Share News

Money laundering case: మాజీ ముఖ్యమంత్రికి ఈడీ సమన్లు

ABN , Publish Date - Feb 12 , 2024 | 08:38 PM

మనీలాండరింగ్ కేసులో జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాకుఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజా సమన్లు జారీ చేసింది. జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన పాత కేసులో శ్రీనగర్‌లోని ఈడీ కార్యాలయం ముందు మంగళవారంనాడు హాజరుకావాలని కోరింది.

Money laundering case: మాజీ ముఖ్యమంత్రికి ఈడీ సమన్లు

న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసు (Money laundering) కేసులో జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తాజా సమన్లు జారీ చేసింది. జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (జేకేసీఏ) నిధుల దుర్వినియోగానికి సంబంధించిన పాత కేసులో శ్రీనగర్‌లోని ఈడీ కార్యాలయం ముందు మంగళవారంనాడు హాజరుకావాలని కోరింది. 86 ఏళ్ల ఫరూక్ అబ్దుల్లాను జనవరి 11న తమ ముందు హాజరుకావాలని ఇటీవల ఈడీ సమన్లు జారీచేసినప్పటికీ ఆయన ఆరోగ్య కారణాల రీత్యా హాజరుకాలేదు.


ఫరూక్ అబ్దుల్లా 2001-2012 మధ్య కాలంలో జేకేసీఏ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కుంభకోణం జరిగిందని సీబీఐ ఆరోపణగా ఉంది. జేకేసీఏకు బీసీసీఐ రూ.112 కోట్లు కేటాయించిందని, వీటిలో 43.6 కోట్ల మేర కుంభకోణం జరిగిందని సీబీఐ 2018లో ఛార్జిషీటు నమోదు చేసింది. జేకేసీఏ ఆఫీసు బేరర్లతో సహా వివిధ వ్యక్తుల బ్యాంకు అకౌంట్లకు అక్రమంగా నిధులను మళ్లించారని సీబీఐ ఆరోపిస్తోంది. సీబీఐ ఛార్జిషీటు ఆధారంగా 2022లో ఫరూక్ అబ్దుల్లాపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.

Updated Date - Feb 12 , 2024 | 08:38 PM