Share News

BJP vs Congress: ఢిల్లీ వేదికగా కాంగ్రెస్, బీజేపీ నిరసనలు.. ఎందుకంటే

ABN , Publish Date - Feb 07 , 2024 | 02:53 PM

కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్(Karnataka Congress), ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ(BJP) రాజకీయ వేడి ఢిల్లీని తాకింది. కేంద్ర నిధులు రెండు పార్టీల మధ్య చిచ్చు రాజేసింది.

BJP vs Congress: ఢిల్లీ వేదికగా కాంగ్రెస్, బీజేపీ నిరసనలు.. ఎందుకంటే

ఢిల్లీ: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్(Karnataka Congress), ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ(BJP) రాజకీయ వేడి ఢిల్లీని తాకింది. కేంద్ర నిధులు రెండు పార్టీల మధ్య చిచ్చు రాజేసింది. బీజేపీ సర్కార్ కర్ణాటకకు అందజేయాల్సిన నిధులను నిలిపేస్తోందని ఆరోపిస్తూ సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తోపాటు కాంగ్రెస్ అగ్రనేతలు జంతర్ మంతర్ వద్ద నిరసనలకు దిగారు. ఈ క్రమంలో నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

కాంగ్రెస్ ఏమంటోందంటే..

కేంద్రం నుంచి వచ్చే పన్నుల రాబడిలో 13 శాతం వాటాను బీజేపీ సర్కార్ 12 శాతానికి తగ్గించిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇప్పటికైనా కేటాయించిన నిధుల్ని కేంద్రం సకాలంలో ఇస్తుందని భావిస్తున్నట్లు తెలిపింది. కన్నడిగుల ప్రయోజనాలు కాపాడటంలో తాము వెనకాడబోమని సిద్ధరామయ్య పేర్కొన్నారు.

"ఎగువ భద్ర నీటి పారుదల ప్రాజెక్టుల కోసం కేంద్రం గతేడాది రూ.5 వేల 300 కోట్లు కేటాయించింది. అందులో ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు కేటాయించలేదు. ఇది బీజేపీపై కాంగ్రెస్ చేస్తున్న రాజకీయ నిరసన కాదు. కర్ణాటకపై కేంద్రం చూపిస్తున్న సవతి తల్లి వైఖరిని నిరసిస్తున్నాం. రాష్ట్ర హక్కుల కోసం అన్ని పార్టీలు కలిసిరావాల్సిందిగా కోరుతున్నాం" అని సిద్దరామయ్య అన్నారు.


బీజేపీ వెర్షన్ ఇదే..

కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో ధర్నా చేయడాన్ని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఖండించారు. కాంగ్రెస్ తీరుకు వ్యతిరేకంగా ఆయన బెంగళూరులోని విధాన సౌధ వద్ద నేతలతో కలిసి నిరసనలు చేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మాజీ సీఎం యడియూరప్ప తదితరులు ఢిల్లీలో కాంగ్రెస్‌కు పోటీగా నిరసనలకు చేశారు. పన్నుల పంపిణీని తగ్గించడంపై సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు లేవని కొట్టిపారేశారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు నిరసనలు తెలుపుతూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఆర్థిక కేటాయింపులు, పన్నుల కేటాయింపుపై కేంద్రంలోని బీజేపీ సర్కార్, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్‌కు మధ్య వారం రోజులుగా వాగ్వాదం నడుస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్‌ ఎంపీ అధిర్ రంజన్ చౌదరికి మధ్య ఇదే అంశంపై పార్లమెంటులో వాగ్వాదం జరిగింది. పన్ను ఆదాయ కేటాయింపులో వివక్ష చూపట్లేదని నిర్మలా పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 07 , 2024 | 02:54 PM