Share News

Covid-19 Vaccine: 200కు పైగా వ్యాక్సిన్లు వేయించుకున్న వ్యక్తి.. స్టడీలో బయటపడ్డ ఆసక్తికర విషయాలు

ABN , Publish Date - Mar 06 , 2024 | 05:24 PM

కొవిడ్-19 మహమ్మారి (Covid-19 Pandemic) సమయంలో వ్యాక్సిన్లు (Vaccines) ఎంత కీలక పాత్ర పోషించాయో అందరికీ తెలుసు. వైరస్ బారిన పడకుండా, శరీరంలో రోగ నిరోధక శక్తిని (Immunity) పెంచి.. ఆ వ్యాక్సిన్లు ఎంతోమంది ప్రాణాలను కాపాడాయి. అయితే.. కొందరు అతి జాగ్రత్తకు పోయి రెండు డోస్‌లకు మించి ఎక్కువసార్లు టీకా వేయించుకున్నారు.

Covid-19 Vaccine: 200కు పైగా వ్యాక్సిన్లు వేయించుకున్న వ్యక్తి.. స్టడీలో బయటపడ్డ ఆసక్తికర విషయాలు

కొవిడ్-19 మహమ్మారి (Covid-19 Pandemic) సమయంలో వ్యాక్సిన్లు (Vaccines) ఎంత కీలక పాత్ర పోషించాయో అందరికీ తెలుసు. వైరస్ బారిన పడకుండా, శరీరంలో రోగ నిరోధక శక్తిని (Immunity) పెంచి.. ఆ వ్యాక్సిన్లు ఎంతోమంది ప్రాణాలను కాపాడాయి. అయితే.. కొందరు అతి జాగ్రత్తకు పోయి రెండు డోస్‌లకు మించి ఎక్కువసార్లు టీకా వేయించుకున్నారు. ఆ సమయంలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండేది కాబట్టి.. ప్రాణభయంతో కొంతమంది ఎక్కువ టీకాలు తీసుకోవడం జరిగింది. ఇలా జర్మనీకి చెందిన ఓ వ్యక్తి (62).. ఏకంగా 217 వ్యాక్సిన్లు తీసుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే ప్రకటించాడు.


ఆ వ్యక్తి గురించి వార్తాపత్రికల్లో కథనాలు రావడంతో.. అతనిపై శాస్త్రవేత్తల కన్ను పడింది. 217 సార్లు వ్యాక్సిన్లు వేయించుకున్నాడు కాబట్టి.. అతనిపై అవి ఎలాంటి ప్రభావం చూపాయోనని తెలుసుకోవడం కోసం వాళ్లు రంగంలోకి దిగి.. అతనిపై ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలోనే కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మూడు డోస్‌లు తీసుకున్న వారితో పోలిస్తే.. SARS-CoV-2 వైరస్‌కు వ్యతిరేకంగా అధిక సాంద్రత కలిగిన రోగనిరోధక కణాలు, యాంటీబాడీలతో పూర్తిగా పనిచేసే రోగనిరోధక వ్యవస్థను ఆ వ్యక్తి కలిగి ఉన్నట్టు అధ్యయనం తెలిపింది. ఈ విషయం తెలిసి సైంటిస్టులు సైతం షాక్‌కి గురయ్యారు. ఎందుకంటే.. హెచ్‌ఐవీ (HIV), హెపటైటిస్‌-బీ (Hepatitis B) వంటి ఇన్ఫెక్షన్లతో బాఢపడేవారు నిరంతరం టీకాలు తీసుకుంటే.. రోగ నిరోధక వ్యవస్థలోని ‘టీ-సెల్స్’ (T-Cells) అలసిపోతాయని, అవి ‘ప్రొ-ఇన్‌ఫ్లమేటరీ’ని తక్కువగా విడుదల చేస్తాయని, ఫలితంగా రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుందని విశ్లేషణలు తెలిపాయి.

కానీ.. ఆ జర్మన్ వ్యక్తిపై నిర్వహించిన అధ్యయనంలో మాత్రం అలాంటి సూచనలు కనిపించలేదని, అతని రోగ నిరోధక వ్యవస్థ సమర్థవంతంగా పని చేస్తోందని పరిశోధకులు తెలిపారు. అతని శరీరంలో కొవిడ్‌పై పోరాడే టీ-కణాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని, అవి అలసిపోయినట్లు కనిపించలేదని చెప్పారు. సాధారణ సంఖ్యలో వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో మాదిరిగానే.. అతనిలోనూ టీ-కణాలు సమర్థంగా పని చేస్తున్నాయని.. అతని రోగ నిరోధక శక్తి బలహీనపడిందనే సంకేతాలు తమకు కనిపించలేదని స్పష్టం చేశారు. కాగా.. ఎర్లాంగెన్‌-నర్న్‌బర్గ్‌లోని ఫ్రెడ్రిక్‌ అలగ్జాండర్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం అతనిపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనాన్ని లాన్సెంట్‌ జర్నల్‌లో (The Lancent Journal) ప్రచురించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 06 , 2024 | 06:26 PM