Share News

World War 3: మూడో ప్రపంచ యుద్ధాన్ని రష్యా ప్రారంభివచ్చు.. ఆ రహస్య పత్రాల్లోని సమాచారం లీక్!

ABN , Publish Date - Jan 16 , 2024 | 08:44 PM

గత రెండేళ్ల నుంచి ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా మూడో ప్రపంచ యుద్ధానికి పునాది వేయనుందా? అంటే.. జర్మనీ రక్షణ మంత్రిత్వ శాఖ నుండి వెలువడిన రహస్య పత్రాల్లోని సమాచారం అవుననే చెప్తోంది. ఈ కీలక సమాచారం బైల్డ్ వార్తాపత్రికలో ప్రచురితమైంది.

World War 3: మూడో ప్రపంచ యుద్ధాన్ని రష్యా ప్రారంభివచ్చు.. ఆ రహస్య పత్రాల్లోని సమాచారం లీక్!

గత రెండేళ్ల నుంచి ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా మూడో ప్రపంచ యుద్ధానికి పునాది వేయనుందా? అంటే.. జర్మనీ రక్షణ మంత్రిత్వ శాఖ నుండి వెలువడిన రహస్య పత్రాల్లోని సమాచారం అవుననే చెప్తోంది. ఈ కీలక సమాచారం బైల్డ్ వార్తాపత్రికలో ప్రచురితమైంది. ప్రస్తుతం ఉక్రెయిన్‌తో తలపడుతున్న రష్యా.. నాటో మిత్రదేశాలపై కూడా దాడి చేసి ఈ యుద్ధాన్ని విస్తరించగలదని, ఫలితంగా మూడో ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం ఉందని ఆ వార్తాపత్రిక వెల్లడించింది. ఆ భయంతోనే రష్యాకు వ్యతిరేకంగా జర్మనీ సాయుధ పోరాటానికి సిద్ధమవుతోందని తెలిపింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం దాదాపు రెండేళ్లు కావొస్తున్న సందర్భంగా.. బైల్డ్ ఇచ్చిన ఈ నివేదిక హాట్ టాపిక్‌గా మారింది.


మరోవైపు.. నాటో తూర్పు పార్శ్వంపై ఐరోపాలోని సాయుధ దళాలతో దాడి చేయించేందుకు రష్యా సిద్ధమవుతోందని, ఇందులో సైబర్ దాడి కూడా ఉండొచ్చని ఆ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలోనే.. ‘‘అలయన్స్ డిఫెన్స్ 2024’’ పేరుతో మరికొన్ని వారాల్లోనే పదివేల మంది జర్మన్ సైనికులను యుద్ధభూమికి పంపడం జరుగుతుందని రక్షణ మంత్రి వర్గాలను ఉటంకిస్తూ ‘బైల్డ్’ చెప్పింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచిన పాశ్చాత్త దేశాల నుంచి ఇప్పుడు నిధులు తగ్గిపోతున్నందున.. అదును చూసి ఉక్రెయిన్‌పై రష్యా మరింత విరుచుకుపడే అవకాశం ఉందని ఆ జర్మన్ ఔట్‌లెట్ చెప్పుకొచ్చింది. సెప్టెంబరులో ఈ ఘర్షణలు తీవ్రతరం అవుతాయని.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పశ్చిమ రష్యా, బెలారస్‌లో సుమారు 50,000 మంది రష్యన్ దళాలతో కూడిన పెద్దఎత్తున సైనిక విన్యాసాల్ని ప్రారంభించవచ్చని తెలిపింది. ఇలా.. రష్యా దళాలు ఎలా ముందుకు సాగుతాయి, నాటో దాని మిత్రదేశాల్ని ఎలా కాపాడుకుంటుందో కూడా బైల్డ్ వివరించింది.

ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలను సైతం రష్యా అవకాశంగా మలచుకొని, మరింత హింసకు ఆజ్యం పోయొచ్చని కూడా బైల్డ్ నివేదిక చెప్పింది. 2025 మే నాటికి రష్యాకు వ్యతిరేకంగా నాటో చర్యలు తీసుకోనుందని.. రష్యా, పాశ్చాత్య దళాల మధ్య పోరాటాన్ని నిరోధించాలని నాటో సాయశక్తులా ప్రయత్నాలు చేస్తుందని ఆ నివేదిక పేర్కొంది. అయితే.. ఈ నివేదికను రష్యా ఖండించింది. దీని గురించి క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్‌ను అడగ్గా.. దానిపై స్పందించేందుకు నిరాకరించారు. ఈ వార్తాపత్రిక క్రమం తప్పకుండా వివిధ నకిలీ వార్తలను ప్రచురిస్తోందని, ఈ తాజా నివేదిక కూడా నకిలీదేనని ఖండించారు.

Updated Date - Jan 16 , 2024 | 08:44 PM