Share News

CM Stalin: సీఏఏ అసమంజసమైంది.. తమిళనాడులో దాన్ని అమలు చేయం

ABN , Publish Date - Mar 12 , 2024 | 04:31 PM

సోమవారం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై (Citizenship Amendment Act) ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీనిని తమ రాష్ట్రాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయనివ్వమంటూ ఇప్పటికే ఢిల్లీ, కేరళ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు తేల్చి చెప్పారు. తాజాగా సీఎం స్టాలిన్ (CM Stalin) సైతం.. తమిళనాడులో (Tamil Nadu) ఈ చట్టాన్ని అమలు చేయబోమని అన్నారు.

CM Stalin: సీఏఏ అసమంజసమైంది.. తమిళనాడులో దాన్ని అమలు చేయం

సోమవారం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై (Citizenship Amendment Act) ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీనిని తమ రాష్ట్రాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయనివ్వమంటూ ఇప్పటికే ఢిల్లీ, కేరళ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు తేల్చి చెప్పారు. తాజాగా సీఎం స్టాలిన్ (CM Stalin) సైతం.. తమిళనాడులో (Tamil Nadu) ఈ చట్టాన్ని అమలు చేయబోమని అన్నారు. సీఏఏ పూర్తిగా అసమంజసమైన చట్టమని, దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని, ఈ చట్టాన్ని రద్దు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.


‘‘కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పూర్తిగా అసమంజసమైనది. దీని వల్ల ఎటువంటి ఉపయోగం గానీ, ప్రయోజనగాలు గానీ లేవు. ఇది భారతీయ ప్రజల మధ్య విభేదాలను సృష్టిస్తుంది. దీనిని తప్పనిసరిగా రద్దు చేయాలి’’ అని సీఎం స్టాలిన్ ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ చట్టం బహుళవాదం, లౌకికవాదం, మైనారిటీ వర్గాలకు, శ్రీలంక తమిళ శరణార్థులకు కూడా వ్యతిరేకంగా ఉందని.. అందుకే సీఏఏని అమలు చేయడానికి తమిళనాడు ప్రభుత్వం ఎటువంటి అవకాశం ఇవ్వదని తెగేసి చెప్పారు. సీఏఏ నిబంధనలు భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ముందు ఈ సీఏఏ నోటిఫికేషన్‌ను ఎందుకు విడుదల చేశారని ఆయన కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అంతకుముందు కూడా.. సోమవారం సీఏఏ అమలుకు సంబంధించిన ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే సీఎం స్టాలిన్ ఎక్స్ వేదికగా తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. సీఏఏ చట్టం ద్వారా రాజకీయ లబ్ది పొందాలని బీజేపీ చూస్తోందని ఆరోపణలు గుప్పించారు. మతపరమైన మనోభావాలను వినియోగించి.. మునిగిపోతున్న తన నౌకని కాపాడుకోవాలని ప్రధాని మోదీ (PM Narendra Modi) ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఏదేమైనా.. ఈ చర్యకు పాల్పడినందుకు గాను బీజేపీని భారతీయ ప్రజలు ఎప్పటికీ క్షమించరని హెచ్చరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 12 , 2024 | 05:29 PM