Share News

Election Schdule: నేడే ఎన్నికల భేరి.. ఏపీ, తెలంగాణలో నెలాఖరులో!

ABN , Publish Date - Mar 16 , 2024 | 04:55 AM

సార్వత్రిక ఎన్నికల సమరం తొలిఘట్టం శనివారం మొదలవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిసా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనుంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో ఎన్నికల ప్రధాన కమిషనర్‌

Election Schdule: నేడే ఎన్నికల భేరి.. ఏపీ, తెలంగాణలో నెలాఖరులో!

మధ్యాహ్నం 3 గంటలకు లోక్‌సభ షెడ్యూల్‌

ఆంధ్ర, ఒడిసా, అరుణాచల్‌, సిక్కిం అసెంబ్లీలకూ..

4-5 దశల్లో పార్లమెంటు పోలింగ్‌?

ఏపీ, అరుణాచల్‌, సిక్కింలకు ఒకేసారి

ఒడిసాకు 4 విడతల్లో జరిగే అవకాశం

దేశవ్యాప్తంగా ఈసీ పర్యటనలు

ఎన్నికల సన్నద్ధతపై కసరత్తు, సమీక్ష

షెడ్యూల్‌ ప్రకటించగానే కోడ్‌ అమల్లోకి

కొత్త కమిషనర్ల నియామకంపై స్టేకు సుప్రీం నో

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే నెలాఖరులో పోలింగ్‌!

న్యూఢిల్లీ, మార్చి 15(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల సమరం తొలిఘట్టం శనివారం మొదలవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిసా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనుంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌, కొత్త కమిషనర్లు జ్ఞానేశ్‌ కుమార్‌, సుఖ్‌బీర్‌ సంధూలతో కూడిన పూర్తిస్థాయి ఎన్నికల కమిషన్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సందర్భంగా ఎన్నికల తేదీలను వెల్లడిస్తుంది. ఆంధ్ర, తెలంగాణల్లో ఏప్రిల్‌ నెలాఖరులో పోలింగ్‌ జరగొచ్చని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు 97 కోట్ల మంది అర్హులైన ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వారికోసం 12 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 4-5 దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరిగే అవకాశముంది. ఆంధ్ర, అరుణాచల్‌, సిక్కిం అసెంబ్లీలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయంటున్నారు. నక్సల్స్‌ ప్రభావం కారణంగా ఒడిసాలో గత ఎన్నికల మాదిరిగా నాలుగు దశల్లో జరిగే వీలుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 303, కాంగ్రెస్‌ 52, డీఎంకే 24, టీఎంసీ 22, వైసీపీ 22, శివసేన 18, జేడీయూ 16, బీజేడీ 12, బీఎస్పీ 10, టీఆర్‌ఎస్‌ 9 సీట్లు గెలిచాయి. ఈ దఫా లోక్‌సభ ఎన్నికలు విపక్ష ఇండియా కూటమికి జీవన్మరణ సమస్యగా మారాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వివిధ సర్వేలు ఎన్డీయే హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని, బీజేపీ సొంతంగా 350 స్థానాలు కైవసం చేసుకుంటుందని అంచనా వేయడంతో అధికార కూటమి సమరోత్సాహంతో ఉంది. కాగా, బీజేపీ ఇప్పటికే 267 మంది అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్‌ కూడా 82 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. టీఎంసీ బెంగాల్‌, అసోంలలో పోటీచేసే 47 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆప్‌, ఎస్పీ కూడా పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి.

కమిషనర్ల నియామకాలపై స్టేకు నో

సీజేఐని సెలెక్ట్‌ ప్యానెల్‌ నుంచి తప్పించి అందులో ఒక కేంద్ర మంత్రిని నియమించేలా 2023లో చేసిన చట్టం ఆధారంగా జ్ఞానేశ్‌కుమార్‌, సుఖ్‌బీర్‌సింగ్‌ సంధూలను కొత్త ఎన్నికల కమిషనర్లుగా నియమించడంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సాధారణంగా మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఏ చట్టాన్నీ కోర్టు నిలిపివేయదని వ్యాఖ్యానించింది. కొత్త కమిషనర్ల నియామక చట్టాన్ని, జ్ఞానేశ్‌, సంధూల నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. కొత్త కమిషనర్ల నియామకం కోసం సెలెక్ట్‌ కమిటీ సమావేశాన్ని ముందుకు జరిపారని పిటిషనర్లలో ఒకరైన జయా ఠాకూర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది వికా్‌ససింగ్‌ ప్రస్తావించారు. తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదావేసింది.

Updated Date - Mar 16 , 2024 | 07:21 AM