Madhuyashki: బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం
ABN , Publish Date - Jan 12 , 2024 | 08:17 AM
దేశంలో గత పదేళ్ల బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) జాతీయ కార్యదర్శి, తెలంగాణ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్(Madhuyashki Goud) వ్యాఖ్యానించారు.

- ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్
ప్యారీస్(చెన్నై): దేశంలో గత పదేళ్ల బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) జాతీయ కార్యదర్శి, తెలంగాణ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్(Madhuyashki Goud) వ్యాఖ్యానించారు. రాయపేటలోని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) ప్రధాన కార్యాలయమైన సత్యమూర్తి భవన్‌లో గురువారం జరిగిన ప్రత్యేక సమావేశంలో ఏఐసీసీ సమాచార విభాగం నిర్వాహకురాలు భవ్యా నరసింహమూర్తితో కలసి మధుయాష్కీ పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ చేపట్టిన ‘దేశ సమైక్యత పాదయాత్ర’పై తమిళంలో ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను నమ్మించి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ గత పదేళ్లలో ప్రజల సంక్షేమాన్ని, దేశాభివృద్ధిని విస్మరించి అదానీ వంటి సిరిమంతుల అభివృద్ధికి అండగా నిలిచారని విమర్శించారు. నిత్యావసర సరుకులు, ఇంధనం ధరలు విపరీతంగా పెంచారని, పెట్రోల్, డీజిల్ ధరలను సంవత్సర కాలంగా తగ్గించిన దాఖలాలు లేవన్నారు. మునుపెన్నడూ లేని స్థాయిలో విద్యావంతుల ఉద్యోగావకాశాల కలలు నెరవేరలేదని, రోజురోజుకు నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూ వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలు, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలకు న్యాయపరంగా కల్పించాల్సిన రిజర్వేషన్లు సైతం న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కారణం చూపి, కేంద్రం ఆ వర్గాల ప్రజలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఐటీ, ఈడీ విభాగాలను ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను అడ్డుకొనే విధంగా కేంద్రం వినియోగించుకోవడం పరిపాటి అయిందన్నారు. ముఖ్యంగా ప్రజా సమస్యలపై పార్లమెంటు ఉభయసభల్లో గళం విప్పే ప్రతిపక్షాల ఎంపీలను డిస్మిస్ చేసేలా చట్టాలు రూపొందించడం దారుణమన్నారు.కార్యక్రమంలో టీఎన్‌సీసీ ఎస్సీ విభాగ అధ్యక్షుడు నిరంజన్ కుమార్, నాయకులు గోపన్న, ఎస్‌ఏ వాసు, నిలవన్, పొన్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.