Share News

Stomach Heat: కడుపులో వేడి, ఎసిడిటీ సమస్యలు వేధిస్తున్నాయా? ఈ సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టేయండి!

ABN , Publish Date - Mar 29 , 2024 | 01:37 PM

చాలామంది పొట్ట వేడి తగ్గించుకోవడానికి మందులు వాడుతుంటారు. అయితే మందులు అవసరం లేకుండా ఇంటి చిట్కాలతోనే పొట్ట వేడిని, ఎసిడిటీని తగ్గించుకోవచ్చు

Stomach Heat: కడుపులో వేడి, ఎసిడిటీ సమస్యలు వేధిస్తున్నాయా? ఈ సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టేయండి!

తప్పుడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల తరచుగా పొట్టకు సంబంధించిన సమస్యలు వస్తాయి. కడుపు నొప్పి, విశ్రాంతి లేకపోవడం, గ్యాస్ మాత్రమే కాకుండా కడుపు వేడిగా మారుతుంది. సాధారణంగీ శరీరంలో వేడి ఎక్కువైతే దాని ప్రభావం కడుపు భాగంలోనే కనిపిస్తుంది. కడుపు వేడి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. చాలామంది పొట్ట వేడి తగ్గించుకోవడానికి మందులు వాడుతుంటారు. అయితే మందులు అవసరం లేకుండా ఇంటి చిట్కాలతోనే పొట్ట వేడిని, ఎసిడిటీని తగ్గించుకోవచ్చు. అసలు పొట్ట వేడి ఎందుకు వస్తుంది? దీన్ని నివారంచే ఇంటి చిట్కాలేంటో తెలుసుకుంటే..

ఎక్కువగా కారంగా ఉండే ఆహారం తినడం, రాత్రిపూట ఆలస్యంగా తినడం, తక్కువ నీళ్లు తాగడం. టీ, కాఫీలు ఎక్కువగా తీసుకోవడం. నాన్ వెజ్ ఎక్కువగా తినడం, పెయిన్ కిల్లర్స్ వాడడం, పొగతాగడం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల పొట్టలో వేడి పెరుగుతుంది. కడుపులో నిరంతర వేడి కారణంగా పెప్టిక్ అల్సర్ వంటి వ్యాధులు వస్తాయి.

ఇది కూడా చదవండి: జుట్టు పెరుగుదలను అమాంతం పెంచే యోగాసనాలు ఇవీ..!


లక్షణాలు..

కడుపులో వేడి ఉన్నప్పుడల్లా ఆకలి మందగించడం, గ్యాస్‌, మంట, కడుపు ఉబ్బరం, వాంతులు, కడుపునొప్పి, తిమ్మిర్లు, విరేచనాలు వంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది.

కడుపు వేడి తగ్గించుకోవడానికి చిట్కాలు..

CCF టీ..

కడుపు సంబంధిత సమస్యలన్నింటికీ ఈ టీ చాలా మేలు చేస్తుంది. ఇందుకోసం ముందుగా 1 చెంచా జీలకర్ర, ఒక చెంచా కొత్తిమీర, ఒక చెంచా సోపు, ఒక చెంచా చక్కెరతో పాటు కొన్ని పుదీనా ఆకులను తీసుకోవాలి. జీలకర్ర, కొత్తిమీర, సోపు, పంచదార ఒక పాత్రలో వేసి ఒక కప్పు నీటిని జోడించి 10 నిమిషాలు ఉడకబెట్టాలి. నీటి రంగు మారినప్పుడు అందులో పుదీనా ఆకులను వేసి ఒక నిమిషం పాటు మరిగించాలి. మిశ్రమం చల్లారిన తర్వాత తాగాలి.

కలబంద జ్యూస్..

కలబంద జ్యూస్ శరీరాన్ని ఎక్కువసేపు హైడ్రేట్‌గా ఉంచుతుంది, పేగు వేడి, గ్యాస్, కడుపులో మంటతో సహా మొత్తం జీర్ణవ్యవస్థను చల్లబరచడంలో ఇది సహాయపడుతుంది.

కొబ్బరి నీరు

ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉన్న కొబ్బరి నీళ్లలో పొటాషియం వంటి అవసరమైన ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. కడుపులో మంటగా ఉన్నప్పుడల్లా కొబ్బరినీరు తాగితే ఉపశమనం ఉంటుంది.

ఏలకులు

గ్యాస్ కారణంగా గుండెల్లో మంట, వికారం రావడం సాధారణం. ఇలాంటి సందర్బాలలో ఏలకులను నీటిలో ఉడికించి ఆ నీటిని త్రాగాలి. శరీరం నుండి వేడి, టాక్సిన్ లు బయటకు పోతాయి. శ్వాస కూడా తాజాగా ఉంటుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 29 , 2024 | 01:37 PM