Share News

Bihar: విశ్వాస పరీక్షకు అంతా సిద్ధం.. నితీశ్‌కు నల్లేరు నడకేనా

ABN , Publish Date - Feb 12 , 2024 | 10:34 AM

బిహార్ అసెంబ్లీలో సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) ప్రభుత్వం సోమవారం బలపరీక్షకు వెళ్లనున్న విషయం విదితమే. మహాఘట్ బంధన్ నుంచి బయటకి వచ్చాక బీజేపీతో జట్టుకట్టి నితీశ్ 9వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

Bihar: విశ్వాస పరీక్షకు అంతా సిద్ధం.. నితీశ్‌కు నల్లేరు నడకేనా

పట్నా: బిహార్ అసెంబ్లీలో సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) ప్రభుత్వం సోమవారం బలపరీక్షకు వెళ్లనున్న విషయం విదితమే. మహాఘట్ బంధన్ నుంచి బయటకి వచ్చాక బీజేపీతో జట్టుకట్టి నితీశ్ 9వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో నితీశ్ ప్రభుత్వ బలాన్ని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. నితీశ్‌కు చెందిన జనతాదళ్(యునైటెడ్), బీజేపీ కూటమి విశ్వాస పరీక్ష ఎదుర్కోబోతోంది. 243 సభ్యులున్న అసెంబ్లీలో నితీశ్ కూటమి ప్రస్తుత బలం 128. అంటే మెజారిటీ మార్క్ 122 కంటే 6 మంది ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. బలపరీక్షకు ముందు మంత్రి విజయ్ కుమార్ చౌదరి ఇంట్లో ఆదివారం కీలక సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో నితీష్ కుమార్ మాట్లాడుతూ.. విశ్వాస పరీక్షలో విజయం సాధించడం ఖాయమన్నారు. బలపరీక్ష సమయంలో తమ కూటమి ఎమ్మెల్యేలందరూ సభకు హాజరు కావాలని సూచించారు. శాసనమండలి సభ్యుడిగా ఉన్న నితీష్‌ కుమార్‌ను మినహాయించి జేడీ(యూ)కి చెందిన 45 మంది ఎమ్మెల్యేలు, జేడీ(యూ) మిత్రపక్షమైన బీజేపీకి చెందిన 78 మంది ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.

హిందుస్థానీ అవామ్ మోర్చాకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు వీరికి మిత్రపక్షంగా ఉన్నారు. మరో స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు కూడా వీరికే ఉంది. దీంతో ఈ కూటమి బలపరీక్షలో నెగ్గడం నల్లేరు మీద నడకే అంటున్నారు రాజకీయ నిపుణులు. మొత్తం 243 స్థానాలు కలిగిన బిహార్‌ అసెంబ్లీలో ప్రస్తుతం నితీశ్‌కు చెందిన జేడీయూకు 45 మంది సభ్యులు ఉండగా, బీజేపీకి 78 మంది, మాంఝీ పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తంగా మ్యాజిక్‌ ఫిగర్‌ (122)ను దాటి ఎన్‌డీఏకు బలం (127) ఉంది. మరోవైపు మహా గట్‌బంధన్‌లోని ఆర్జేడీ, కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలకు కలిపి 114 మంది ఎమ్మెల్యేలే ఉండగా.. వారెవరూ గీత దాటకుండా ఆయా పార్టీలు క్యాంపు రాజకీయాలు కొనసాగిస్తున్నాయి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 12 , 2024 | 10:35 AM