LokSabha Elections: ఎన్నికల్లో సత్తా చాట లేకపోయిన పార్టీ.. డిప్యూటీ సీఎం పదవికీ రాజీనామా..!
ABN , Publish Date - Jun 05 , 2024 | 04:54 PM
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికీ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను బుధవారం ఆయన బీజేపీ అగ్ర నాయకత్వాన్ని పంపారు. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న ఫలితాలు సాధించ లేకపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ముంబై, జూన్ 05: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికీ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను బుధవారం ఆయన బీజేపీ అగ్ర నాయకత్వాన్ని పంపారు. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న ఫలితాలు సాధించలేకపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ క్రమంలో డిప్యూటీ సీఎం పదవి నుంచి తనను తప్పించాలని పార్టీకి విజ్జప్తి చేశారు. అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే బాధ్యత తనకు అప్పగించాలని తన రాజీనామా లేఖలో పార్టీ అగ్రనాయకత్వాన్ని కోరారు. ఈ రోజు ఉదయం ముంబైలో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బివానుఖులే అధ్యక్షతన ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఆ క్రమంలో ఈ ఎన్నికల్లో బీజేపీ అతి తక్కువ సీట్లు గెలుచుకుంది... అలాగే ఓటింగ్ శాతం కూడా భారీగా తగ్గింది... ఇక గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 23 స్థానాల్లో విజయం సాధించింది.
కానీ ఈ సారి అంతకు మించి సీట్లు గెలుచుకోక పోగా 14 సీట్లకు ఎందుకు కోత పడిందనే అంశాలపై ఈ సమావేశంలో వాడి వేడిగా చర్చ జరిగింది. అదీకాక ఈ ఏడాది నవంబర్ తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తనను డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించాలంటూ పార్టీ అగ్రనాయకత్వానికి డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా లేఖ పంపారు.
మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ 9 స్థానాల్లో నెగ్గింది. ఇక కాంగ్రెస్ పార్టీ 13 స్థానాల్లో, శివసేన ఉద్దవ్ ఠాక్రే 9 స్థానాల్లో, ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ 8 స్థానాల్లో గెలిచింది. అయితే 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో బీజేపీ 23 సీట్లు సాధించిన సంగతి తెలిసిందే.