Sanjay Singh: ఆప్ ఎంపీకి తొలగిన అడ్డంకి.. ప్రమాణ స్వీకారానికి కోర్టు అనుమతి
ABN , Publish Date - Feb 03 , 2024 | 03:46 PM
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ ఈనెల 5న రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సంజయ్ సింగ్ ప్రమాణస్వీకారానికి రౌస్ అవెన్యూ కోర్టు శనివారంనాడు అనుమతించింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ (Delhi liquor policy)కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ (Sanjay Singh) ఈనెల 5న రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సంజయ్ సింగ్ ప్రమాణస్వీకారానికి రౌస్ అవెన్యూ కోర్టు శనివారంనాడు అనుమతించింది. ఆరోజు ఉదయం 10 గంటలకు ఆయనను పార్లమెంటుకు తీసుకు వెళ్లాల్సిందిగా జైలు అధికారులను ఆదేశించింది.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసేందుకు, ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు వీలుగా తనకు మనీలాండరింగ్ కేసులో తాత్కాలిక బెయిలు మంజూరు చేయాలని సంజయ్ సింగ్ గత గురువారంనాడు కోర్టును ఆశ్రయించారు. ఫిబ్రవరి 4 నుంచి 10 వరకూ తాత్కాలిక బెయిల్ ఇవ్వాలని కోరారు. దీనిపై ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ ఈడీకి నోటీసు జారీ చేశారు. ఫిబ్రవరి 3వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఈడీని ఆదేశించారు. మనీలాండరింగ్ కేసులో గత ఏడాది అక్టోబర్ 4న సంజయ్ సింగ్‌ను ఈడీ అరెస్టు చేసింది. తనపై వచ్చిన ఆరోపణలను సంజయ్ సింగ్ తోసిపుచ్చారు. బెయిలు కోరుతూ ఆయన చేసిన అభ్యర్థనను కోర్టు గత డిసెంబర్ 22న తోసిపుచ్చింది. కాగా, జనవరిలో ఢిల్లీ నుంచి రాజ్యసభకు ఆప్ అభ్యర్థిగా సంజయ్ సింగ్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.