Share News

కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తొలగించలేం

ABN , Publish Date - Apr 05 , 2024 | 05:29 AM

ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి అరవింద్‌ కేజ్రీవాల్‌ను తొలగించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌ను) విచారణకు స్వీకరించటానికి గురువారం ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. సీఎంగా కొనసాగాలా? వద్దా? అనేది కేజ్రీవాల్‌ వ్యక్తిగత నిర్ణయమని తెలిపింది. కోర్టు ద్వారా రాష్ట్రపతి పాల న విధించిన

కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తొలగించలేం

అది ఆయన వ్యక్తిగత నిర్ణయం

సీఎం అరెస్టుతో పాలన స్తంభించిందని చెప్పలేం

పిల్‌ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి అరవింద్‌ కేజ్రీవాల్‌ను తొలగించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌ను) విచారణకు స్వీకరించటానికి గురువారం ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. సీఎంగా కొనసాగాలా? వద్దా? అనేది కేజ్రీవాల్‌ వ్యక్తిగత నిర్ణయమని తెలిపింది. కోర్టు ద్వారా రాష్ట్రపతి పాల న విధించిన దాఖలాలు లేవని, పదవికి కేజ్రీవాల్‌ రాజీనామా చేయాలా? వద్దా? అన్నది న్యాయపరమైన అంశం కాదని.. ఆయన అరెస్టుతో ప్రభుత్వం స్తంభించిపోయిందని చెప్పలేమని పేర్కొంది. పరిపాలన కొనసాగించడంలో ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్‌జీ) పూర్తిగా సమర్థుడని, ఆయనకు తమ మార్గదర్శకత్వం అవసరం లేదని వెల్లడించింది. ఈ సమస్యకు పరిష్కారం న్యాయస్థానాల్లో లేదని, ఇతర రాజ్యాంగ సంస్థలు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సూచించింది. ఈ మేరకు హిందూసేన అధ్యక్షుడు విష్ణుగుప్తా దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఇంతకుముందు కూడా ఇటువంటి పిల్‌ ఒకటి దాఖలు కాగా.. దానిని కూడా హైకోర్టు విచారణకు తీసుకోలేదు. మార్చి 21న కేజ్రీవాల్‌ అరెస్టు తర్వాత ఢిల్లీలో పాలన స్తంభించిందని, రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడిందని విష్ణుగుప్తా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు, కేజ్రీవాల్‌ జైలులో ఉదయం, సాయంత్రం గంటన్నర చొప్పున ధ్యానం, యోగా చేస్తున్నారని అధిక సమయం పుస్తక పఠనంలో గడుపుతున్నారని తిహాడ్‌ జైలు వర్గాలు తెలిపాయి. రామాయణం, భగవద్గీత, హౌ ప్రైమినిస్టర్స్‌ డిసైడ్‌ పుస్తకాలను కేజ్రీవాల్‌ తెప్పించుకున్న విషయం తెలిసిందే. కాగా, ప్రతి రోజూ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆప్‌ ఎమ్మెల్యేలకు కేజ్రీవాల్‌ సూచించారు. ఈ మేరకు కేజ్రీవాల్‌ సందేశాన్ని ఆయన భార్య సునీత ఓ వీడియోలో చదివి వినిపించారు.

Updated Date - Apr 05 , 2024 | 05:29 AM