Ram Mandir: 1528 నుంచి 2024 దాకా.. ఈ 500 ఏళ్లలో రామ మందిర ప్రయాణం ఎలా సాగిందంటే?
ABN , Publish Date - Jan 22 , 2024 | 04:31 PM
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ శుభ సందర్భం రానే వచ్చేసింది. దాదాపు 500 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న హిందువుల కల నేటికి (22/01/24) నెరవేరింది. అయోధ్యలోని రామమందిరం ప్రారంభోత్సవం ఎంతో ఘనంగా జరిగింది. ముహూర్తం సమయానికే.. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ముగిసింది.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ శుభ సందర్భం రానే వచ్చేసింది. దాదాపు 500 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న హిందువుల కల నేటికి (22/01/24) నెరవేరింది. అయోధ్యలోని రామమందిరం ప్రారంభోత్సవం ఎంతో ఘనంగా జరిగింది. ముహూర్తం సమయానికే.. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ముగిసింది. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా.. వేలాదిమంది అతిరథ మహారథుల మధ్య ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యింది. స్వామివారికి మొదటి హారతి ప్రధాని మోదీ ఇచ్చారు.
అయితే.. బాబ్రీ మసీదు దగ్గర నుంచి రామమందిరం దాకా సాగిన ఈ ప్రయాణం అంత సులువైంది కాదు. ఈ ప్రయాణంలో ఎన్నో అవాంతరాలు, మరెన్నో కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయి. పదండి, ఒకసారి వాటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
1528 - బాబ్రీ మసీదు మూలం
మొఘల్ చక్రవర్తి బాబర్ కమాండర్ అయిన మీర్ బాకీ 1528లో బాబ్రీ మసీదును నిర్మించడంతో.. రామమందిర ఉద్యమం ప్రారంభమైంది. ఈ మసీదును హిందూ దేవాలయ శిథిలాలపై నిర్మించారనే నమ్మకం.. దశాబ్దాలపాటు రెండు వర్గాల మధ్య చర్చలు, ఘర్షణలకు దారితీసింది.
1751 - మరాఠా దావా
బీజేపీకి చెందిన రచయిత, మాజీ రాజ్యసభ ఎంపీ బల్బీర్ పుంజ్ 'ట్రైస్ట్ విత్ అయోధ్య: డీకోలనైజేషన్ ఆఫ్ ఇండియా’ అనే పేరుతో పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో మరాఠాలు.. అయోధ్య, కాశీ మథురలపై నియంత్రణ సాధించాలని కోరుతున్నారని రాసుకొచ్చారు. దీంతో.. ఆ సమయంలో పలు వివాదాలు చోటు చేసుకున్నాయి.
1858 - నిహాంగ్ సిక్కుల డిమాండ్
1858లో నిహాంగ్ సిక్కులు బాబ్రీ మసీదును రాముడి జన్మస్థలంగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఈ సంఘటన వివాదాస్పద స్థలంపై నియంత్రణ కోసం పోరాటానికి నాంది పలికింది. ఆ తర్వాత ఎన్నో సంఘర్షణలు చోటు చేసుకున్నాయి. 2019లో తన చారిత్రాత్మక తీర్పు సమయంలోనూ సుప్రీంకోర్టు.. 25 మంది నిహాంగ్ సిక్కులతో కలిసి నిహాంగ్ బాబా ఫకీర్ సింగ్ ఖాల్సా మసీదు ఆవరణలోకి చొరబడ్డారని, మసీదు ఉన్న ప్రదేశం రాముడి చారిత్రాత్మక జన్మస్థలమని వాదించారని పేర్కొంది.
1885 - మొదటి చట్టపరమైన దావా
1885లో నిర్మోహి అఖారా పూజారి రఘుబర్ దాస్.. బాబ్రీ మసీదు బయటి ప్రాంగణంలో ఆలయాన్ని నిర్మించేందుకు అనుమతి కోరుతూ మొదటి న్యాయపరమైన దావా వేశారు. ఆ దావాని తిరస్కరించబడినప్పటికీ.. ఈ వివాదాన్ని అది సజీవంగా ఉంచింది. ఆ సమయంలో బ్రిటీష్ పాలకులు.. హిందువులు, ముస్లింల కోసం వేర్వేరు ప్రార్థనా స్థలాలను గుర్తించే విధంగా స్థలం చుట్టూ కంచెను వేసింది. ఇది దాదాపు 90 సంవత్సరాలు ఇలాగే కొనసాగింది.
1949 - బాబ్రీ మసీదు లోపల రామ్ లల్లా విగ్రహాలు
1949 డిసెంబర్‌లో బాబ్రీ మసీదు లోపల ‘రామ్ లల్లా’ విగ్రహాలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో.. ఇరువర్గాల మధ్య మతపరమైన ఘర్షణలు తీవ్రతరం అయ్యాయి. అప్పుడు ఇరువర్గాల పెద్దలు న్యాయపోరాటానికి దిగారు. మసీదు లోపల విగ్రహాలు కనిపించాయని హిందువులు పేర్కొనడంతో.. ఈ వివాదం తొలిసారి కోర్టుకు వెళ్లింది.
1950-1959: చట్టపరమైన దావాలు గుణించాలి
ఈ దశాబ్ద కాలంలో బాబ్రీ మసీదు వివాదంపై మరిన్ని చట్టపరమైన దావాలు దాఖలయ్యాయి. ‘నిర్మోహి అఖారా’ విగ్రహాలను పూజించే హక్కులను కోరగా.. సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరింది. దీంతో.. ఈ వివాదం మరింత ముదిరింది.
1986-1989: బాబ్రీ మసీదు తాళాలు తెరవబడ్డాయి
ఈ వివాదం తీవ్రతరమవుతున్న తరుణంలో.. 1986లో రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బాబ్రీ మసీదు తాళాలు తెరిచి, లోపల హిందువులకు పూజలు చేసేందుకు అనుమతి ఇచ్చారు. ఈ నిర్ణయం మరోసారి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. రామజన్మ ఇదొక కీలక ఘట్టంగా మారింది. విశ్వహిందూ పరిషత్ (VHP) 1990లో రామమందిర నిర్మాణానికి డెడ్‌లైన్ విధించింది. దేశవ్యాప్తంగా రామాలయం డిమాండ్లు పెరిగాయి. ముఖ్యంగా.. వీహెచ్‌పీ, బీజేపీ నాయకులు ఈ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తారు. ఈ కాలంలోనే బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ రథయాత్ర కూడా ప్రారంభమైంది.
1990 - రథయాత్ర & విఫలమైన కూల్చివేత ప్రయత్నం
మండల్ కమిషన్ అమలు, పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల మధ్య.. 1990లో ఎల్‌కే అద్వానీ రథయాత్ర మొదలుపెట్టారు. రామాలయానికి మద్దతు కూడగట్టే లక్ష్యంగా ఈ రథయాత్రను మొదలుపెట్టారు. అప్పుడే మసీదు కూల్చివేసేందుకు ప్రయత్నం చేశారు కానీ.. అది విఫలమైంది. అయితే.. ఈ ఉద్యమం మాత్రం ఒక ముఖ్యమైన మలుపుగా నిలిచింది.
1992 - బాబ్రీ మసీదు కూల్చివేత
1992లో బాబ్రీ మసీదుని కూల్చివేశారు. సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చినప్పటికీ.. హిందూ కార్యకర్తలు ఆ మసీదును ధ్వంసం చేశారు. ఆ తర్వాత అల్లర్లు చెలరేగాయి. అవి భారత రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపాయి.
1993-1994: కూల్చివేత అనంతర అల్లర్లు
బాబ్రీ మసీదుని కూల్చేసిన తర్వాత దేశవ్యాప్తంగా మతపరమైన అల్లర్లు చెలరేగాయి. ఫలితంగా.. భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగాయి. ఈ వివాదాస్పద స్థలాన్ని పీవీ నరసింహారావు నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని డాక్టర్ ఇస్మాయిల్ ఫరూఖీ సవాలు చేశారు. ఇది 1994లో సుప్రీంకోర్టు తీర్పుకు దారితీసింది. ఈ తీర్పు ఈ విషయంలో రాష్ట్ర ప్రమేయాన్ని మరింతగా బలపరిచింది.
2002-2003: ASI తవ్వకం, అలహాబాద్ హైకోర్టు విచారణ
అలహాబాద్ హైకోర్టు 2002లో ఈ కేసుని విచారించడం ప్రారంభించింది. మసీదు కింద హిందూ దేవాలయ శిథిలాలు ఉన్నాయా? లేవా? అనే విషయంపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) త్రవ్వకాలను నిర్వహించింది. ఫైనల్‌గా.. రామాలయ ఆనవాళ్లు ఉన్నట్లు నివేదించింది.
2009-10: లిబర్‌హాన్ నివేదిక సమర్పణ
16 ఏళ్లలో 399 సిట్టింగ్‌ల తర్వాత లిబర్‌హాన్ కమిషన్ తన నివేదికను సమర్పించింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన క్లిష్టమైన వివరాలను వెల్లడిస్తూ.. ఇందులో కీలక నేతల ప్రమేయం ఉందని పేర్కొంది. 17 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత.. ఎల్‌కే అద్వానీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, ఇతర బిజెపి నాయకుల పేర్లతో లిబర్‌హాన్ కమిషన్ జూన్ 2009న తన నివేదికను సమర్పించింది. 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు.. హిందువులు, ముస్లింలు, నిర్మోహి అఖారాలకు సమానంగా భూమిని పంచిపెట్టి.. ఈ వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేసింది. మధ్య భూమిని విభజించడం ద్వారా వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేసింది. అయితే.. ఈ నిర్ణయం అప్పీళ్లు, మరిన్ని చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంది.
2019: సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు
2019లో సుప్రీంకోర్టు ఈ వివాదాస్పద స్థలంపై చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. రామ మందిర నిర్మాణం కోసం మొత్తం వివాదాస్పద భూమిని హిందువులకు అప్పగిస్తూ.. మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించింది. ఇక్కడితో ఈ వివాదానికి తెరపడింది.
2020-2024 వరకు
2020 ఆగస్టు 5వ తేదీన బాబ్రీ మసీదు స్థలంలో ప్రధాని నరేంద్ర మోదీ రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పుడే శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కొనసాగుతున్న ఈ రామమందిర నిర్మాణంలో భాగంగా తొలి దశ పూర్తయ్యింది. 2024 జనవరి 22వ తేదీన అయోధ్యలో నిర్మించిన రామాలయంలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు.
ప్రాణప్రతిష్ఠ తర్వాత ఏంటి?
ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన మరుసటి రోజే రామాలయం పనులను తిరిగి ప్రారంభించనున్నారు. ఈ ఏడాది చివరిల్లా పూర్తి మందిరాన్ని నిర్మించేలా ప్రణాళికలు చేపట్టారు.