Share News

Kejriwal: వారి కోసం బీజేపీ తలుపులు తెరిచింది.. సీఏఏపై కేజ్రీవాల్ కన్నెర్ర..

ABN , Publish Date - Mar 13 , 2024 | 11:15 AM

పొరుగు దేశాల్లో అణచివేతకు గురవుతున్న మైనారిటీ వర్గాలకు పౌరసత్వం కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఇది ఎలక్షన్ స్టంట్ అని, ఎన్నికల సమయంలో మాత్రమే కమలం పార్టీకి ఇలాంటి విషాలు గుర్తుకు వస్తాయని విమర్శలు గుప్పిస్తున్నాయి.

Kejriwal: వారి కోసం బీజేపీ తలుపులు తెరిచింది.. సీఏఏపై కేజ్రీవాల్ కన్నెర్ర..

పొరుగు దేశాల్లో అణచివేతకు గురవుతున్న మైనారిటీ వర్గాలకు పౌరసత్వం కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఇది ఎలక్షన్ స్టంట్ అని, ఎన్నికల సమయంలో మాత్రమే కమలం పార్టీకి ఇలాంటి విషాలు గుర్తుకు వస్తాయని విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా దిల్లీ సీఎం కేజ్రీవాల్ ( Kejriwal ) సైతం అధికార బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. దేశ ఆర్థిక సమస్యల నుంచి దృష్టిని మళ్లించేందుకే సీఏఏ ను తీసుకువచ్చారని ఆరోపించారు. సీఏఏ ద్వారా పాకిస్థాన్, బంగ్లాదేశ్ వాసులకు భారతదేశంలోకి తలుపులు తెరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికే కాకుండా రాష్ట్రాలకు సైతం పెను విధ్యంసం కలిగించే చర్యగా కేజ్రీవాల్ అభివర్ణించారు.

“పాకిస్థాన్, బంగ్లాదేశ్ నివాసితులకు బీజేపీ భారతదేశ తలుపులు తెరిచింది. ఇది దేశానికి ప్రమాదకరం. ఈశాన్య రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. ముఖ్యంగా అసోం వాసుల ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారుల కారణంగా అసోం ఇప్పటికే ప్రభావితమవుతోంది. అలాంటి అక్రమ వలసదారులకు పౌరసత్వం కల్పించాలని బీజేపీ కోరుకుంటోంది.’’

- కేజ్రీవాల్, ఆప్ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి


ప్రస్తుతం దేశం ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అతిపెద్ద సమస్యలను ఎదుర్కొంటోందని కేజ్రీవాల్ అన్నారు. ద్రవ్యోల్బణంతో సామాన్య ప్రజలు చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ భారాన్ని మోయలేక పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల నడుమ నిరుద్యోగం, ధరల పెరుగుదల సమస్యలను పరిష్కరించకుండా కేంద్ర ప్రభుత్వం సీఏఏ అమలుపరచడం ఎంత వరకు సమంజసం అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 13 , 2024 | 11:16 AM