Share News

Rahul Gandhi: 'అగ్నివీర్'కు ఆర్మీ కూడా వ్యతిరేకమే, మేం వస్తే రద్దు చేస్తాం

ABN , Publish Date - Apr 08 , 2024 | 08:19 PM

'అగ్నివీర్' స్కీమ్‌కు ఆర్మీ కూడా వ్యతిరేకమేనని, ఇందుకు సంబంధించిన నిర్ణయం ప్రధానమంత్రి కార్యాలయం లోనే జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 'అగ్నివీర్' పథకాన్ని రద్దు చేస్తామని మధ్యప్రదేశ్‌లోని షహడోల్‌లో సోమవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ రాహుల్ చెప్పారు.

Rahul Gandhi: 'అగ్నివీర్'కు ఆర్మీ కూడా వ్యతిరేకమే, మేం వస్తే రద్దు చేస్తాం

షహడోల్: 'అగ్నివీర్' (Agniveer) స్కీమ్‌కు ఆర్మీ కూడా వ్యతిరేకమేనని, ఇందుకు సంబంధించిన నిర్ణయం ప్రధానమంత్రి కార్యాలయం (PMO)లోనే జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 'అగ్నివీర్' పథకాన్ని రద్దు చేస్తామని మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని షహడోల్‌లో సోమవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ రాహుల్ చెప్పారు.


''గతంలో పేదవాళ్లు ఆర్మీలో చేరేవారు. వారికి పెన్షన్ వచ్చేది. ఇప్పుడు వాళ్లు సొంతంగా 4 నెలలు శిక్షణ పొందాలి. అదే చైనా సోల్జర్లకు ఐదేళ్లు శిక్షణ ఇస్తారు. అగ్నివీరులు మరణిస్తే వారికి ఎలాంటి పెన్షన్ ఉండదు, క్యాంటీన్ ఉండదు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని రద్దు చేస్తాం. ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే అగ్నివీర్ పథకానికి ఆర్మీ కూడా వ్యతిరేకమే. ఈ స్కీమ్ ప్రధానమంత్రి ఆలోచన నుంచి పుట్టింది. పీఎంఓ కార్యాలయం నిర్ణయం తీసుకుంది'' అని రాహుల్ పేర్కొన్నారు.

Congress moves EC: మోదీ 'ముస్లింలీగ్' వ్యాఖ్యలపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు


కుల, ఆర్థిక సర్వే అనివార్యం

కులగణన, ఆర్థిక సర్వే ఈ దేశానికి చాలా అవసరమని రాహుల్ అన్నారు. తాము మొదట కులగణన జరిపిస్తామని, అప్పుడే వెనుకబడిన వర్గాల జనాభా ఇతమిద్ధంగా తెలుస్తుందని చెప్పారు. ఆ తర్వాత ఆర్థిక సర్వే ప్రారంభిస్తామని, దేశ సంపదను జనాభా ఆధారంగా వెనుకబడిన తరగలకు ఉద్యోగాలు, సంక్షేమ పథకాలకు వెచ్చిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఖాళీలు ఉన్నాయని, వాటిని భర్తీ చేయడానికి బీజేపీకి ఇష్టం లేదని చెప్పారు. కేవలం కాంట్రాక్ట్‌పై పనులు ఇస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రం యువకులకు ఇవ్వడం లేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొదటి చర్యగా యువతకు 30 లక్షల ఉద్యోగాలు మంజూరు చేస్తామని రాహుల్ భరోసా ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లోని 29 లోక్‌సభ నియోజకవర్గాల్లో నాలుగు విడతలుగా ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13న పోలింగ్ జరుగనుంది. 2019 ఎన్నికల్లో బీజేపీ 29 స్థానాల్లో 28 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ ఒకే సీటు దక్కించుకుంది.

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 08 , 2024 | 08:19 PM