Share News

Lok Sabha Elections: రూ.50వేలకు మించి ఉంటే స్వాధీనమే..

ABN , Publish Date - Apr 05 , 2024 | 10:58 AM

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎలాంటి రశీదులు, ఆధార పత్రాలు లేకుండా రూ.50వేల వరకు నగదు తీసుకెళ్ళవచ్చునని, అయితే ఈ గరిష్టపరిమితిని పెంచినట్లు రాష్ట్ర వ్యాప్తంగా పుకార్లు పుట్టిస్తున్నారని, వాటిని నమ్మవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సత్యప్రద సాహు(Satyaprad Sahu) స్పష్టం చేశారు.

Lok Sabha Elections: రూ.50వేలకు మించి ఉంటే స్వాధీనమే..

- ఈసీ సత్యప్రదసాహు

చెన్నై: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎలాంటి రశీదులు, ఆధార పత్రాలు లేకుండా రూ.50వేల వరకు నగదు తీసుకెళ్ళవచ్చునని, అయితే ఈ గరిష్టపరిమితిని పెంచినట్లు రాష్ట్ర వ్యాప్తంగా పుకార్లు పుట్టిస్తున్నారని, వాటిని నమ్మవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సత్యప్రద సాహు(Satyaprad Sahu) స్పష్టం చేశారు. సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎన్నికల సిబ్బంది తక్కువగా ఉండటం వల్లే తపాలా ఓట్ల సేకరణను దశలవారీగా చేపడుతున్నట్లు తెలిపారు. 85 యేళ్ల వయస్సున్న సీనియర్‌ సిటిజెన్లు ఈ నెల 18 వరకు తపాలా ఓట్లు వేయవచ్చునని చెప్పారు. ఈ ఎన్నికల్లో కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మార్క్‌ 3 రకం ఈవీఎంలను ఉపయోగిస్తున్నామని తెలిపారు. రూ.50వేలకు మించి నగదును తీసుకెళ్లకూడదనే ఆంక్షల వల్ల వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని, నగదు పరిమితిని రూ.2లక్షలకు పెంచాలని వ్యాపార సంఘాల సమాఖ్య నాయకులు విజ్ఞప్తి చేశారని, ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపామని, ఇప్పటివరకూ నగదు పరిమితి పెంచుతూ ఎలాంటి ఉత్తర్వులు రాలేదని ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు.

8 వేల కేంద్రాలు సమస్యాత్మకం...

ఇదిలా ఉండగా లోక్‌సభ ఎన్నికల్లో 8050 పోలింగ్‌ కేంద్రాలు సమస్యాత్మకమైనవని, 181 పోలింగ్‌ కేంద్రాలు మరింత సమస్యాత్మకమైనవని గుర్తించినట్లు ఆయన చెబుతూ ఆయా కేంద్రాల వద్ద అదనపు భద్రత కల్పించనున్నట్లు తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 68వేలకు పైగా ఏర్పాటు చేయనున్న పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లకు అన్ని సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. షామియానాలు, తాగునీటి సుదపాయాలు కల్పించనున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల మందికి పైగా ప్రభుత్వ సిబ్బంది, ఉపాధ్యాయులు ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారని తెలిపారు.

బూత్‌ స్లిప్‌లు గుర్తింపు కార్డు కాదు...

ఎన్నికల సంఘం ఓటర్లకు అందజేస్తున్న ఫొటోలతో కూడిన బూత్‌ స్లిప్‌లు ఓటు వేయడానికి అవసరమైన గుర్తింపు కార్డు కాదని సత్యప్రద సాహు స్పష్టం చేశారు. ఆధార్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు సహా 13 రకాల ధ్రువీకరణ పత్రాలలో ఏదైనా ఒకటి చూపి ఓటు వేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

ఇదికూడా చదవండి: ముస్లింలకు విడాకులు మంజూరు అధికారం ఫ్యామిలీ కోర్టుకు ఉంది

Updated Date - Apr 05 , 2024 | 11:02 AM