Share News

Ayodhya Divine Walk: తండ్రి కోరిక.. బంగారుపూత పాదుకలతో అయోధ్యకు హైదరాబాదీ పాదయాత్ర

ABN , Publish Date - Jan 06 , 2024 | 04:32 PM

అయోధ్యలో రామాలయ నిర్మాణం ఆ కరసేవకుని కల. ఆ కల తీరకుండానే ఆయన తనువు చాలించారు. తన తండ్రి కలను సాకారం చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన ఆయన కుమారుడు చల్లా శ్రీనివాస శాస్త్రి అయోధ్య వైపు అడుగులు సారించారు. బంగారు పూత పూసిన స్వర్ణ పాదుకలను తలపై ఉంచుకుని వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగిస్తున్నారు. మరో రెండు వారాల్లో అయోధ్యకు చేరుకోనున్నారు.

Ayodhya Divine Walk: తండ్రి కోరిక.. బంగారుపూత పాదుకలతో అయోధ్యకు హైదరాబాదీ పాదయాత్ర

హైదరాబాద్: అయోధ్యలో భవ్య రామాలయ నిర్మాణం ఆ కరసేవకుని కల. ఆ కల తీరకుండానే ఆయన తనువు చాలించారు. తన తండ్రి కలను సాకారం చేసేందుకు ఆయన కుమారుడు అయోధ్య వైపు అడుగులు సారించారు. బంగారు పూత పూసిన స్వర్ణ పాదుకలను (Gold-plated footwear) తలపై ఉంచుకుని వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగిస్తున్నారు. ఈనెల 22న రామాలయం ప్రారంభోత్సవం నాటికి ఆయన అయోధ్య చేరుకుని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఆ పవిత్ర పాదుకలను అందజేయబోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఈ 64 ఏళ్ల ఈ రామభక్తుడి పేరు చల్లా శ్రీనివాస్ శాస్త్రి (Challa Srinivas Sastry). మరో రెండు వారాల్లో రామజన్మభూమికి ఆయన చేరుకోనున్నారు.


అయోధ్య-రామేశ్వరం రూట్‌లో...

శ్రీరాముడు వనవాస సమయంలో ప్రయాణించిన అయోధ్య-రామేశ్వరం మార్గాన్ని తన ప్రయాణం కోసం శాస్త్రి ఎంచుకున్నారు. వనవాస కాలంలో రాముడు ఎక్కడెక్కడ శివలింగాలను ప్రతిష్ఠించారో వాటిని దర్శించుకుంటూ గత ఏడాది జూలై 20న ఆయన తన యాత్ర ప్రారంభించారు. ఇప్పటికే ఆయన పూరిలోని ఒడిశా, మహారాష్ట్రలోని త్రయంబక్, గుజరాత్‌లో ద్వారకను దర్శించుకున్నారు. తలపై పాదుకలు ఉంచుకుని సుమారు 8,000 కిలోమీటర్ల మేర ఆయన ఈ ప్రయాణం సాగిస్తున్నారు. రాముడు వసవాసం సాగించిన మార్గంపై 15 ఏళ్ల పాటు పరిశోధన చేసిన ఆదాయం పన్ను శాఖ రిటైర్డ్ అధికారి డాక్టర్ రామావతార్ రూపొందించిన 'మ్యాప్'ను అసరించి పాదయాత్ర జరుపుతున్నట్టు ఆయన చెప్పారు.


తండ్రి ఆశయం కోసం..

''మా తండ్రిగారు అయోధ్య కరసేవలో పాల్గొన్నారు. ఆయన హనుమాన్ భక్తుడు. అయోధ్యలో రామాలయ నిర్మాణం ఆయన కల. కానీ ఆయన ఇప్పుడు లేరు. ఆయన కోర్కె తీర్చాలని నేను నిర్ణయించుకున్నాను'' శాస్త్రి తెలిపారు. 2019లో సుప్రీంకోర్టు తీర్పు తరువాత ఐదు వెండి ఇటుకలను రామాలయానికి తాను విరాళంగా ఇచ్చానని చెప్పారు. రామునికి సమర్పించుకునేందుకు పంచధాతువులు (పంచలోహాలు)తో పాదుకలను తయారు చేయించానని, మరో రెండు వారాల్లో అయోధ్యకు చేరుకుంటానని చెప్పారు.


ఐదుగురితో కలిసి పాదయాత్రను సాగిస్తున్న చల్లా శ్రీనివాస్ శాస్త్రి ఈ యాత్రకు ఒక పర్యాయం తమిళనాడులో విరామం ఇచ్చారు. యూకే వెళ్లాల్సి రావడంతో స్వల్ప విరామం తలెత్తింది. తిరిగి వచ్చిన వెంటనే ఎక్కడైతే యాత్ర ఆగిందో అక్కడి నుంచి మళ్లీ మొదలుపెట్టారు. రోజుకు 3 నుంచి 50 కిలోమీటర్ల వరకూ పాదయాత్ర ముందుకు సాగుతోంది. స్వర్ణపూత పూసిన పాదుకల తయారీకి రూ.65 లక్షలు ఖర్చయిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆయన యాత్ర ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ వద్ద ఉంది. అయోధ్యకు 272 కిలోమీటర్ల దూరంలో చిత్రకూట్ ఉంది. మరో 10 రోజుల్లో అయోధ్య చేరుకుంటామనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.


అయోధ్యలోనే స్థిరనివాసం

హైదరాబాద్‌లోని అయోధ్య భాగ్యనగర్ సీతారామ పౌండేషన్ వ్యవస్థాపకుడైన శ్రీనివాస్ శాస్త్రి అయోధ్యలోనే స్థిరనివాసం ఏర్పరచుకుకోవాలని సంకల్పించారు. అక్కడ ఒక ఇంటిని నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారు. రామజన్మభూమిలోని భవ్యరామాలయంలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం ఈనెల 22న నభూతో నభవిష్యతి అనే రీతిలో జరుగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.

Updated Date - Jan 06 , 2024 | 04:33 PM