Share News

Gold Prices: బంగారం లాంటి అవకాశం.. అస్సలు మిస్ కావొద్దు!

ABN , Publish Date - Apr 25 , 2024 | 02:41 PM

విశ్వవ్యాప్తంగా పసిడికి ఎనలేని ఆదరణ ఉంది. ఇందుకు భారత్ మినహాయింపేమీ కాదు. భారతీయులు బంగారాన్ని అమితంగా ఇష్టపడుతుంటారు. నగలు, ఆభరణాల కోసమే కాకుండా పెట్టుబడి సాధనంగానూ పరిగణిస్తుంటారు. దేశంలో పురాతన కాలం నుంచి నేటి వరకు ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని తేడా లేకుండా దేశవ్యాప్తంగా ప్రజలు తమ స్థోమతకు తగ్గట్టు బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు.

Gold Prices: బంగారం లాంటి అవకాశం.. అస్సలు మిస్ కావొద్దు!

విశ్వవ్యాప్తంగా పసిడికి ఎనలేని ఆదరణ ఉంది. ఇందుకు భారత్ మినహాయింపేమీ కాదు. భారతీయులు బంగారాన్ని అమితంగా ఇష్టపడుతుంటారు. నగలు, ఆభరణాల కోసమే కాకుండా పెట్టుబడి సాధనంగానూ పరిగణిస్తుంటారు. దేశంలో పురాతన కాలం నుంచి నేటి వరకు ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని తేడా లేకుండా దేశవ్యాప్తంగా ప్రజలు తమ స్థోమతకు తగ్గట్టు బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. ప్రపంచంలో బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుండడమే ఇందుకు నిదర్శనంగా ఉంది.


2021 తర్వాత మారిన పరిస్థితుల ప్రభావంతో గత రెండేళ్ల నుంచి పుత్తడి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. అంచనాలకు అందని రీతిలో తులం బంగారం ధర రూ.50 వేలు స్థాయి నుంచి నేడు రూ.72 వేలు పైచిలుకు పలుకుతోంది. ఏప్రిల్ 19న ఆల్ టైమ్ హై రూ.74,340 పలికిన 10 గ్రాముల బంగారం ధర ఈ మధ్య 5 రోజుల వ్యవధిలోనే 3 శాతం మేర పతనమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో రూ.72 వేలు పైచిలులకు పలుకుతోంది. ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో పసిడి పెట్టుబడులకు ఇదే సరైన సమయమా?. పసిడి కొనుగోలుకు ఇది బంగారం లాంటి అవకాశమా?. ఇంకొంత కాలం వేచిచూడడం మంచిదా? అనే సందేహాలు మదుపర్లలో నెలకొన్నాయి.


అయితే ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఊహించని స్థాయిలో లేకపోవడం, జూన్-జూలై సమీక్షలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు ఇంత ఆకస్మికంగా బంగారం ధరలు తగ్గడానికి కారణమవుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే సమీప భవిష్యత్తులో గోల్డ్ రేటు రూ.70 వేల మార్క్‌కు దిగువకు పడిపోయే అవకాశం కనిపించడంలేదని అభిప్రాయపడుతున్నారు. మధ్యప్రాచ్య దేశాల్లో ఉద్రిక్తతలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న పరిస్థితుల్లో ధరలు పెరిగేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధరలు భారీగా పెరగవచ్చునని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ ‘గోల్డ్‌మన్ శాక్స్’ ఇటీవల తన రిపోర్టులో అంచనా వేసింది. ఏడాది చివరి నాటికి ఔన్స్ బంగారం 2700 డాలర్లకు చేరవచ్చని లెక్కగట్టింది. సుమారు 2389 ఉన్నప్పుడు అంచనా వేయగా క్రమంగా పెరుగుదల కనిపిస్తోంది.


కాబట్టి ప్రస్తుతం బంగారంపై పెట్టుబడుల విషయంలో ఆలోచించి ముందడుగు వేయడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. నిజానికి బంగారంపై పెట్టుబడి మదుపర్ల వ్యక్తిగత అవసరాలు, భవిష్యత్‌ లక్ష్యాలు, రిస్క్‌ తీసుకునే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి పెట్టుబడికి ముందే మార్కెట్‌లో ధరలు ఎలా ఉన్నాయనే దానిపై అవగాహన చాలా ముఖ్యం. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

Read Related Bussiness news and Telugu news

Updated Date - Apr 25 , 2024 | 02:55 PM