Share News

Mutton Liver: మటన్ లివర్ తెగ లాగించేస్తున్నారా.. అయితే తప్పక తెలుసుకోండి..

ABN , Publish Date - Dec 29 , 2024 | 07:22 AM

మటన్ లివర్‍లో ఆరోగ్యాన్ని ఇచ్చే అనేక ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీతన నివారించి, శరీర భాగాలకు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ఎంతోగానో ఉపయోగపడుతుంది.

Mutton Liver: మటన్ లివర్ తెగ లాగించేస్తున్నారా.. అయితే తప్పక తెలుసుకోండి..
Mutton Liver Fry

ఇంటర్నెట్ డెస్క్: సండే వచ్చిందంటే చాలు చికెన్, మటన్ షాపులు కిక్కిరిసిపోతాయి. మాంసాహార ప్రియులకు ఆదివారం రోజు ముక్క లేనిదే ముద్ద దిగదు. అయితే స్విగ్రీ, జోమాటో వంటి ఆన్‌లైన్ ప్లాట్ ఫామ్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆదివారం, సోమవారం అనే లేకుండా ప్రతిరోజూ బిర్యానీలు లాగించేస్తున్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో 24 గంటలపాటూ బిర్యానీ ఒక్క క్లిక్‌తో ఇంటి ముందుకి వచ్చి చేరడంతో మాంసాహార ప్రియులు తెగ తినేస్తున్నారు. పార్టీలు, శుభకార్యాల్లోనూ నాన్ వెజ్‌నే అంతా వండి పెడుతున్నారు. అయితే మాంసాహారంలో లివర్‌ని చాలా మంది ఇష్టపడుతుంటారు. మటన్ లివర్‌ని ఫ్రై వంటివి చేసుకుని తెగ తినేస్తుంటారు. అయితే మటన్ లివర్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, అనారోగ్యాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


ఇన్ని ప్రయోజనాలా..

మటన్ లివర్‍లో ఆరోగ్యాన్ని ఇచ్చే అనేక ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీతన నివారించి, శరీర భాగాలకు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ఎంతోగానో ఉపయోగపడుతుంది. రక్తహీనతతో బాధపడుతున్న వారు దీన్ని అధికంగా తినాలని వైద్యులు చెబుతున్నారు. మటన్ లివర్‌లో ఉండే విటమిన్-ఎ కళ్లు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీన్ని తరచూ తినే వారికి కళ్ల సమస్యలు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు. మటన్ లివర్‌లో శరీరానికి ఉపయోగపడే జింక్, కాపర్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎంజైమ్‌ల పనితీరు మెరుగుపరిచి, వివిధ రసాయన ప్రక్రియలను సమతుల్యం చేసేందుకు దోహదపడతాయి. దీంట్లో విటమిన్ బి-12 సైతం పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు నరాల బలహీనత వంటి సమస్య నుంచి బయటపడేస్తుంది. అలాగే నరాల ఆరోగ్యాన్ని సైతం కాపాడుతుంది.


వీరికి అలర్ట్..

కండరాల పెరుగుదలకు మటన్ లివర్‌లోని ప్రోటీన్ ఎంతగానో దోహదపడుతుంది. కండరాల పెరుగుదల, మరమ్మతుకు తోడ్పడుతుంది. దీంట్లో కొలెస్ట్రాల్ స్థాయి అధికంగా ఉంటుంది. అందుకే కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారు మటన్ లివర్ తక్కువ మోతాదులో తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. మూత్రపిండాల సమస్యలు ఉంటే వైద్యుల సలహా మేరకే మటన్ లివర్ తినాల్సి ఉంటుంది. అలాగే పాలిచ్చే తల్లులు, గర్భవతులు సైతం డాక్టర్ల సలహా తీసుకుని మాత్రమే తినాలి. మటన్ లివర్‌లో ఎన్ని పోషకాలు ఉన్నప్పటికీ మితంగా తినాలని డైటీషియన్లు చెబుతున్నారు.

Updated Date - Dec 29 , 2024 | 07:22 AM