Share News

Himanta Biswa Sarma: మాకు రాహుల్ గాంధీ కావాలి.. హిమంత ఎందుకిలా అన్నారు?

ABN , Publish Date - Jan 25 , 2024 | 03:28 PM

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు కురిపించడమే పనిగా పెట్టుకున్న అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమకు రాహుల్ గాంధీ కావాలంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. అయితే.. ఆయన సెటైరికల్ కోణంలో ఈ స్టేట్‌మెంట్ ఇచ్చారు.

Himanta Biswa Sarma: మాకు రాహుల్ గాంధీ కావాలి.. హిమంత ఎందుకిలా అన్నారు?

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్న అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమకు రాహుల్ గాంధీ కావాలంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. అయితే.. ఆయన సెటైరికల్ కోణంలో ఈ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఉంటే, తమకు విజయం మరింత సులభతరం అవుతుందన్న కోణంలో హిమంత ఎక్స్ వేదికగా ‘మాకు రాహుల్ గాంధీ కావాలి’ అని చెప్పుకొచ్చారు. ఇంతకీ మేటర్ ఏమిటంటే..

ప్రస్తుతం భారత్ జోడో న్యాయ యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీకు ప్రాథమిక మార్గాల నుండి గౌహతిలో ప్రవేశించడానికి అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు, అస్సాం పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంపై హిమంత మాట్లాడుతూ.. ఆ ఘర్షణపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కూడా విచారణ జరుపుతుందని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను రాహుల్ గాంధీని లోక్‌సభ ఎన్నికల తర్వాత అరెస్ట్ చేస్తామని కూడా చెప్పారు.


హిమంత చేసిన ఈ ‘అరెస్ట్’ వ్యాఖ్యలపై కర్ణాటక కేబినెట్ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘లోక్‌సభ ఎన్నికల వరకు ఎందుకు వేచి ఉండాలి? రాహుల్ గాంధీ నిజంగానే చట్టాన్ని ఉల్లంఘిస్తే, ఇప్పుడే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మీరలా చేయలేరు. ఎందుకంటే.. రాహుల్ మాట్లాడుతోంది నిజాలని మీకు తెలుసు. మీ పొరుగు రాష్ట్రమైన మణిపూర్ ప్రజలకు మద్దతుగా మీరు నిలబడలేదు. రాహుల్ చేస్తున్న పని చూసి మీకు భయం చుట్టుకుంది’’ అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

ఈ ట్వీట్‌కి హిమంత బదులిస్తూ.. ‘‘లోక్‌సభ ఎన్నికల సమయంలో మాకు రాహుల్ గాంధీ కావాలి బ్రదర్’’ అంటూ ఎగతాళి చేశారు. అందుకే ఎన్నికల తర్వాత అరెస్ట్ చేస్తామని చెప్పానన్నారు. ఎలక్షన్ టైంలో రాహుల్ ఉంటే, తమకు విజయం సులభమవుతుందన్న అభిప్రాయాన్ని ఈ ట్వీట్ రూపంలో పరోక్షంగా తెలిపారు. మరోవైపు.. కొంతకాలం నుంచి తనకు, రాహుల్ మధ్య నడుస్తున్న మాటల యుద్ధం కూడా వ్యక్తిగతమని పేర్కొన్నారు. దీన్ని బట్టి.. ఈ ఇద్దరి మధ్య వ్యక్తిగత గొడవలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

Himanta-Rahul.jpg

Updated Date - Jan 25 , 2024 | 03:28 PM