Share News

గెలుపు గ్యారెంటీ ఎవరికో!?

ABN , Publish Date - May 03 , 2024 | 05:37 AM

తెలంగాణ ఉద్యమ సాధనలో ముందుండి గర్జించిన జిల్లా ఇది. ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కేసీఆర్‌ హ్యాట్రిక్‌ విజయాల నియోజకవర్గమిది. కాంగ్రెస్‌ అభ్యర్థిని అత్యధికంగా ఏడుసార్లు.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని నాలుగుసార్లు.. బీజేపీ అభ్యర్థిని మూడుసార్లు పార్లమెంటుకు పంపింది! గత మూడు ఎన్నికల్లో ఒక్కోసారి ఒక్కొక్కరిని గెలిపిస్తున్న నియోజకవర్గం కూడా!

గెలుపు గ్యారెంటీ ఎవరికో!?

మోదీ గ్యారెంటీతో సంజయ్‌ ముందుకు

సొంత గ్యారెంటీలూ ప్రకటించిన వెలిచాల

హ్యాట్రిక్‌ కొట్టిన పార్టీ గ్యారెంటీతో వినోద్‌

కరీంనగర్‌లో ముక్కోణం

ఒకరిది మోదీ గ్యారెంటీ! మరొకరిది సొంత గ్యారెంటీ! ఇంకొకరిది పార్టీ గ్యారెంటీ! గతంలో కేసీఆర్‌కు హ్యాట్రిక్‌ ఇచ్చిన జిల్లాలో వరుసగా రెండోసారి గెలవాలని ఒకరు! తొలిసారి గెలిచి పార్లమెంటులో అధ్యక్షా..! అనాలని మరొకరు! గత ఎన్నికల్లో పరాజయానికి ప్రతీకారం తీర్చుకుని మరోసారి లోక్‌సభలో అడుగు పెట్టాలని ఇంకొకరు! వెరసి, కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ప్రధాన పార్టీల మధ్య ముక్కోణపు పోరులో ఓటర్ల గ్యారెంటీ ఎవరికో!?

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌, హైదరాబాద్‌)

తెలంగాణ ఉద్యమ సాధనలో ముందుండి గర్జించిన జిల్లా ఇది. ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కేసీఆర్‌ హ్యాట్రిక్‌ విజయాల నియోజకవర్గమిది. కాంగ్రెస్‌ అభ్యర్థిని అత్యధికంగా ఏడుసార్లు.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని నాలుగుసార్లు.. బీజేపీ అభ్యర్థిని మూడుసార్లు పార్లమెంటుకు పంపింది! గత మూడు ఎన్నికల్లో ఒక్కోసారి ఒక్కొక్కరిని గెలిపిస్తున్న నియోజకవర్గం కూడా! అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు, సీట్లు రాకపోయినా.. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కమలం పార్టీని గెలిపిస్తోంది! అంతేనా.. అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సెగ్మెంట్లలో కలిపి బీఆర్‌ఎ్‌సకు 5,249 ఓట్లు ఎక్కువగా వచ్చినా.. ఏడింట నాలుగు సీట్లను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. అందుకే, ఈసారి కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో పోటీ రసవత్తరంగా మారింది. సిటింగ్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ బీజేపీ నుంచి మరోసారి పోటీలో ఉండగా.. గతంలో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఓడిపోయిన వెలిచాల రాజేందర్‌ రావు కాంగ్రెస్‌ నుంచి బరిలో ఉన్నారు. వరుసగా గత మూడు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి ఒకసారి విజయం సాధించిన బోయినపల్లి వినోద్‌కుమార్‌ మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు.


గెలిస్తే.. కేంద్ర మంత్రి పదవి!

రాష్ట్రంలో డబుల్‌ డిజిట్‌ స్థానాలను సాధించి దక్షిణాదిలో పట్టు బిగించాలని చూస్తున్న బీజేపీ కరీంనగర్‌ స్థానంలో విజయంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. రెండోసారి గెలిస్తే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిలో హోదాలో ఉన్న తనకు కేంద్ర మంత్రి పదవి దక్కుతుందన్న భావనతో ఇక్కడ గెలుపును సంజయ్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. మోదీ గ్యారెంటీ పేరుతో బీజేపీ విడుదల చేసిన మ్యానిఫెస్టోతో.. అన్ని సెగ్మెంట్లలో రెండేసిసార్లు ప్రచారం పూర్తి చేశారు. పోలింగ్‌ బూత్‌ స్థాయిలో, శక్తి కేంద్రాల స్థాయిలో కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు నిర్వహించి ఓటర్‌ లిస్టులోని ఒక్కో పేజీకి ఒక్కో కమిటీ వేసి పన్నా కమిటీల పేరిట వారికి బాధ్యతలు అప్పగించి ఓటరును నిత్యం కలిసే ఏర్పాట్లు చేసుకున్నారు. తన హయాంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా వివిధ పథకాలకు మంజూరైన నిధులెన్ని!? పనులేవి!? అన్న వివరాల బుక్‌లెట్లను ఇంటింటికీ అందించడమే కాకుండా గ్రామాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రధాని మోదీ సభలో ప్రసంగించి వెళ్లగా.. త్వరలో హోం మంత్రి షా వస్తారని చెబుతున్నారు. నిజానికి, అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు, సీట్లు రాకపోయినా లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ జాతీయ స్థాయి అంశాలే ప్రభావం చూపుతుండడం.. ఇదే కారణంతో గతంలో మూడుసార్లు పార్టీ విజయం సాధించడం.. ఇప్పుడు మోదీ గ్యారెంటీతో ముందుకు పోతుండడంతో సంజయ్‌ గెలుపుపై ఆశలు పెంచుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సెగ్మెంట్లలో కలిపి లక్ష ఓట్లు మాత్రమే సాధించినా.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 90 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గడం, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి కూడా కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఐదేళ్లలో పార్టీ ప్రాబల్యం మరింత పెరిగిందని, అసెంబ్లీ ఎన్నికల్లో 2.5 లక్షల ఓట్లు రావడమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు.


సొంత గ్యారెంటీలతో ‘వెలిచాల విజన్‌’

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతోపాటు ‘కోహినూర్‌ కరీంనగర్‌’ పేరిట రాజేందర్‌రావు ‘వెలిచాల విజన్‌’ పేరుతో 23 సొంత గ్యారెంటీలను విడుదల చేశారు. సమస్యల పరిష్కారానికి ‘కరీంనగర్‌ సహాయక్‌ యాప్‌’, విద్యార్థులకు పోటీ పరీక్షలకు శిక్షణ, మెగా జాబ్‌ క్యాంప్స్‌, ఉచిత ఆరోగ్య పరీక్షలు, సామూహిక వివాహాలు, ఉచిత డ్రైవింగ్‌ స్కూల్స్‌ వంటి 23 గ్యారెంటీలు ప్రకటించారు. సెగ్మెంట్‌కు ఉచితంగా జేసీబీ, ట్రాక్టర్‌, పంట కోత యంత్రాలు, రెండు డ్రోన్లు, ట్యాంకర్‌, రోడ్డు రోలర్‌ ఇస్తానన్నారు. తన అభ్యర్థిత్వం చివరి నిమిషంలో ఖరారైనా.. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునే రీతిలో మంత్రి పొన్నం వ్యూహం మేరకు అవిశ్రాంతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌లో ప్రముఖ ప్రజా ప్రతినిధిగా పేరుగాంచిన జగపతిరావు కుమారుడే రాజేందర్‌రావు. జగపతిరావు 1972లో జగిత్యాలలో, 1989లో కరీంనగర్‌ నుంచి గెలిచి అనేక సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచారు. తండ్రి పేరు, పార్టీ, సొంత గ్యారెంటీలు గెలిపిస్తాయని రాజేందర్‌రావు ఆశలు పెట్టుకున్నారు.


Untitled-5.jpg


Untitled-4.jpg

Updated Date - May 03 , 2024 | 05:44 AM