Share News

Raipur: భేష్.. నక్సలైట్ల ఎన్‌కౌంటర్‌ని అతిపెద్ద విజయంగా అభివర్ణించిన ఛత్తీస్‌గఢ్ సీఎం

ABN , Publish Date - Apr 17 , 2024 | 09:13 AM

ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) రాష్ట్రం కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు నక్సలైట్లపై జరిపిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది నక్సలైట్లు మరణించిన విషయం విదితమే. ఈ అంశంపై సీఎం విష్ణు దేవ్ స్పందించారు. ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు DRG, BSF సిబ్బందిని విష్ణు దేవ్ సాయి ప్రశంసించారు.

Raipur: భేష్.. నక్సలైట్ల ఎన్‌కౌంటర్‌ని అతిపెద్ద విజయంగా అభివర్ణించిన ఛత్తీస్‌గఢ్ సీఎం

రాయ్‌పుర్: ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) రాష్ట్రం కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు నక్సలైట్లపై జరిపిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది నక్సలైట్లు మరణించిన విషయం విదితమే. ఈ అంశంపై సీఎం విష్ణు దేవ్ స్పందించారు. ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు DRG, BSF సిబ్బందిని విష్ణు దేవ్ సాయి ప్రశంసించారు. ఇది తమ ప్రభుత్వ అతిపెద్ద విజయంగా అభివర్ణించారు. రాయ్‌పుర్‌లో ఆయన మాట్లాడుతూ.. "ఇది నిజంగా చాలా పెద్ద విజయం. చారిత్రక ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న జవాన్లు, భద్రతా సిబ్బందిని నేను అభినందిస్తున్నాను.


ఏప్రిల్ 19న బస్తర్ ప్రాంతంలో ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవాలని నక్సలైట్లు భావించినట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం బస్తర్, కంకేర్ లోక్‌సభ నియోజకవర్గాలకు సమీపంలో ఉంది. బస్తర్‌లో ఏప్రిల్ 19న ఎన్నికలు జరగనున్నాయి. గతంలో ప్రభుత్వం ‘నియాద్ నెల్లనార్’ పథకం ద్వారా నక్సలిజాన్ని తుదముట్టించాలని భావించింది. మిగిలిన నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి రావాలని కోరుకుంటున్నా. ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు. వారికి మెరుగైన చికిత్స అందించడం కోసం ఆసుపత్రికి తరలించాం" అని సీఎం అన్నారు.


ఘటన జరిగిందిలా..

నక్సల్స్‌కు కంచుకోటగా ఉన్న అబూజ్‌మడ్‌లో మంగళవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగకు చెందిన సిరిపెల్లి సుధాకర్‌ అలియాస్‌ శంకర్‌రావు ఉన్నారు. ఆయన భార్య, ఆదిలాబాద్‌ జిల్లా హత్నూర్‌కు చెందిన దాసర్వర్‌ సుమన అలియాస్‌ రజిత కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. బస్తర్‌ రేంజ్‌ ఐజీ పి.సుందర్‌కుమార్‌, కాంకేర్‌ సీనియర్‌ ఎస్పీ ఐ.కళ్యాణ్‌ ఎలిసెల కథనం ప్రకారం.. ఈ నెల 19న మొదటి దశ లోక్‌సభ పోలింగ్‌లో భాగంగా బస్తర్‌ రీజియన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశ ఎన్నికల్లో భాగంగా కాంకేర్‌లో ఈ నెల 26న ఎన్నికలు జరగనున్నాయి.

ఈ ప్రాంతాల్లో ఎన్నికలను బహిష్కరించాలని కొన్ని రోజులుగా మావోయిస్టులు కరపత్రాలు, లేఖలను విడుదల చేస్తున్నారు. సోమవారం దండకారణ్యంలో బంద్‌కు పిలుపునిచ్చారు. ఎన్నికల రోజు కుట్రలు పన్నారనే సమాచారంతో చోటాబేటియా ఠాణా పరిధిలోని బినాగూడ, చోటాబేటియా అడవుల్లో సోమవారం నుంచి బీఎ్‌సఎఫ్‌, డీఆర్జీ బలగాలతో కూంబింగ్‌ ప్రారంభించినట్లు ఈ ఆపరేషన్‌ను ముందుండి నడిపించిన సీనియర్‌ ఎస్పీ కల్యాణ్‌(తెలుగు అధికారి) తెలిపారు.


ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 1.30 సమయంలో అబుజ్‌మడ్‌ ప్రాంతంలో పోలీసులపైకి మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో.. పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు. ‘‘సాయంత్రం 5.30 వరకు.. సుమారు 4 గంటల పాటు ఇరువైపులా కాల్పులు కొనసాగాయి. మావోయిస్టుల వైపు కాల్పులు ఆగిపోవడంతో.. మా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో.. మొత్తం 29 మంది మావోయిస్టుల మృతదేహాలను కనుగొన్నాం’’ అని ఆయన వివరించారు.

Encounter: 29 మంది నక్సల్స్‌ మృతి.. మావోయిస్టు చరిత్రలోనే భారీ ఎన్‌కౌంటర్..!

ఈ ఏడాది 79 మంది మృతి..

ఈ ఏడాది మావోయిస్టులకు ప్రతికూలంగా ఉన్నట్లు తాజా ఘటనలు చెబుతున్నాయి. మంగళవారం నాటి ఘటనతో కలిపి.. ఈ మూడున్నర నెలల్లో మహారాష్ట్ర-ఛత్తీ్‌సగఢ్‌, మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో 79 మంది మావోయిస్టులు చనిపోయారు. గడిచిన నెల వ్యవధిలోనే నక్సల్స్‌ తరఫున భారీ ప్రాణనష్టం(54 మంది) నమోదైంది. దండకారణ్యంలో మావోయిస్టులను గుర్తించేందుకు డీఆర్జీ, బీఎ్‌సఎఫ్‌, సీఆర్పీఎఫ్‌ బలగాలకు చెందిన 80 వేల మంది జవాన్లు జల్లెడపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని సంఘటనలు చోటుచేసుకునే ప్రమాదముందని ఆదివాసీలు బిక్కుబిక్కుమంటున్నారు.


అమిత్ షా ఏమన్నారంటే..

ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం నక్సలైట్లకు వ్యతిరేకంగా విజయవంతమైన ఆపరేషన్‌ నిర్వహించినందుకు భద్రత బలగాలను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అభినందించారు. నక్సలైట్ల సమస్య నుంచి ఛత్తీ్‌సగఢ్‌ను, దేశాన్ని విముక్తి చేసేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 17 , 2024 | 09:14 AM