Share News

Rahul Gandhi: ఈసారైనా హస్తవాసి?

ABN , Publish Date - Apr 28 , 2024 | 03:30 AM

అది 2004 సంవత్సరం..! సార్వత్రిక ఎన్నికలకు కొద్దిగా ముందు సమయం. వాజ్‌పేయీ లాంటి నాయకుడి హవాలో ఆరేళ్ల పాటు కేంద్రంలో అధికారానికి దూరమైంది కాంగ్రెస్‌ పార్టీ.

Rahul Gandhi: ఈసారైనా హస్తవాసి?

కేంద్రంలో పదేళ్లుగా అధికారానికి కాంగ్రెస్‌ దూరం.. మూడోసారీ ఓడితే మనుగడకు మరిన్ని కష్టాలు

  • రాహుల్‌ యాత్రల ఇమేజ్‌పై ఆశలు

అది 2004 సంవత్సరం..! సార్వత్రిక ఎన్నికలకు కొద్దిగా ముందు సమయం. వాజ్‌పేయీ లాంటి నాయకుడి హవాలో ఆరేళ్ల పాటు కేంద్రంలో అధికారానికి దూరమైంది కాంగ్రెస్‌ పార్టీ. మూడోసారీ ఓడితే ఇక అంతే సంగతులు అనే పరిస్థితి. దీంతో నాడు కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాంధీ నేరుగా రంగంలోకి దిగారు. లాలూ, ములాయం, పాసవాన్‌, సుర్జీత్‌, పవార్‌ తదితర కీలక నేతలను ఒప్పించి, మెప్పించి యూపీఏను ఏర్పాటు చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఈ కూటమి విజయకేతనం ఎగురవేసింది. పదేళ్లు అధికారంలో కొనసాగింది.


ఇది 2024 సంవత్సరం..! దేశాన్ని కమ్మేసిన మోదీ మేనియాతో.. వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో పరాజయం పాలై దశాబ్ద నుంచి ప్రతిపక్షానికి పరిమితమైంది కాంగ్రెస్‌ పార్టీ. ఇక ఇప్పుడు కూడా ఓటమి ఎదురైతే మనుగడ కష్టమే. సోనియా కుమారుడు, ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ నాయకత్వానికే సవాల్‌. పైగా భారత్‌ జోడో అంటూ దేశవ్యాప్తంగా రెండు యాత్రలు చేసినా విఫలమయ్యారనే బలమైన ముద్ర పడుతుంది. అందుకే అప్పటి యూపీఏ తరహాలో.. ‘‘ఇండియా’’ కూటమి కట్టి.. పోరాడుతోంది.

కీలక నాయకులను కోల్పోయి.. పలు రాష్ట్రాల్లో ఓడిపోయిన ఆ పార్టీకి ప్రస్తుత లోక్‌ సభ ఎన్నికలు చావోరేవో. రాహుల్‌ గాంధీ ఈసారి 2004 నాటి ఫలితాలు వస్తాయని అంటున్నారు. తద్వారా మోదీ నేతృత్వంలోని బీజేపీని నిలువరించగలమనే భావనను అటు ప్రజలు, ఇటు ఇండియా కూటమి పార్టీల్లో వ్యాపింపజేస్తున్నారు. అప్పట్లో వాజపేయీ ప్రభుత్వం ‘దేశం వెలిగిపోతోంంది’ అంటూ ప్రచారం చేసి భంగపడిందని, మోదీ సర్కారు సైతం ఇదే తరహా ఫలితం ఎదురవుతుందని చెబుతూ ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పార్టీ పరంగా చూస్తే రాహుల్‌ సాగించిన జోడో యాత్రలు తమ వైపు ప్రజలు మొగ్గేలా చేశాయని కాంగ్రెస్‌ పెద్ద ఆశలే పెట్టుకుంది. కర్ణాటక, తెలంగాణలో గెలిచిన ఉత్సాహంతో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడడానికి ముందే ‘హామీలను’ వెల్లడించింది. హస్తం పార్టీ ఇలా ప్రకటించడం బహుశా ఇదే తొలిసారి.


ప్రణాళికలు విఫలమైనా..

వాస్తవానికి కూటమి కట్టడం నుంచి.. 400 స్థానాల్లో బీజేపీపై ‘ఇండియా’ తరఫున ఒక్కరే అభ్యర్థిని నిలపాలని ప్రతిపాదించి ఈ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ బాగానే వ్యూహ రచన చేసింది. అయితే, బెంగాల్‌లో కాంగ్రె్‌సకు సీట్లే ఇవ్వం పొమ్మని మమత తేల్చి చెప్పి ఒంటరిగా పోటీకి దిగారు. కేరళలో లెఫ్ట్‌ కూటమి కూడా ఇదే తీరున సొంతంగా బరిలో దిగింది. ఇక ఇండియా కూటమి ఏర్పాటుకు వెన్నెముకగా నిలిచిన బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ను బీజేపీ లాగేసుకుంది. యూపీలో ఆర్‌ఎల్‌డీనీ తమవైపు తిప్పుకొంది. ప్రజాదరణ ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, జార్ఖండ్‌లో హేమంత్‌ సోరెన్‌ జైలు పాలయ్యారు. రాజకీయంగా ఇన్ని ఒడిదొడుకులున్నా కాంగ్రెస్‌ మాత్రం ఆశతో ముందుకుసాగుతోంది.

ప్రచారంలో ధాటి

2019లో మోదీని తక్కువ అంచనా వేసిన కాంగ్రెస్‌ బోల్తాపడింది. రాఫెల్‌ డీల్‌లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ.. చౌకీదార్‌ చోర్‌ హై అంటూ మోదీని గట్టిగా నిందించింది. పేదలకు కనీస ఆదాయం కల్పిస్తామంటూ ప్రధానంగా ప్రచారం చేసింది. ఇప్పుడు మాత్రం ‘కుల గణన’ను తెర పైకి తెచ్చింది. తద్వారా ఓబీసీలు తమవైపు మొగ్గుచూపుతారని, ఇది బ్రహాస్త్రం అని భావిస్తోంది. మరోవైపు సంక్షేమ మంత్రంలో భాగంగా నాటి కనీస ఆదాయ హామీని మెరుగుపరిచి ‘న్యాయ్‌’ హామీల్లో చేర్చింది. వీటికితోడు ఎలక్టోరల్‌ బాండ్స్‌తో బీజేపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు దిగి లాభం పొందిందంటూ దాడికి దిగుతోంది. వీటికి తోడు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన మోదీ ఆ హామీని విస్మరించడం, రైతుల ఆదాయం పెరగకపోవడం, ధరలు మండిపోవడం.. ఈ అంశాల ప్రభావం ఓట్ల రూపంలో కనిపిస్తుందని కాంగ్రెస్‌ లెక్కలు వేస్తోంది. - సెంట్రల్‌ డెస్క్‌


సొంతంగా కొంత.. కూటమి పార్టీలు కొంత

తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలపై కాంగ్రెస్‌ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో కర్ణాటకలో 1, తెలంగాణలో 3 సీట్లకు పరిమితమైన హస్తం పార్టీ.. ఇప్పుడు మాత్రం ఈ రాష్ట్రాల్లో 25 పైగా స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక 2019లో కేరళలో 18 సీట్లను కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ కూటమి గెలుచుకుంది. ఈసారీ అక్కడ మెరుగైన ఫలితాలను ఆశిస్తోంది.

తమిళనాడులో డీఎంకే, యూపీలో సమాజ్‌వాదీ, బిహార్‌లో ఆర్జేడీ, మహారాష్ట్రలో మహా వికాస్‌ అఘాడీ, ఝార్ఖండ్‌లో జేఎంఎం.. ఇలా ఎక్కడిక్కడ ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీలు సత్తా చాటాల్సి ఉంది. అటు బెంగాల్‌లో టీఎంసీ సైతం అధిక సీట్లు సాధించాలి. కాగా, మధ్యప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌, గుజరాత్‌లపై కాంగ్రె్‌సకు పెద్దగా అంచనాల్లేవని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, 25 సీట్లున్న రాజస్థాన్‌లో మాత్రం బీజేపీని అడ్డుకుంటామని భావిస్తోంది. అలాగైతేనే మోదీని ఇంటికి పంపాలన్న కాంగ్రెస్‌ లక్ష్యం నెరవేరుతుంది.

Updated Date - Apr 28 , 2024 | 06:59 AM