Share News

Ashok Chavan: అలవాటులో పొరపాటు.. నోరుజారిన చవాన్, ఇక నవ్వులే నవ్వులు

ABN , Publish Date - Feb 13 , 2024 | 04:36 PM

కాంగ్రెస్ పార్టీకి సోమవారంనాడు రాజీనామా చేసిన అశోక్ చవాన్ మంగళవారం బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆ వెంటనే ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, అలవాటులో పొరపాటున ముంబై కాంగ్రెస్ చీఫ్‌‌కు ధన్యవాదాలని అనడంతో ఒక్కసారిగా అక్కడున్న బీజేపీ నేతలంతా నవ్వుల్లో మునిగిపోయారు.

Ashok Chavan: అలవాటులో పొరపాటు.. నోరుజారిన చవాన్, ఇక నవ్వులే నవ్వులు

ముంబై: రాజకీయ నేతలు పార్టీలు మారినప్పుడల్లా పాత కండువాలు మార్చి కొత్త కండువాలు కప్పుకోవడం రివాజే. సుదీర్ఘ కాలం ఒకే పార్టీలో పనిచేసిన నేతలు కారణాంతరాల వల్ల వేరే పార్టీలో చేరినప్పుడు తడబడటం కూడా అంతే రివాజు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ (Ashok Chavan) ఇలాంటి పరిస్థితినే మంగళవారంనాడు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి సోమవారంనాడు రాజీనామా చేసిన అశోక్ చవాన్ మంగళవారం బీజేపీ (BJP) కండువా కప్పుకున్నారు. ఆ వెంటనే ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, అలవాటులో పొరపాటున ముంబై కాంగ్రెస్ చీఫ్‌‌కు ధన్యవాదాలని అనడంతో ఒక్కసారిగా అక్కడున్న బీజేపీ నేతలంతా నవ్వుల్లో మునిగిపోయారు.


ముంబై బీజేపీ విభాగం అధ్యక్షుడు ఆశిష్ షెలార్‌కు కృతజ్ఞతలు చెప్పే సమయంలో చవాన్ తడబడ్డారు. ఆయనను ముంబై కాంగ్రెస్ చీఫ్‌గా సంబోధించారు. దీంతో చవాన్ పక్కనే ఉన్న ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆయనను అప్రమత్తం చేశారు. దీంతో చవాన్ తన మాటను సరిచేసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్టు ప్రకటించిన చవాన్ మంగళవారం ఉదయం మీడియాతో సంభాషిస్తూ ఈరోజు కొత్త రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ నుంచి ఫోన్లు వచ్చాయా అని అడిగినప్పుడు సమాధానాన్ని దాటవేశారు.

Updated Date - Feb 13 , 2024 | 04:36 PM