Share News

Chennai: ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి?

ABN , Publish Date - Jan 06 , 2024 | 08:11 AM

రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi)కి పదోన్నతి లభించనుందా?.. ప్రజల్లో ఆయనకు పెరుగుతున్న ఆదరణ, పార్టీలో పెరుగుతున్న మద్దతుతో తన

Chennai: ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి?

- డీఎంకే యువజన విభాగ మహానాడు కాగానే పదోన్నతి!

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi)కి పదోన్నతి లభించనుందా?.. ప్రజల్లో ఆయనకు పెరుగుతున్న ఆదరణ, పార్టీలో పెరుగుతున్న మద్దతుతో తన కుమారుడికి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) నిర్ణయించారా?.. త్వరలో జరగనున్న డీఎంకే యువజన విభాగ మహానాడు కాగానే ఈ తంతు జరగనుందా?.. అవుననే అంటున్నాయి డీఎంకేలోని విశ్వసనీయ వర్గాలు. ఈ మేరకు త్వరలోనే ఉదయనిధికి ప్రభుత్వ పాలనా బాధ్యతలు అందనున్నాయి. డీఎంకే యువజన విభాగ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఉదయనిధి గత పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో విస్త్రత ప్రచారం చేశారు. ఆయన ప్రచారం నిర్వహించిన నియోజకవర్గాల్లో మంచి ఫలితాలు రావడంతో పాటు ‘మాస్‌ లీడర్‌’గా గుర్తింపు పొందారు. ఇక డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ కుమారుడిగా ఉదయనిధికి నేతల్లో మంచి ఆదరణ ఉండడంతో పాటు ఆయన తీసుకునే సత్వర నిర్ణయాలు, సమస్యలపై స్పందించే తీరు ప్రజలకు బాగా దగ్గర చేసింది. మంత్రివర్గంలో సాంకేతికంగా ఉదయనిధి స్థానం చివరలో ఉన్నా, మంత్రులంతా ఆయన్ని ముఖ్యమంత్రి తరువాతి స్థానంలోనే చూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలకు సీనియర్‌ మంత్రులు హాజరవుతున్నప్పటికీ ఉదయనిధే ముందు వరుసలో కూర్చోవడంతో పాటు కార్యక్రమానికి ఆయనే నేతృత్వం వహిస్తున్నారు. సీనియర్‌ మంత్రులు సైతం ‘చిన్నవర్‌’ (చిన్నాయన) అంటూ ఉదయనిధిని ముద్దుగా సంబోధిస్తున్నారు.

భవిష్యత్తు దృష్ట్యా...

ఉదయనిధికి మరిన్ని బాధ్యతలు అప్పగించడం మంచిదని సీఎం స్టాలిన్‌ భావిస్తున్నట్లు తెలిసింది. ‘భవిష్యత్తు’ను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ దిశగా యోచిస్తున్నట్లు సమాచారం. ఉదయనిధికి ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెడితే, తన తరువాత ఉదయనిధేనన్న భావన పార్టీ క్యాడర్‌కు, ప్రజలకు కూడా వెళ్లాలనేది స్టాలిన్‌ యోచనగా ఉన్నట్లు తెలిసింది. అందుకే ఉదయనిధికి వరుసగా బాధ్యతలు పెంచుతున్నారు. ఇందులో భాగంగానే క్రీడాభివృద్ధి శాఖ మంత్రిగా వున్న ఉదయనిధి ఇటీవల ఢిల్లీ వెళ్లి ఒంటరిగానే ప్రధానితో రెండుమార్లు భేటీ అయ్యారు. అదే విధంగా పలువురు కేంద్రమంత్రులతోనూ ఆయన సమావేశమై సమస్యల పరిష్కారానికి ప్రయత్నించారు. ఉదయనిధిని ఒంటరిగా ప్రధాని వద్దకు పంపడం, ఆయన రాటుదేలేందుకేనని డీఎంకే వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా పార్లమెంటు ఎన్నికల కోసం తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలోని 40 లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు ఉదయనిధి సిద్ధమవుతున్నారు. అయితే దానికంటే ముందుగానే సేలంలో నిర్వహించనున్న డీఎంకే యువజన విభాగ మహానాడును విజయవంతం చేయాలని ఆయన గట్టిగా భావిస్తున్నారు. ఇప్పటికే రెండుమూడు మార్లు వాయిదా పడడంతో ఈసారి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ఉదయనిధి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఆ మహానాడు ముగియగానే ఉదయనిధికి ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని స్టాలిన్‌ భావిస్తున్నట్లు డీఎంకే విశ్వసనీయవర్గాల సమాచారం. దీనిపై ఇప్పటికే కొంతమంది సీనియర్లతోనూ ముఖ్యమంత్రి చర్చించినట్లు తెలిసింది. వారు కూడా మంచి నిర్ణయమని హర్షం ప్రకటించినట్లు సమాచారం. ఇదిలా వుండగా ఒకవేళ ఉదయనిధి డిప్యూటీ సీఎం అయితే పలువురు రాష్ట్ర మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశముందని సచివాలయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Updated Date - Jan 06 , 2024 | 08:16 AM