Share News

Lok Sabha polls: 79 శాతం మద్దతు ఎన్డీయేకే... 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వే వెల్లడి

ABN , Publish Date - Mar 27 , 2024 | 09:21 PM

లోక్‌సభ ఎన్నికల్లో 'ఇండియా' కూటమి కంటే బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం వైపు 79 శాతం మంది భారతీయులు మొగ్గుచూపుతున్నారు. ప్రధాన మంత్రి పదవికి 'టాప్ ఛాయెస్'గా నరేంద్ర మోదీ నిలిచారు. ఆసియానెట్ న్యూస్ 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వే ఈ సంచలన విషయాలు వెల్లడించింది.

Lok Sabha polls: 79 శాతం మద్దతు ఎన్డీయేకే... 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వే వెల్లడి

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో (Loksabha Elctions) 'ఇండియా' (I.N.D.I.A.)కూటమి కంటే బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం వైపు 79 శాతం మంది భారతీయులు మొగ్గుచూపుతున్నారు. ప్రధాన మంత్రి పదవికి 'టాప్ ఛాయెస్'గా నరేంద్ర మోదీ నిలుస్తున్నారు. ఆసియానెట్ న్యూస్ 'మూడ్ ఆఫ్ ది నేషన్' (Mood of the Nation) సర్వే ఈ సంచలన విషయాలు వెల్లడించింది. తమ సర్వే వివరాలను బుధవారంనాడు విడుదల చేసింది. ఆ ఆసక్తికర విషయాల వివరాల్లోకి వెళితే..


సీఏఏ ప్రభావం..

పౌరసత్వ సవరణ చట్టం (CAA) నిబంధలను నోటిఫై చేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలపై సానుకూల ప్రభావం చూపుతుందని సర్వేలో పాల్గొన్న 51.1 శాతం మంది అభిప్రాయపడ్డారు. 26.85 శాతం మంది ప్రతికూల ప్రభావం చూపవచ్చని అభిప్రాయపడ్డారు. బీజేపీ ఎన్నికలపై సీఏఏ నిబంధనల నోటిఫై ప్రభావం ఏమాత్రం ఉండదని తమిళనాడుకు చెందిన 48.5 శాతం అభిప్రాయం వ్యక్తం చేశారు.


రామమందిరం అంశం..

మౌలిక వసతలు అభివృద్ధి పనులు నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయంగా 38.11 శాతం మంది అభిప్రాయపడ్డారు. డిజిటల్ ఇండియా ఇనీషియేటివ్ ‌కీలకమని 26.41 మంది, ఆత్మనిర్భర్‌ భారత్ అతిపెద్ద అచీవ్‌మెంట్ అని 11.46 శాతం మంది అభిప్రాయపడ్డారు. హిందీ భాషా ప్రాంతాల నుంచి 30.04 శాతం మంది రామమందిరం కలల సాకారమే మోదీ సాధించిన అతిపెద్ద విజయంగా పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన అంశంగా రామమందిర్ అంశం నిలుస్తుందని దేశవ్యాప్తంగా స్పందించిన వారిలో 57.16 శాతం అభిప్రాయపడగా, 31.16 శాతం ఇందుకు భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశారు.


ప్రధానిగా టాప్ ఛాయెస్..

ప్రధాన మంత్రిగా ఎవరైతే బాగుంటుందని అనుకుంటున్నారనే ప్రశ్నకు 51.06 శాతం మంది మోదీ వైపే మొగ్గుచూపారు. 46.45 శాతం మంది రాహుల్‌ గాంధీ వైపు మొగ్గు కనబరిచారు. ఒక్క కేరళలో మాత్రం 50.59 శాతంతో రాహుల్‌ ఒకింత ఆధిక్యత కనబరిచారు.


అభివృద్ధికి పెద్దపీట...

ఆసక్తికరంగా 80.5 శాతం మంది కుల సమీకరణలు, అభ్యర్థుల ప్రొఫైల్, ఉచితాలు కంటే అభివృద్ధి వైపు ఆసక్తి కనబరిచారు. అభివృద్ధే ఓట్లను ప్రభావితం చేసే ప్రధాన అంశమవుతుందన్నారు. 2024లోనూ మోదీ వేవ్‌ను 'ఇండియా' కూటమి అధిగమించలేదని బీజేపీ పాలిత రాష్ట్రాలే కాకుండా బీజేపీయేతర రాష్ట్రాల్లోనూ 60.33 శాతం అభిప్రాయపడ్డారు. మోదీ వేవ్‌ను 'ఇండియా' కూటమి నియంత్రించ గలదని సర్వేలో పాల్గొన్న వారిలో 32.28 శాతం మంది పేర్కొన్నారు. విపక్ష కూటమికి విజన్ లేదని, నాయకత్వం లేదని, ప్రధాని పదవిని ఆశిస్తున్న నేతలు ఇబ్బడిముబ్బడిగా ఉన్నారని 48.25 శాతం మంచి తేల్చేశారు.


భారత్ జోడో ప్రభావం..

సర్వేలో పాల్గొన్న వారిలో 54.76 శాతం మంది రాహుల్ గాంధీ ''భారత్ జోడో యాత్ర'' ప్రభావం కాంగ్రెస్‌ పార్టీ విజయావకాశాలను మెరుగపరచలేదని అభిప్రాయపడగా, 38.21 శాతం మాత్రం రాహుల్ యాత్రతో కాంగ్రెస్ గెలిచే సీట్ల సంఖ్య పెరగవచ్చన్నారు.


మోదీ సర్కార్ అతిపెద్ద వైఫల్యం ఏమిటంటే..

నరేంద్ర మోదీ ప్రభుత్వం అతిపెద్ద వైఫల్యంగా దేనిని భావిస్తున్నారని అడిగినప్పుడు 32.86 శాతం మంది మణిపూర్‌లో హింసాకాండను సమర్ధవంతంగా ఎదుర్కోలేదని అభిప్రాయపడ్డారు. ఇతర అంశాత్లో ఇంధనం ధరల పెరుగుదల (26.2శాతం), నిరుద్యోగం (21.3 శాతం), ద్రవ్యోల్బణం (19.6) ఉన్నాయి. హిందీ భాషా రాష్ట్రాల్లో 36.7 శాతం మందిని నిరుద్యోగం అంశం ఆందోళన కలిగిస్తోందని చెప్పగా, తమిళనాడు నుంచి సర్వేలో పాల్గొన్న వారిలో 41.79 శాతం మంది ధరల పెరుగదల అంశం ఆందోళన కలిగిస్తోందన్నారు.


మధ్యతరగతి వర్గం పరిస్థితి, మోదీ హామీలపై..

మోదీ ప్రభుత్వంలో మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయా అనే ప్రశ్నకు 47.8 శాతం మంది సానుకూలంగా స్పందించగా, 46.1 శాతం మంది ప్రతికూలంగా స్పందించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చినట్టు 51.08 శాతం మంది అభిప్రాయపడగా, 42.97 శాతం మంది విభేదించారు.


అవినీతి అంశంపై...

మోదీ ప్రభుత్వంలో అవినీతికి కళ్లెం పడిందని సర్వేలో పాల్గొన్న వారిలో 60.4 శాతం మంది నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేయగా, 56.39 శాతం మంది మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానానికి పట్టం కట్టారు. సరిహద్దు సమస్య విషయంలో చైనాతో వ్యవహరిస్తున్న తీరును 65.08 మంది సమర్ధించగా, బీజింగ్‌తో మోదీ సర్కార్ అనుసరిస్తున్న విధానంపై 21.82 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంగ్లీషు, హిందీ, మలయాళం, కన్నడం, తమిళం, తెలుగు, బంగ్లా, మరాఠీలోని ఆసియా న్యూస్ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా ఈ సర్వేను మార్చి 13-17 మధ్య నిర్వహించారు. 7.59 లక్షల మంది సర్వేలో పాల్గొన్నారు. ఏడు విడతల లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19తో ప్రారంభమై జూన్ 4న ఫలితాల వెల్లడితో ముగియనున్నాయి.

Updated Date - Mar 27 , 2024 | 09:40 PM