Share News

Rahul Gandhi: ఐశ్వర్యరాయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీకి బీజేపీ కౌంటర్

ABN , Publish Date - Feb 22 , 2024 | 03:44 PM

బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ బుధవారం మండిపడింది. ఐశ్వర్యపై కించపరిచే వ్యాఖ్యలు చేసి, రాహుల్ మరింత దిగజారిపోయారని ఆరోపించింది. స్వయంకృషితో ఎదిగిన మహిళల పట్ల రాహుల్ భయంకరమైన స్వభావాన్ని కలిగి ఉన్నారంటూ విమర్శలు గుప్పించింది. సీన్‌లోకి కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కూడా తీసుకొచ్చి చురకలంటించింది.

Rahul Gandhi: ఐశ్వర్యరాయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీకి బీజేపీ కౌంటర్

బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ను (Aishwarya Rai Bachchan) ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై బీజేపీ (BJP) బుధవారం మండిపడింది. ఐశ్వర్యపై కించపరిచే వ్యాఖ్యలు చేసి, రాహుల్ మరింత దిగజారిపోయారని ఆరోపించింది. స్వయంకృషితో ఎదిగిన మహిళల పట్ల రాహుల్ భయంకరమైన స్వభావాన్ని కలిగి ఉన్నారంటూ విమర్శలు గుప్పించింది. సీన్‌లోకి కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను (CM Siddaramaiah) కూడా తీసుకొచ్చి చురకలంటించింది. ఇదే సమయంలో.. ప్రముఖ గాయని సోనా మహపాత్ర (Sona Mahapatra) కూడా రాహుల్‌పై మండిపడింది. రాజకీయ లబ్ధి కోసం పొలిటీషియన్స్ మహిళల్ని కించపరిచడం కరెక్ట్ కాదని సూచిస్తూ.. ఐశ్వర్యకు మద్దతు తెలిపింది.


రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలేంటి?

ఉత్తరప్రదేశ్‌లో ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ (Bharat Jodo Nyay Yatra) సందర్భంగా.. రాహుల్ గాంధీ బీజేపీని టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పించారు. జనవరి 22వ తేదీన అయోధ్యలోని రామాలయంలో (Ayodhya Ram Mandir) జరిగిన ప్రాణప్రతిష్ఠ (Pran Pratishtha) కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులు, బిలియనీర్లను మాత్రమే బీజేపీ ఆహ్వానించిందని.. కానీ దేశంలో 73 శాతం జనాభా కలిగిన ఓబీసీ, దళిత లేదా గిరిజన వర్గాలకు చెందిన వారిని పిలవలేదని అన్నారు. ఈ ప్రాణప్రతిష్ఠ వేడుకలో ఓబీసీ వర్గానికి చెందిన వారు ఒక్కరు కూడా కనిపించలేదని.. అక్కడ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), ఐశ్వర్యరాయ్, ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఉన్నారని పేర్కొన్నారు. తాను ఒక రైతుని గానీ, కార్మికుడిని గానీ, చిరు వ్యాపారిని గానీ ఆ కార్యక్రమంలో చూడలేదని చెప్పుకొచ్చారు. టెలివిజన్ ఛానెళ్లు కేవలం ఐశ్వర్యరాయ్ డ్యాన్సింగ్ వీడియోలే చూపిస్తాయని, పేద ప్రజల గురించి ఏమీ చూపించవని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు తీవ్ర దుమారం రేపాయి.

బీజేపీ & సింగర్ సోనా కౌంటర్స్

రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ స్పందిస్తూ.. భారతీయుల నిరంతర తిరస్కరణలతో విసుగు చెందిన రాహుల్ గాంధీ, భారత్ గర్వించే ఐశ్వర్యను కించపరిచే స్థాయికి దిగజారారని ఒక ప్రకటనలో పేర్కొంది. ఇంతవరకూ ఒక్క విజయం సాధించని రాహుల్.. దేశానికి ఎంతో కీర్తిని తెచ్చిన ఐశ్వర్యపై దూషణలకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కన్నడ ఆత్మగౌరవం గురించి మాట్లాడే సీఎం సిద్దరామయ్య.. సాటి కన్నడ వ్యక్తిపై రాహుల్ చేసిన అవమానకర వ్యాఖ్యల్ని ఖండిస్తారా? లేక సీఎం కుర్చీని కాపాడుకోవడం కోసం మౌనంగా ఉంటారా? అని ప్రశ్నించింది. ఇక సింగర్ సోనా మహపాత్ర కూడా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. రాజకీయ లబ్ధి కోసం పొలిటిషియన్లు మహిళలపై ఇలాంటి కించపరిచే వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సబబు కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదేమైనా.. ఐశ్వర్య ఎంతో అందంగా డ్యాన్స్ చేస్తుందని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

Updated Date - Feb 22 , 2024 | 03:44 PM