Share News

AAP: సుప్రీంకోర్టులో బీజేపీ బండారం బయటపడింది.. సుప్రీం తీర్పు తర్వాత ఆప్ కౌంటర్

ABN , Publish Date - Feb 20 , 2024 | 06:01 PM

చండీగఢ్ మేయర్ ఎన్నికల ఫలితాలపై సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చిన తీర్పుపై ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Admi Party) సంతోషం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టులో బీజేపీ(BJP) బండారం బయటపడిందంటూ ఆ పార్టీ విమర్శలు గుప్పించింది. ఈ సందర్భంగా ఢిల్లీ మంత్రి, ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్(Sourabh Bharadwaj) మాట్లాడుతూ.. ఇంత చిన్న ఎన్నికల్లోనే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ దోపిడీకి పాల్పడిందంటే.. అది పెద్ద ఆందోళన కలిగించే విషయమేనని అన్నారు.

AAP: సుప్రీంకోర్టులో బీజేపీ బండారం బయటపడింది.. సుప్రీం తీర్పు తర్వాత ఆప్ కౌంటర్

చండీగఢ్ మేయర్ ఎన్నికల ఫలితాలపై సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చిన తీర్పుపై ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Admi Party) సంతోషం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టులో బీజేపీ(BJP) బండారం బయటపడిందంటూ ఆ పార్టీ విమర్శలు గుప్పించింది. ఈ సందర్భంగా ఢిల్లీ మంత్రి, ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్(Sourabh Bharadwaj) మాట్లాడుతూ.. ఇంత చిన్న ఎన్నికల్లోనే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ దోపిడీకి పాల్పడిందంటే.. అది పెద్ద ఆందోళన కలిగించే విషయమేనని అన్నారు. ఇదే సమయంలో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ‘‘ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు సుప్రీంకోర్టుకి ధన్యవాదాలు’’ అని ఎక్స్ వేదికగా ఆయన రాసుకొచ్చారు.


ఇదిలావుండగా.. జనవరి 30వ తేదీన జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో తగినంత సంఖ్యా బలం(16) లేకపోయినప్పటికీ బీజేపీ మేయర్ అభ్యర్థి మనోజ్ సోంకర్ విజయం సాధించారు. మెజారిటీకి అవసరమైన కౌన్సిలర్ల బలం(20) ఉన్నా.. ఆప్-కాంగ్రెస్ కూటమి అభ్యర్థి కుల్దీప్ కుమార్ మాత్రం ఓటమి పాలయ్యారు. దీంతో.. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. ఆప్ అభ్యర్థి అయిన కుల్దీప్‌ను విజేతగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాల ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసేందుకు.. ఉద్దేశపూర్వకంగా వ్యవహరించారని స్పష్టంగా తెలుస్తోందని తెలిపింది.

ఈ సందర్భంగా.. రిటర్నింగ్ అధికారి కొట్టివేత గుర్తు పెట్టిన బ్యాలెట్ పేపర్లను ధర్మాసనం పరిశీలించింది. అనంతరం లెక్కింపు ప్రక్రియను సంబంధించిన వీడియోని మరోసారి వీక్షించారు. విచారణ సమయంలో.. ‘‘బ్యాలెట్ పత్రాలు పాడైపోయాయని చెప్పారు. అది ఎక్కడో చూపించగలరా?’’ అని రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్‌ని ప్రశ్నించింది. బ్యాలెట్ పేపర్లు మిక్స్ అవ్వకుండా తానలా చేశానని ఆయన బదులిచ్చాడు. ఇది ఎన్నికల ప్రజాస్వామ్యంలో అనుమతించబడదని, అనిల్‌ని ప్రాసిక్యూట్ చేయాలని ధర్మాసనం బదులిచ్చింది. ఫైనల్‌గా.. కొట్టివేత గుర్తింపు ఉన్న బ్యాలెట్ పేపర్లు చెల్లుబాటు అవుతాయని ధర్మాసనం స్పష్టం చేసింది.

Updated Date - Feb 20 , 2024 | 06:01 PM