Share News

Weekend Comment by RK : గెలుపు అంచనాల్లో గజిబిజి

ABN , Publish Date - May 26 , 2024 | 03:53 AM

‘తినబోతూ రుచులెందుకు అడుగుతారు’ అని అంటారు! ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పోలింగ్‌ ముగిసిన తర్వాత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆంధ్రా ఓటర్లు తమ తీర్పు ఇచ్చేశారు. అందలం ఎక్కించాలనుకున్న...

Weekend Comment by RK : గెలుపు అంచనాల్లో గజిబిజి

‘తినబోతూ రుచులెందుకు అడుగుతారు’ అని అంటారు! ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పోలింగ్‌ ముగిసిన తర్వాత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆంధ్రా ఓటర్లు తమ తీర్పు ఇచ్చేశారు. అందలం ఎక్కించాలనుకున్న వారికి ఓటు వేసేశారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తమ కుటుంబ సభ్యులతో కలసి సేదదీరడానికి విదేశాలకు వెళ్లారు. వారిద్దరి మద్దతుదారులలో కొందరు మాత్రం ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతున్నదీ తెలియకపోయినా... అది ఉప్పగా ఉంటుందీ, చప్పగా ఉంటుందీ అని తేల్చి పారేస్తున్నారు. ఈ విషయంలో జగన్‌ అనుకూలురు మితిమీరిన ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. ప్రజలందరూ మళ్లీ జగన్‌కే పట్టం కట్టారని తేల్చేస్తున్నారు. సోషల్‌ మీడియా పుణ్యమా అని ఎవరెవరో అంచనాల పేరిట ప్రజల తీర్పు ఫలానా విధంగా ఉండబోతోందని తమ అభిప్రాయాలను జనంలోకి వదులుతున్నారు. తమకు తోచిన రీతిలో లెక్కలు కట్టి చెబుతున్నారు. ఈ విషయంలో కూలి మీడియా ఉత్సాహానికి అంతు లేకుండా ఉంది. సీనియర్‌ జర్నలిస్టుల పేరిట ఎగ్జిట్‌ పోల్స్‌ను జనంలోకి వదులుతున్నారు.

మరో పది రోజుల్లో ఓట్ల లెక్కింపు జరగనుండగా అంచనాల పేరిట ఆత్మవంచన చేసుకుంటున్నారు. జగన్మోహన్‌ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలనుకొనేవారు అందుకు అనుగుణంగా లెక్కలు కడుతుండగా, చంద్రబాబును అందలం ఎక్కించాలనుకుంటున్న వారు ప్రజల నాడి ఆయనకే అనుకూలం అని లెక్కలు కడుతున్నారు. అనుభవం ఉన్న సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు సైతం అనేక సందర్భాలలో లెక్క తప్పాయి. అయినా, కనీస అవగాహన లేనివారు, జనం నాడి తెలియనివారు కూడా అంచనాలు రూపొందించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న చంద్రబాబు, జగన్మోహన్‌ రెడ్డికి లేని టెన్షన్‌ను ఈ తరహా ‘ఎర్నలిస్టులు’ ప్రదర్శిస్తుండడం విశేషం. ప్రధాన మీడియాలో కొంత కాలం పనిచేసిన వారితోపాటు ఉద్యోగం కోల్పోయినవారు చేస్తున్న హడావిడి గురించి చెప్పాల్సిన పనే లేదు.


తెలంగాణలోనూ అదే వరస

తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిగినప్పుడు కూడా కొంతమంది ఇలాగే అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయా పార్టీలు తమ అనుకూల వ్యక్తులను, యూట్యూబ్‌ చానల్స్‌ను ప్రోత్సహించి తమకు అనుకూలంగా తీర్పులు చెప్పించుకున్నాయి. అయితే, ఈ అంచనాలతో సంబంధం లేకుండా ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టారు. సాధారణ ఎన్నికల సందర్భంగా ప్రజలు తాము ఎటువంటి తీర్పు ఇవ్వాలో ముందుగానే నిర్ణయించుకుంటారు. రాజకీయ పార్టీలు స్పాన్సర్‌ చేస్తున్న చానళ్ల అభిప్రాయాలు వారిని ప్రభావితం చేయలేవు. ఈ విషయం అనేక సందర్భాలలో రుజువైంది. అయినా రాజకీయ పార్టీలు మాత్రం సోషల్‌ మీడియా సైన్యం పేరిట ప్రజల మెదళ్లను విషతుల్యం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. అందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ప్రజల వివేకాన్ని, విజ్ఞతను తక్కువ అంచనా వేయడం వల్లనే ఆయా పార్టీలు సోషల్‌ మీడియా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని అర్ధసత్యాలను, అసత్యాలను జనంలోకి వదులుతున్నాయి. ఈ విషయంలో ఫలానా పార్టీ ముందుంది, ఫలానా పార్టీ వెనుకబడిందన్న విశ్లేషణలు కూడా వస్తుంటాయి. ప్రభుత్వ పనితీరుతో సంబంధం లేకుండా సోషల్‌ మీడియా సైన్యం మాత్రమే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయజాలదు. అనేక ఎన్నికల్లో ఈ విషయం రుజువైంది. తెలంగాణలో కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రధాన మీడియాలో ఒకరిద్దరు మినహా మిగతా అందరినీ లొంగదీసుకొని తమకు అనుకూలంగా ప్రచారం చేయించుకున్నారు. అయినా ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌ అహంకారాన్ని తిరస్కరించారు. ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో, ఎవరు మసిబూసి మారేడుకాయ చేసే పనిలో ఉన్నారో ప్రజలకు ఇట్టే తెలిసిపోతుంది. రాజకీయ పార్టీలతో సంబంధం లేని వ్యక్తులు సైతం సోషల్‌ మీడియా వేదికగా పలు సందర్భాలలో వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకువెళుతున్నారు. దీంతో రాజకీయ పార్టీలు స్పాన్సర్‌ చేస్తున్న యూట్యూబ్‌ చానల్స్‌ విశ్వసనీయత దెబ్బతింటోంది. ఏ చానల్‌ ఎవరికి అనుకూలమో నిర్ధారణకు వస్తున్న ప్రజలు అవి చెప్పే విషయాలను నమ్మడం మానేశారు. వ్యూస్‌ పెంచుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలను సైతం ప్రజలు తెలుసుకుంటున్నారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే ఆయా యూట్యూబ్‌ చానల్స్‌ లేదా విశ్లేషకులకు వ్యూస్‌ వస్తూ ఉంటాయి. తటస్థుల ముసుగులో కొంత మంది కొన్ని పార్టీలకు అనుకూలంగా చేస్తున్న ప్రచారాన్ని సైతం ప్రజలు గుర్తిస్తున్నారు. దీంతో ముసుగులు తొలగిపోతున్నాయి.


మారిన దృశ్యాలు...

తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న ‘కేసీఆర్‌ అండ్‌ కో’కు అనుకూలంగా సోషల్‌ మీడియాలో ఎవరు ప్రచారం చేసినా వ్యూస్‌ తక్కువగా వచ్చాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే పోస్టులకు, వీడియోలకు వ్యూస్‌ ఎక్కువగా వచ్చేవి. ఈ విషయం గమనిస్తే ప్రజల తీర్పు ఎలా ఉండబోతున్నదో చెప్పవచ్చు. తుది ఫలితాలు కూడా అందుకు అనుగుణంగానే వచ్చాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ విషయంలో కూడా సోషల్‌ మీడియా వ్యూస్‌ను బట్టి ప్రజల నాడి ఎలా ఉండబోతున్నదో చెప్పవచ్చు. ఐదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌ రెడ్డికి అనుకూలంగా ఉండే వార్తలు, కథనాలకు రెండేళ్ల క్రితం వరకు వ్యూస్‌ అధికంగా ఉండేవి. రాను రానూ అవి తగ్గిపోవడం మొదలైంది. ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయం చెప్పడానికి ప్రజలు భయపడవచ్చుగానీ సోషల్‌ మీడియా వీక్షకులు భయపడరు కదా! నిర్బంధాలు ఉన్నప్పుడు ప్రజలు స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పలేరు. అందుకే తెలంగాణలో కూడా ఎగ్జిట్‌ పోల్స్‌ లెక్క తప్పాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలై నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే తెలంగాణ ప్రజలు తమ అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించడం మొదలుపెట్టారు. దీంతో అప్పటివరకు అంతా పచ్చగా కనిపించిన అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, నాయకులకు తత్వం బోధపడింది. తెలంగాణను మించిన నిర్బంధం ఆంధ్రప్రదేశ్‌లో అమలులో ఉంది. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు పోలింగ్‌కు వారం రోజుల ముందు వరకు గుంభనంగా ఉన్నారు. 2019 ఎన్నికల సందర్భంగా ప్రజలు బయటపడ్డారు. ఇప్పటి పరిస్థితి వేరు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై దాడులు చేశారు. కేసులు పెట్టి వేధించారు. ఈ కారణంగా ప్రజలు మౌనాన్ని ఆశ్రయించారు. ఉదాహరణకు, ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి లొంగిపోయినా ఉద్యోగులు మాత్రం ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా పోస్టల్‌ బ్యాలెట్‌లో భారీగా పోలింగ్‌ జరిగింది. 2019 ఎన్నికల్లో 2.60 లక్షల ఓట్లు పడగా ఇప్పుడు ఐదు లక్షలకు పైగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు నమోదయ్యాయి. అంటే, సగటున ఒక నియోజకవర్గంలో మూడు వేల ఓట్ల వరకు నమోదయ్యాయి.

ఇదొక రికార్డు మాత్రమే కాదు... ఉద్యోగుల మనోభావాలకు సంకేతం. రిటైర్డ్‌ ఉద్యోగులు దీనికి అదనం! 2004కు ముందు ప్రజల వద్దకు పాలన, ఆకస్మిక తనిఖీల పేరిట అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమను వేధిస్తున్నారన్న అభిప్రాయం ఉద్యోగుల్లో ఉండింది. దీంతో అప్పుడు ఉద్యోగులు అందరూ చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు. పోలింగ్‌ సందర్భంగా కూడా వృద్ధులు, దివ్యాంగుల ఓట్లు కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా వేయించారు. మళ్లీ ఇంత కాలానికి ఆంధ్రప్రదేశ్‌లో 20 ఏళ్ల నాటి పరిస్థితి పునరావృతమైంది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పడానికి ఇదొక సంకేతం. 2004లో చంద్రబాబును తాము ఓడించామని ఎన్నికల ఫలితాల అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించుకున్నారు కూడా! ఉద్యోగులు ఆకాశం నుంచి ఊడిపడరు. వారూ సమాజంలో భాగమే. ప్రభుత్వంపై ప్రజల్లో ఉండే అభిప్రాయానికి ప్రతిబింబంగా ఉద్యోగులను పరిగణించవచ్చు.


మౌనంగా బాబు... జగన్‌ డాబు

ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలిసినప్పటికీ ఓట్ల లెక్కింపు జరిగే వరకు రాజకీయ పార్టీలు తామే గెలుస్తామని బుకాయించడం సహజం. 2019 ఎన్నికల్లో తాను మళ్లీ అధికారంలోకి వస్తున్నానని ప్రకటించి బోల్తా కొట్టిన చంద్రబాబు ఈ పర్యాయం మాత్రం ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పలేదు. మౌనంగా ఉండిపోయారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేయాలి? ఎలా చేయాలి? అని తన పేషీలోకి ఏయే అధికారులను తీసుకోవాలి అనే అంశాలపై ఆయన దృష్టి కేంద్రీకరించినట్టు చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మాత్రం లండన్‌ పర్యటనకు వెళ్లే ముందు తన సోషల్‌ మీడియా సైన్యాన్ని ఉద్దేశించి దేశమే నివ్వెరపోయే విధంగా ఈ ఎన్నికల్లో తమకు మెజారిటీ వస్తుందని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో లభించిన మెజారిటీ కంటే అధిక సీట్లు వస్తాయని ఆయన చెప్పారు. ఇందులో వాస్తవం ఎంతుందో జూన్‌ 4వ తేదీన తేలిపోతుంది. పోలింగ్‌ సరళిపై వ్యాఖ్యానించకుండా చంద్రబాబు మౌనంగా ఉండటాన్ని కూడా జగన్‌ అనుకూల మీడియా వ్యక్తులు వాడుకొని తమను తాము మభ్యపెట్టుకుంటూ, వైసీపీ అభిమానులను కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 2019లో జగన్మోహన్‌ రెడ్డి చెప్పినట్టుగానే భారీ మెజారిటీతో గెలిచారు, ఇప్పుడు కూడా అదే జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఇటువంటి ప్రచారం వల్ల ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న ప్రజా తీర్పు మారదు. కాకపోతే ఓట్ల లెక్కింపు వరకు మానసికంగా తృప్తి పొందుతారు. తమకు ఇచ్చిన టాస్క్‌ పూర్తి చేసినందుకు ఆయా చానళ్లకు గిట్టుబాటు కలగవచ్చు. అబద్ధాలకు ప్రజలు తొందరగా ప్రభావితం అవుతారు. 2019కి ముందు, తర్వాత కూడా అసత్య ప్రచారాన్నే నమ్ముకున్న జగన్‌ అండ్‌ కో ఇప్పుడు ఎన్నికల ఫలితాల జోస్యంపై కూడా అసత్యాలనే జనంలోకి వదులుతున్నారు. ప్రజలను భావోద్వేగాలకు గురిచేయడం అనేది రాజకీయ పార్టీలు అనుసరించే ఒక ఎత్తుగడ. భావోద్వేగాలతో కూడిన ప్రచారాలకు ప్రజలు అధికంగా ఆకర్షితులవుతారు. భయం లేదా దేశభక్తి వంటి అంశాలు మన నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. ఈ తరహా ప్రచారాన్ని ప్రశ్నించకుండా నమ్మడానికి ఇష్టపడతాం. ఉదాహరణకు 2019కి ముందు అమరావతి అనేది కమ్మ కులం వారికి మాత్రమే పరిమితం అని ప్రచారం చేసి ప్రజలను నమ్మించారు. తర్వాత వారిలో కోపాన్ని పెంచి అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసం చేసి సదరు ప్రచారాన్ని నమ్మిన వారిని సంతోషపెట్టారు. ‘వై నాట్‌ 175’ అని జగన్‌రెడ్డి చెబుతున్న మాటలను నమ్ముతున్న వారు కూడా జనంలో ఉన్నారు. మొత్తం 175 స్థానాలూ గెలుచుకోవడం ఎలా సాధ్యం? అన్న తర్కంలోకి వారు వెళ్లరు.

విమర్శనాత్మక ఆలోచనా ధోరణి కోల్పోవడం వల్ల ఈ తరహా ప్రచారాలను నమ్ముతారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో... స్వాతంత్య్రం సాధించామని చెప్పుకొన్న కాంగ్రెస్‌ పార్టీకి 50 శాతం ఓట్లు కూడా రాలేదు. ప్రాణాలు ఫణంగా పెట్టి తెలంగాణ సాధించానని చెప్పుకొనే కేసీఆర్‌కు కూడా 2014 ఎన్నికల్లో బొటాబొటి మెజారిటీ మాత్రమే లభించింది. ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో మాత్రమే రాజీవ్‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీకి 50 శాతానికి పైగా ఓట్లు లభించాయి. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌రెడ్డి ఆశ్రిత పక్షపాతం, భావోద్వేగాలు ప్రేరేపించడం, విమర్శనాత్మక ఆలోచనా ధోరణిని నశింపజేయడం, వ్యవస్థల పట్ల విశ్వాసం కోల్పోయేలా చేయడం, అసత్యాలను పదే పదే ప్రచారం చేయడం, అందుకోసం సమాజంలో అంతో ఇంతో విశ్వసనీయత ఉన్న వ్యక్తులను వాడుకోవడం వంటి టెక్నిక్‌లు ప్రయోగించి 50 శాతానికి పైగా ఓట్లు గెలుచుకున్నారు.


ఇదీ సీపీఎం సంగతి...

అప్పుడుగానీ, ఇప్పుడుగానీ సీపీఎం వంటి పార్టీలతో ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తులు జగన్‌కు ఉపయోగపడటం విశేషం. తెలుగునాట ఒకప్పుడు ఉభయ కమ్యూనిస్టు పార్టీలలో సీపీఎంకే అధిక విశ్వసనీయత ఉండేది. ఇప్పుడు తెలుగు రాష్ర్టాలలో సీపీఎం ఉనికి కోసం వెదుక్కొనే పరిస్థితి. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న విషయంలో కూడా సీపీఎంతో సంబంధాలు ఉన్నవారు జగన్‌రెడ్డికి అనుకూలంగా విశ్లేషణలు వదులుతున్నారు. అయితే, గత కొంత కాలంగా ఇలాంటి వారి విశ్లేషణలకు వ్యూస్‌ తగ్గిపోవడం గమనార్హం. మేధావులు, తటస్థుల ముసుగులో ఏం చెప్పినా జనం నమ్ముతారని అనుకోవడం అవివేకం. ఒక అంశంపై అనేక కోణాల్లో విశ్లేషణ చేయవచ్చు. అయితే క్షేత్రస్థాయి పరిస్థితులకు విరుద్ధంగా విశ్లేషణలు ఉంటే ప్రజల తిరస్కరణకు గురవుతారు. ఉదాహరణకు, ఉద్యోగులు భారీ సంఖ్యలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌లో పాల్గొనడం కూడా జగన్‌కు అనుకూలమే అని ఎవరైనా చెప్పారనుకోండి అంతకంటే బూతు ఉండదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. కుప్పంలో చంద్రబాబు, పులివెందులలో జగన్‌రెడ్డి ఓడిపోతారని చెప్పడం హాస్యాస్పదమే. అయినా రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి అలా చెప్పుకొంటాయి. విశ్లేషకులుగా చెలామణి అవుతున్నవారు కూడా అవే మాటలను వల్లె వేయడమే వింతగా ఉంది. సోషల్‌ మీడియాలో జగన్మోహన్‌ రెడ్డికి అనుకూలంగా విశ్లేషణలు, వ్యాఖ్యలు చేస్తున్నవారు ఎన్నికల ఫలితాలు ఆయనకు వ్యతిరేకంగా వస్తే ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? రాజకీయ విశ్లేషణలు చేసే సమయంలో ఏదైనా సాధ్యమే అనే మౌలిక సూత్రాన్ని విస్మరించకూడదని జర్నలిజంలో బోధిస్తారు. చంద్రబాబు లేదా జగన్‌ గెలిచిపోయినట్టేనని చెప్పడం జర్నలిజం ప్రమాణాలకు అనుగుణంగా చేసే విశ్లేషణ కాబోదు. అలా జరిగితే జగన్‌ గెలవొచ్చు, ఇలా జరిగితే చంద్రబాబు గెలిచే అవకాశం ఉందని చెప్పడం వేరు. నాయకులకు అనుకూలంగా మాత్రమే విశ్లేషణలు చెప్పడం వేరు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌రెడ్డి ప్రభావితం చేసిన మీడియా సంస్థలు, యూట్యూబ్‌ చానళ్లు ఏవో ప్రజలకు తెలిసిపోయింది. మొత్తంగా చెప్పాలంటే తెలుగునాట మీడియాకు విశ్వసనీయత తగ్గిపోయింది. ఫలానా మీడియా ఫలానా పార్టీకి వ్యతిరేకం లేదా అనుకూలం అని చిన్న పిల్లలు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికగా వెల్లడవుతున్న విశ్లేషణలు, అంచనాలకు విలువ లేకుండా పోయింది.

విచిత్రం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్‌లో ఏమి జరగబోతున్నదో ప్రశాంత్‌ కిశోర్‌ వంటి ఉత్తరాది వాళ్లు చెప్పే మాటలకు అధిక విశ్వసనీయత ఉండటం విడ్డూరం. ప్రజల నాడి పసిగట్టలేని జర్నలిస్టులు, విశ్లేషకులు తెలుగునాట ఉన్నారనే కదా దీని అర్థం! మన ప్రజల ఆలోచనా ధోరణిని పసిగట్టలేక పోవడమంటే మన మెదళ్లు పక్షపాతంతో నిండిపోయినట్టే కదా? పోలింగ్‌ శాతం పెరిగిందంటే అధికార పార్టీకి వ్యతిరేకం లేదా అనుకూలం అని నిర్ధారించలేం. ప్రధాన పార్టీల మధ్య పోటా పోటీ పరిస్థితి ఉన్నప్పుడు కూడా పోలింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. 2019 ఎన్నికల సమయంలో ‘పసుపు కుంకుమ’ కింద మహిళలకు 10 వేల రూపాయల వంతున పంచిపెట్టినంత మాత్రాన మహిళలు చంద్రబాబును ఆదరించలేదే? ఇప్పుడు కూడా పథకాల పేరిట డబ్బు పంచినంత మాత్రాన ప్రజలు, ముఖ్యంగా మహిళలు జగన్‌కే ఓటు వేశారనడం కూడా తర్కానికి నిలబడదు. సాధారణ ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేసేది ఫీల్‌ గుడ్‌ ఫ్యాక్టర్‌ మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఫీల్‌ గుడ్‌ ఫ్యాక్టర్‌ ఉందా? లేదా? అన్నదాన్ని బట్టే ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయి. ఈలోపు, అంటే జూన్‌ 4వ తేదీ వరకు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమవుతున్న విశ్లేషణలు, వ్యాఖ్యలు ఆయా వ్యక్తుల మనోవాంఛ మాత్రమే.


చివరగా... ఒక మాట!

బుద్ధ పౌర్ణమి సందర్భంగా మిత్రుడు డీఆర్కే సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టు మాత్రం ఆలోచింపజేసేదిగా ఉంది. గౌతమ బుద్ధుని కాలంలో అంగుళీమాలుడు అనే దుర్మార్గుడు ఉండేవాడు. అతడు ప్రజల వేళ్లు నరికి మెడలో దండగా వేసుకొని తిరిగేవాడు. ఒకరోజు ఆ అంగుళీమాలుడికి బుద్ధుడు ఎదురుకాగా, ‘నిన్ను ఈ కత్తితో నరకబోతున్నాను. నీ చివరి కోరిక ఏమిటో కోరుకో’ అని అన్నాడు. అయితే, నీ కత్తితో ఆ చెట్టు కొమ్మను నరుకు అని బుద్ధుడు ఆ దొంగకు చెబుతాడు. వెంటనే అంగుళీమాలుడు తన కత్తితో చెట్టు కొమ్మను నరికాడు. ఇప్పుడు ఆ కొమ్మను తిరిగి చెట్టుకు అతికించు అని బుద్ధుడు అడిగాడు. దీనికి ఆ దొంగ నవ్వి ‘అదెలా సాధ్యం? ఎవరూ ఆ పని చేయలేరు’ అని అన్నాడు. ‘దీంతో నువ్వు బలవంతుడివి కాబట్టి దేన్నయినా నరకగలవు, నాశనం చేయగలవు. నిజానికి అది అల్పులు చేసే పని. శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి దేన్నయినా సృష్టించగలగాలి. బాధపెట్టడం కాదు–ఉపశమనం కలిగించేవాడే గొప్పవాడు. నిర్మూలన కంటే సృజనే గొప్పది’ అని ఆ దొంగకు బుద్ధుడు బోధించాడు. ‘ప్రజా వేదిక’ కూల్చివేతతో వేట ప్రారంభించి, తన పర్యటనల సందర్భంగా అనేక చెట్లు నరికించిన ఆధునిక అంగుళీమాలుడైన జగన్‌కు తన పోస్టు అంకితమని డీఆర్కే పేర్కొనడం విశేషం. ఆధునిక అంగుళీమాలుడిగా పేరు తెచ్చుకున్న జగన్‌ మళ్లీ అధికారంలోకి రావాలని, వస్తారని ఊదరగొడుతున్నవాళ్లు జూన్‌ 4వ తేదీ ఫలితాలు అందుకు విరుద్ధంగా వస్తే ఎలా ఉంటారో? వారి పరిస్థితి ఏమిటో? అందుకే, తినబోతూ రుచులు అడగకూడదు!

ఆర్కే

Updated Date - May 26 , 2024 | 06:24 AM