంధ్రజ్యోతి): తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మితమైన కొత్త టెర్మినల్‌ను ప్రారంభించేందుకు మంగళవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) రానున్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ రాష్ట్ర నాయకులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. లోక్‌సభ ఎన్నికల వ్యూహరచనపై ఆయన పార్టీ నిర్వాహకులతో సమీక్ష జరపనున్నారు. ఇందుకోసం ఇప్పటికే 31 మంది ముఖ్యనేతలకు ఆహ్వానాలు వెళ్లాయి. కేంద్రంలో బీజేపీ బలంగా కనిపిస్తున్నప్పటికీ రాష్ట్రంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకూ బీజేపీతో కలిసి సాగిన అన్నాడీఎంకే దూరంగా జరిగింది. దీంతో చిన్నాచితకా పార్టీలతో కలిసిఎన్నికలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి బీజేపీకి తప్పనిసరైంది. అయితే దక్షిణాదిలోనూ పట్టు నిలుపుకోవాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ అధిష్ఠానం తమిళనాడు నుంచి కనీసం రెండు స్థానాలనైనా సాధించాలని తలపోస్తోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే బీజేపీ అధిష్ఠానం వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా తిరుచ్చి విమానాశ్రయ కొత్త టెర్మినల్‌ ప్రారంభోత్సవంకోసం వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. రాష్ట్రనేతలతో భేటీ కానున్నారు. వారికి ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఈసందర్భంగా మోదీ పలువురు సీనియర్లతోనూ విడివిడిగా మాట్లాడనున్నట్లు సమాచారం. కూటమి నుండి అన్నాడీఎంకే వైదొలగిన నాలుగునెలల తర్వాత తొలిసారి ప్రధాని మోదీ మంగళవారం ఉదయం రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే నిమిత్తం ఆయన తిరుచ్చికి విచ్చేయనున్నారు. డీఎంకే వంటి ప్రధాన పార్టీలు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కనుక వచ్చే లోక్‌సభ ఎన్నికలు రాష్ట్ర బీజేపీకి ఓసవాలు లాంటిదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

బీజేసీ నేతలతో భేటీ...

ప్రధాని మోదీ ప్రభుత్వ కార్యక్రమాల కోసం వస్తున్నప్పటికీ రాష్ట్ర బీజేపీ నేతలతోనూ భేటీ కానున్నారు. రాష్ట్ర బీజేపీకి వున్న బలాలు, బలహీనతలపై ఇప్పటికే సమాచారం తెప్పించుకున్న మోదీ.. వాటిపై రాష్ట్ర నేతలతో చర్చించనున్నట్లు తెలిసింది. తిరుచ్చి ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో ఉన్న స్టార్‌హోటల్‌లో ఏర్పాటయ్యే ఈ సమావేశానికి రమ్మంటూ ఇప్పటికే 31 మందికి ఆహ్వానాలు అందాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, వ్యవస్థాపక కార్యదర్శి కేశవ వినాయగన్‌, కేంద్ర మాజీ మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌, హెచ్‌.రాజా, డిప్యూటీ అధ్యక్షులు నయినార్‌ నాగేంద్రన్‌, ఎం.చక్రవర్తి, కరు నాగరాజన్‌, కరుప్పు మురుగానందం, శీనివాసన్‌, వీపీ దురైసామి, శాసనసభ్యులు ఎంఆర్‌ గాంధీ, డాక్టర్‌ సరస్వతి సహా 31 మంది ఈ సమావేశంలో పాల్గొంటారు. కూటమి నుంచి అన్నాడీఎంకే వైదొలగిన నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ బలం ఎలా ఉంది? లోక్‌సభ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తుపెట్టుకోకుండా పోటీ చేస్తే ఎలా ఉంటుంది? ప్రజల మద్దతు ఎలా ఉంది? వంటి అంశాపైనా మోదీ చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత కొన్ని కార్యాచరణ పథకాలు, ఎన్నికల వ్యూహరచనలు గురించి ఆయన పార్టీ నిర్వాహకులకు వివరించనున్నారు. ఈ సమావేశం ముగియగానే మోదీ తిరుచ్చి నుంచి లక్ష్యద్వీపాలకు బయలుదేరి వెళతారు. ఈ భేటీలో కేంద్రమంత్రి అమిత్‌షా కూడా పాల్గొంటారని తెలిసింది. ప్రధాని కార్యక్రమాలు ముగిసిన తర్వాత కూడా మధ్యాహ్నం 2.30 గంటలకు పార్టీ రాష్ట్ర శాఖ నిర్వాహకులు, జిల్లా నేతల సమావేశం కూడా జరుగనుంది. అన్నామలై అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశంలో ప్రధాని మోదీ సూచనలను వివరించనున్నారు. ప్రధాని మోదీ రాకను పురస్కరించుకుని తిరుచ్చి నగరంలో బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇదిలా ఉండగా ప్రధాని రాకను పురస్కరించుకుని తిరుచ్చి నగర వ్యాప్తంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

తిరుచ్చి ఎయిర్‌పోర్ట్‌ కొత్త టెర్మినల్‌ ప్రారంభోత్సవం

తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయ స్థాయి పెంచుతూ నూతనంగా రూ.1,200కోట్లతో నిర్మించిన కొత్త టెర్మినల్‌ను మంగళవారం ఉదయం ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానితోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విచ్చేయనుండటంతో పోలీసుల ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఐదంచెల భద్రతా ఏర్పాట్లు కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌షా మంగళవారం ఉదయం 10 గంటలకు తిరుచ్చి చేరుకుంటారు. ముందుగా విమానాశ్రయం నుంచి ఉదయం 10.30 గంటలకు ప్రధాని మోదీ భారతిదాసన్‌ యూనివర్శిటీలో జరిగే స్నాతకోత్సవాల్లో పాల్గొని విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఆతర్వాత అక్కడినుంచి 11.45 గంటలకు బయల్దేరి 12 గంటలకు తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంటారు. విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో పాటు కొత్త పథకాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అటుపిమ్మట స్టార్‌హోటల్‌లో పార్టీ నిర్వాహకులతో సమావేశమవుతారు.

పర్యటన ఇలా...

మంగళవారం ఉదయం 10.30 గంటలకు తిరుచ్చి భారతిదాసన్‌ విశ్వవిద్యాలయంలో జరిగే 38వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొని విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.1200 కోట్లతో నిర్మించిన కొత్త టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు. ఆ సభలో రూ.19,850 కోట్ల విలువైన వివిధ పథకాలను కూడా ఆయన ప్రారంభించనున్నారు. అంతేగాక ఇప్పటికే పూర్తయిన వివిధ పథకాలను కూడా ఆయన ప్రారంభిస్తారు. ఈ రెండు కార్యక్రమాల్లోనూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవితో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు.

Updated Date - Jan 02 , 2024 | 12:22 PM