Share News

BJP: హిందువులే టార్గెట్.. అరెస్టులతో అశాంతిని సృష్టించేందుకు యత్నం..

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:28 PM

అయోధ్యలో రామమందిరం ప్రారంభం కానుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం హిందువులను టార్గెట్‌ చేస్తోందని తద్వారా రాష్ట్రంలో అశాంతి వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ(BJP) తీవ్ర ఆరోపణ చేసింది.

BJP: హిందువులే టార్గెట్.. అరెస్టులతో అశాంతిని సృష్టించేందుకు యత్నం..

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): అయోధ్యలో రామమందిరం ప్రారంభం కానుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం హిందువులను టార్గెట్‌ చేస్తోందని తద్వారా రాష్ట్రంలో అశాంతి వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ(BJP) తీవ్ర ఆరోపణ చేసింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.రాజీవ్‌ నగరంలో మీడియాతో మాట్లాడుతూ.. వినాశ కాలే విపరీత బుద్ది అన్న చందాన ఒక పక్క 30 సంవత్సరాల నాటి కేసులను తిరగతోడి కరసేవకుల్ని అరెస్టు చేస్తోందని ఇది చాలదన్నట్లు తాజాగా ఇప్పటికే ముగిసిన దత్తపీఠం కేసును రీ ఓపెన్‌ చేశారని మండిపడ్డారు. ఇది హిందువుల మనోభావాలతో చెలగాటమాడటమేనన్నారు. కాంగ్రెస్‌కు కుక్కర్‌ బాంబులు పేల్చిన వారు బ్రదర్స్‌గానూ, రాముడి భక్తులు క్రిమినల్స్‌గానూ కనిపిస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇందుకు కాంగ్రెస్‌ భారీగా మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు.

బీజేపీవి పచ్చి అబద్ధాలు...

చిక్కమగళూరులోని బాబాబుడన్‌గిరి కొండలపై గతంలో ఘోరీల ధ్వంసం కేసును రీ ఓపెన్‌ చేసినట్లు కొన్నిఛానెళ్ళలో వచ్చిన కఽథనాలు పూర్తిగా నిరాధారమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టంచేశారు. నగరంలో గురువారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంలో బీజేపీ పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తోందన్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు విడుదల చేశారు. న్యాయస్ధానం ఆదేశాల మేరకే నిందితులను కోర్టుకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ అయ్యాయన్నారు. కోర్టు ఆదేశాలను కూడా రాజకీయం చేయడం బీజేపీకే చెల్లిందన్నారు. ప్రభుత్వంపై బురద జల్లుతూ నిరాధార కథనాలు పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తూ విశ్వసనీయతను పొగొట్టుకోవద్దని మీడియాకు సీఎం హితవు పలికారు.

హిందూ కార్యకర్త అరెస్ట్‌పై నిరసన

హుబ్బళిలో హిందూకార్యకర్త శ్రీకాంత్‌ పూజారి అరెస్టును నిరసిస్తూ బీజేపీ సీనియర్‌ ఎమ్మెల్యే, పార్టీ ప్రధానకార్యదర్శి సునిల్‌కుమార్‌ ఒంటరిగా నిరసనకు దిగారు. గురువారం సదాశివనగర్‌ పోలీసుస్టేషన్‌ ఎదుట ప్లకార్డుతో ఒంటరిగా వచ్చి బైఠాయించారు. అయోధ్యలో 30 ఏళ్ళ కిందట జరిగిన సంఘటనపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్షగట్టి కార్యకర్తలను వేధించాలని చూస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్న ప్రతిసారి హిందూ కార్యకర్తలకు వేధింపులు కొనసాగాయన్నారు. పోలీసులు నిరసన విరమింప చేయాలని సూచించారు. అయన ససేమిరా అనడంతో అరెస్టు చేశారు. విషయం తెలియగానే స్థానిక కార్యకర్తలు ఎమ్మెల్యే సునిల్‌కుమార్‌కు అండగా నిలిచారు. జైశ్రీరాం అంటూ నినాదాలు చేశారు. కాగా చిక్కమగళూరు పోలీసుస్టేషన్‌ ఎదుట బీజేపీ సీనియర్‌నేత సీటీ రవి నిరసనకు దిగారు. హిందూకార్యకర్త శ్రీకాంత్‌ పూజారి అరెస్టుకు నిరసనగా ఆం దోళన చేశారు. ఆయనకు మద్దతుగా కార్యకర్తలు భాగస్వామ్యులయ్యారు.

Updated Date - Jan 05 , 2024 | 12:28 PM