Share News

బ్యాలెట్‌ పత్రాలంటే మళ్లీ పాత రోజులే

ABN , Publish Date - Apr 17 , 2024 | 02:56 AM

ఓట్ల నమోదు, లెక్కింపులో పారదర్శకత సాధించే విషయమై మంగళవారం సుప్రీంకోర్టులో ఆసక్తికరమైన వాదనలు సాగాయి. తాము వేసిన ఓటు అనుకున్న అభ్యర్థికే పడిందని, దాని లెక్కింపు కూడా జరిగిందన్న నమ్మకం ఓటర్లలో కలిగించేందుకు ఈవీఎంలలో నమోదైన ఓట్లతో పాటు, వీవీప్యాట్‌ మిషన్లలోని

బ్యాలెట్‌ పత్రాలంటే  మళ్లీ పాత రోజులే

అప్పటి అక్రమాలను ఎలా మరిచిపోతాం.. మానవ జోక్యం ఉంటే లోపాలే

వీవీప్యాట్‌ స్లిప్‌ల లెక్కింపుపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 16: ఓట్ల నమోదు, లెక్కింపులో పారదర్శకత సాధించే విషయమై మంగళవారం సుప్రీంకోర్టులో ఆసక్తికరమైన వాదనలు సాగాయి. తాము వేసిన ఓటు అనుకున్న అభ్యర్థికే పడిందని, దాని లెక్కింపు కూడా జరిగిందన్న నమ్మకం ఓటర్లలో కలిగించేందుకు ఈవీఎంలలో నమోదైన ఓట్లతో పాటు, వీవీప్యాట్‌ మిషన్లలోని పేపర్‌ స్లిప్‌లన్నింటినీ లెక్కించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై వాదనలు జరిగాయి. ప్రస్తుతం ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కేవలం అయిదు వీవీప్యాట్‌ల స్లిప్‌లను లెక్కిస్తుండగా, దానికి బదులుగా అన్ని పేపర్‌ స్లిప్‌లను లెక్కించాలని పిటిషనర్లు కోరారు. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌)తో పాటు సామాజిక ఉద్యమకారుడు అరుణ్‌కుమార్‌ అగర్వాల్‌ ఈ వ్యాజ్యాలను దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాల ధర్మాసనం రెండు గంటల పాటు వాదనలు ఆలకించింది. తొలుత ఏడీఆర్‌ తరఫున న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలు వినిపిస్తూ.. కావాల్సిన విధంగా ఫలితాలు వచ్చేలా ఈవీఎంలలో చిప్స్‌ను అమర్చడం, మాల్‌వేర్‌ ప్రోగ్రాంల ద్వారా మ్యాన్యుపులేట్‌ చేయడం వంటివి జరగడానికి అవకాశం ఉందన్నారు. దీనిని నివారించడానికి మూడు అంశాలను పరిశీలించాలని కోరారు. మునుపటి బ్యాలెట్‌ పత్రాల ఓటింగ్‌ విధానానికి వెళ్లడం, వీవీప్యాట్‌ ద్వారా వచ్చిన పేపరు స్లిప్‌ను ఓటరే బ్యాలెట్‌ బ్యాక్సులో వేయడం, వీవీప్యాట్‌లోని స్లిప్‌ బాక్సులో పడే విధానం ఓటరుకు కనిపించేలా గాజు పరికరాన్ని ఏర్పాటు చేయడం వంటి మార్గాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఈవీఎంలో లెక్కించిన ఓట్లకు, వీవీప్యాట్‌ల ద్వారా లెక్కించిన స్లిప్‌లకు తేడా వస్తే స్లిప్‌లనే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. స్లిప్‌లను లెక్కించడానికి ఒక్క రోజు సమయం పట్టినా పెద్ద నష్టమేమీ లేదని అన్నారు. ఇలాంటి కారణాల వల్లనే జర్మనీ, ఇతర యూరోపియన్‌ దేశాలు బ్యాలెట్‌ పేపర్లను వాడుతున్నాయని చెప్పారు. దీనిపై జస్టిస్‌ ఖన్నా స్పందిస్తూ గతంలో బ్యాలెట్‌ పేపర్ల ద్వారా కలిగిన సమస్యలను గుర్తు చేశారు. బూత్‌లను స్వాధీనం చేసుకోవడం వంటి సంఘటనలు జరిగాయని తెలిపారు. వాటిని మీరు మరిచిపోయారేమోగానీ తాము మరిచిపోలేదని అన్నారు. మానవ జోక్యం, పక్షపాతం వల్లనే సమస్యలు వస్తాయని, మానవ జోక్యం లేకపోతే యంత్రాలే కచ్చితమైన ఫలితాలను ఇస్తాయని వ్యాఖ్యానించారు. జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా మాట్లాడుతూ.. యూరోపియన్‌ దేశాల ఉదాహరణలు ఇక్కడ పనిచేయవని, జర్మనీ జనాభా 6 కోట్లని, తన సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌ జనాభా అంతకన్నా ఎక్కువని అన్నారు. ‘‘ఎవర్నో ఒకర్ని మనం నమ్మాలి. ఈ విధంగా వ్యవస్థను తక్కువ చేసి చూపొద్దు’’ అని వ్యాఖ్యానించారు. ‘మానవ జోక్యం ఉంటేనే సమస్యలు వస్తాయి. మానవ బలహీనతలు ఉంటాయి. అందులో పక్షపాతం కూడా ఉంటుంది. మానవ జోక్యం లేకపోతే యంత్రమే సరైన ఫలితాన్ని చెబుతుంది’’ అని జస్టిస్‌ ఖన్నా వ్యాఖ్యానించారు. కాగా, ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేస్తే కఠిన శిక్షలు విధించేలా ప్రత్యేకంగా ఎలాంటి నిబంధనలు లేకపోవడాన్ని జస్టిస్‌ ఖన్నా గుర్తించారు. ‘‘ఇది చాలా తీవ్రమైన విషయం. శిక్షిస్తారన్న భయం ఉండాలి కదా?’’ అని వ్యాఖ్యానించారు. తదుపరి విచారణను గురువారానికి వాయుదా వేశారు.

Updated Date - Apr 17 , 2024 | 02:56 AM