Share News

Nitish Kumar: బీజేపీతో కలవడం కంటే చావడం మేలు.. వైరల్ అవుతున్న నితీష్ కుమార్ పాత వీడియో!

ABN , Publish Date - Jan 28 , 2024 | 07:35 PM

అనేక మలుపులు, నాటకీయ పరిణామాల తర్వాత బీహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే నితీష్ తిరిగా సీఎం అయ్యారు. రికార్డు స్థాయిలో 9వ సారి బీహార్‌కు ముఖ్యమంత్రి అయి సంచలనం సృష్టించారు.

Nitish Kumar: బీజేపీతో కలవడం కంటే చావడం మేలు.. వైరల్ అవుతున్న నితీష్ కుమార్ పాత వీడియో!

అనేక మలుపులు, నాటకీయ పరిణామాల తర్వాత బీహార్‌లో (Bihar Politics) కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే నితీష్ కుమార్ (Nitish Kumar) తిరిగి సీఎం అయ్యారు. రికార్డు స్థాయిలో 9వ సారి బీహార్‌కు ముఖ్యమంత్రి అయి సంచలనం సృష్టించారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నితీష్ కుమార్‌తో బీహార్ గవర్నర్ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. నితీష్ కుమార్ తోపాటు ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

నిన్న మొన్నటి వరకు ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించిన నితీష్ కుమార్ ఇప్పుడు మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరడం సంచలనంగా మారింది. కాంగ్రెస్‌తో స్నేహాన్ని కట్ చేసుకుని వెంటనే బీజేపీతో (BJP) కలవడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. బీజేపీతో కలిసి నితీష్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఓ పాత వీడియో వైరల్ అవుతోంది. 2022 ఆగస్ట్‌లో ఏన్డీయే నుంచి వైదొలిగిన నితీష్ గతేడాది జనవరిలో రిపోర్టర్లు అడిగిన ఓ ప్రశ్నకు స్పందిస్తూ.. ``అలాంటి ప్రశ్నే ఉండదు. బీజేపీతో కలవడం కంటే చనిపోవడమే మేలు`` అని బదులిచ్చారు (Nitish Kumar Old Video).

2022లో ఏన్డీయే నుంచి బయటకు వచ్చిన నితీష్.. కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయ్యారు. 18 నెలలు కూడా గడవక ముందే మహాకూటమిని వీడి తిరిగి బీజేపీతో జత కట్టారు. బీజేపీకి దూరమైన ఆ 18 నెలల కాలంలో నితీష్ జాతీయ స్థాయిలో విపక్షాలను ఏకం చేసే ప్రయత్నం చేశారు. ``ఇండియా`` పేరుతో దేశవ్యాప్తంగా చాలా పార్టీలను కలిపి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అయితే ఉన్నపళంగా అందరినీ వదిలేసి తిరిగి బీజేపీకి చేరువయ్యారు.

Updated Date - Jan 28 , 2024 | 07:35 PM