Immigration Policies: ఆస్ట్రేలియా, జర్మనీకి చలో చలో!
ABN , Publish Date - Dec 29 , 2024 | 03:50 AM
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తమ ఇమిగ్రేషన్ విధానాలను సవరిస్తున్నాయి. కొన్ని దేశాలు వీసా నిబంధనలను సడలిస్తుంటే మరికొన్ని కొత్తగా పరిమితులు విధిస్తున్నాయి.

పైచదువుల కోసం భారత విద్యార్థుల మొగ్గు.. శాశ్వత నివాసం, ఉపాధి అవకాశాలూ పరిగణనలోకి
కఠిన వీసా నిబంధనలతో అమెరికా, యూకేకు దూరం
న్యూఢిల్లీ, డిసెంబరు 28: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తమ ఇమిగ్రేషన్ విధానాలను సవరిస్తున్నాయి. కొన్ని దేశాలు వీసా నిబంధనలను సడలిస్తుంటే మరికొన్ని కొత్తగా పరిమితులు విధిస్తున్నాయి. ఈ మార్పుల ప్రభావం విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసించాలనుకొనే భారతీయ విద్యార్థులపై పడుతోంది. కొన్నేళ్లుగా మన దేశ విద్యార్థులకు అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా గమ్యస్థానాలుగా ఉన్నాయి. చదువు పూర్తయిన తర్వాత ఉపాధితో పాటు శాశ్వత నివాసానికి అవకాశం కల్పించే దేశాలవైపు ప్రస్తుతం విద్యార్థులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ విషయంలో ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ వంటి దేశాలు భారతీయ విద్యార్థులకు ఆకర్షణీయమైన ఎంపికలుగా మారుతున్నాయి. దీనికి విరుద్ధంగా అమెరికా, యూకే ఈ ప్రక్రియలను సరళతరం చేయడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఒకప్పుడు భారతీయ విద్యార్థులకు మొదటి ఎంపికగా ఉన్న అమెరికాకు కొంతకాలంగా దరఖాస్తులు తగ్గుముఖం పట్టాయి. సంక్లిష్టమైన వీసా నిబంధనలు, పెరుగుతున్న తిరస్కరణ రేట్లు, ఉద్యోగ భద్రతపై ఆందోళనలు వంటి అంశాలు విద్యార్థులను పునరాలోచనలో పడేస్తున్నాయి. ట్రంప్ మళ్లీ అధికారంలోకి రావడంతో భారతీయ విద్యార్థులకు మరింత అనుకూలమైన ఇమిగ్రేషన్ విధానాలు, గ్రీన్ కార్డు జారీలో సడలింపులు ఇస్తారన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
కెనడా ఆంక్షలు కఠినతరం
స్నేహపూర్వ వీసా విధానాలు, బలమైన మౌలిక సదుపాయాలతో భారతీయ విద్యార్థులకు కెనడా చాలాకాలంగా కీలక గమ్యస్థానంగా ఉంది. అయితే కఠినమైన ఇమిగ్రేషన్ నిబంధనలు, పరిమితమైన అనుమతులు దరఖాస్తుల సంఖ్య క్షీణతకు కారణమవుతున్నాయి. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ 2024లో 4,37,000 స్టడీ పర్మిట్లను కేటాయించడం అంతర్జాతీయ విద్య పట్ల కెనడా నిబద్ధతకు నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు. భారతీయ విద్యార్థుల పట్ల యూకే మిశ్రమ వైఖరి కనబరిచింది. గ్రాడ్యుయేట్ విద్యార్థులు చదువులు పూర్తి చేసిన తర్వాత రెండేళ్ల పాటు పనిచేయడానికి అనుమతిస్తుంది. పీజీ విద్యార్థులు డిపెండెంట్లను తీసుకురావడంపై ఆంక్షలు విధించడం వారిని కలవరపెడుతోంది. విపరీతమైన రద్దీ, వనరుల కేటాయింపులో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడంలో భాగంగా 2025 నాటికి విదేశీ విద్యార్థుల నమోదును 2,70,000కు పరిమితం చేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. ఆస్ట్రేలియా వర్సిటీల్లో సీట్ల కోసం పోటీ మరింత పెరిగినప్పటికీ కెనడా తరహాలో పొడిగించిన పోస్టు స్టడీ వర్క్ ప్రయోజనాలు విద్యార్థులను ఊరిస్తున్నాయి.
నిబంధనలు సడలించిన జర్మనీ
భారతీయ విద్యార్థులకు జర్మనీ అత్యుత్తమ ఎంపికగా మారుతోంది. పోస్టు స్టడీ వర్క్ ఎంపికలు ప్రధాన ఆకర్షణగా మారాయి. నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలను పెంపొందిస్తూ నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు ఏటా 90వేల వీసాలు జారీ చేయాలని ఆ దేశం యోచిస్తోంది. వీసా నిబంధనల్లో మార్పులతో విద్యార్థులు సంప్రదాయ గమ్యస్థానాలను పక్కన పెట్టి ఫ్రాన్స్, ఐర్లాండ్, ఫిన్లాండ్ తదితర ప్రత్యామ్నాయాలనూ అన్వేషిస్తున్నారు.
ఇమిగ్రేషన్ నిబంధనలు సవరించిన న్యూజిలాండ్
న్యూజిలాండ్ ప్రభుత్వం అక్రెడిటేటెడ్ ఎంప్లాయర్ వర్క్ వీసా (ఏఈడబ్ల్యూవీ) నిబంధనలు సవరించింది. సగటు వేతన పరిమితిని తొలగించడం, వలసదారులకు పని అనుభవాన్ని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించడం, కొత్తగా సీజనల్ వీసాలను ప్రవేశపెట్టడం వంటి మార్పులు వచ్చే జనవరి నుంచి నాలుగు దశల్లో అమలులోకి రానున్నాయి. తాజా సవరణలతో ఎంప్లాయర్ అక్రిడిటేషన్ కోసం సగటు ప్రాసెసింగ్ సమయం 62 రోజుల నుంచి 14 రోజులకు తగ్గింది. అలాగే జాబ్ చెక్ ఉత్పాదకత రెట్టింపు కానుంది. ఉద్యోగుల సగటు వేతన పరిమితిని వచ్చే మార్చిలో తొలగించనున్నారు. ఈ మార్పుల ప్రభావం ప్రస్తుత ఉపాధి ఒప్పందాలపై ఉండదు. నివాస అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఉద్యోగులు తప్పనిసరిగా సంపాదించాల్సిన వేతనంలో ఏమార్పు లేదు. ఏఈడబ్ల్యూవీ వలసదారులు తమ పిల్లలను తీసుకురావడానికి ఏటా కనీసం 55,844 న్యూజిలాండ్ డాలర్లు (దాదాపు రూ.27 లక్షలు) సంపాదించాల్సి ఉంటుంది.