Ayushmann Khurrana: ఆయుష్మాన్ ఖురానాను 'యూత్ ఐకాన్'గా నియమించిన ఈసీ
ABN , Publish Date - Apr 02 , 2024 | 04:15 PM
ప్రజాస్వామ్య పండుగగా భావించే ఎన్నికల వేళ ఓటు హక్కుపై యువ ఓటర్లను చైతన్యవంతులను చేసేందుకు 'యూత్ ఐకాన్'గా బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానాను ఎన్నికల కమిషన్ మంగళవారంనాడు నియమించింది. లేటెస్ట్ వీడియోను ఈసీ తమ అధికారిక యూట్యూబ్, 'ఎక్స్' ప్రొఫైల్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో ఆయుష్మాన్ ఖురానా దేశ ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ కనిపిస్తారు.
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య పండుగగా భావించే ఎన్నికల వేళ ఓటు హక్కుపై యువ ఓటర్లను చైతన్యవంతులను చేసేందుకు 'యూత్ ఐకాన్' (Youth Icon)గా బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana)ను ఎన్నికల కమిషన్ (Election Commission) మంగళవారంనాడు నియమించింది. లేటెస్ట్ వీడియోను ఈసీ తమ అధికారిక యూట్యూబ్, 'ఎక్స్' ప్రొఫైల్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో ఆయుష్మాన్ ఖురానా దేశ ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ కనిపిస్తారు.
ఆయుష్మాన్ ఖురానా అప్పీల్..
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్‌పై ప్రమోషన్ బాధ్యతను ఆయుష్మాన్ ఖురానాకు ఎలక్షన్ కమిషన్ అప్పగించింది. ఓటర్లకు అప్పీల్ చేస్తున్న వీడియోను ఆయన మంగళవారంనాడు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో షేర్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆ వీడియోలో ఖురానా కోరారు. దేశ వాప్తంగా వివిధ రాష్ట్రాల్లో, పలు దఫాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, ఆయా తేదీలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల పండుగలో అంతా తమ విలువైన ఓటును వేసి పండుగ సంబరంలో పాల్గొనాలని కోరారు. ఆయుష్మాన్ ఖురానాకు ముందు నటుడు రాజ్‌కుమార్ రావును యూత్ ఐకాన్‌గా గతంలో ఈసీ నియమించింది.
కెరీర్ పరంగా..
కాగా, ఆయుష్మాన్ ఖురానా చివరిసారిగా 'డ్రీమా గాళ్-2'లో అనన్య పాండే సరసన నటించారు. ఆ తర్వాత కొద్ది నెలలుగా సినీ ప్రపంచానికి దూరంగా ఉన్నారు. ఆయన తదుపరి చిత్రంపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే, 2018 సూపర్ హిట్ చిత్రం 'బధాయీ హో' చిత్రం సీక్వెల్‌లో నటించేందుకు ఆయన చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.