Share News

TTD: ధర్మారెడ్డిపై వైఎస్‌ జగన్‌కు ఎందుకింత ప్రేమ.. ఓహో అసలు సినిమా ఇదేనా..?

ABN , Publish Date - Mar 24 , 2024 | 04:00 PM

టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి కోసం వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి రంగంలోకి దిగిపోయారా..? డిప్యూటేషన్ పొడిగించాలని కేంద్ర మంత్రితోనే పైరవీలు చేస్తున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇదే అక్షరాలా నిజం.

TTD: ధర్మారెడ్డిపై వైఎస్‌ జగన్‌కు ఎందుకింత ప్రేమ.. ఓహో అసలు సినిమా ఇదేనా..?

టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి కోసం వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి రంగంలోకి దిగిపోయారా..? డిప్యూటేషన్ పొడిగించాలని కేంద్ర మంత్రితోనే పైరవీలు చేస్తున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇదే అక్షరాలా నిజం. ధర్మారెడ్డిపై జగన్‌కు ఎందుకింత ప్రేమ..? పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చేంటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..!

అసలేం జరిగింది..?

టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి డిప్యూటేషన్ కాలం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. దీంతో ఆయన డిప్యూటేషన్ మరికొంత కాలం పొడిగించాలంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వైఎస్ జగన్ లేఖ రాశారు. ఈ లేఖపై పొలిటికల్ సర్కిల్‌లో ఓ చర్చ వాడివేడిగా నడుస్తోంది. జగన్ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన నాటి నుంచి.. రాష్ట్రంలో ఎంతో మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నా.. వారిని కాదని.. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్‌కు చెందిన ధర్మారెడ్డిని ఏరి కోరి మరీ.. టీటీడీ ఈవోగా ధర్మారెడ్డిని నియమించారని ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు.

ఆ తర్వాత ఆయన డిప్యూటేషన్‌ను రెండేళ్ల పాటు పొడిగించారు. ఇందుకు కేంద్రంలోని పెద్దలపై జగన్ తనదైన శైలిలో ఒత్తిడి తీసుకు వచ్చారనే ఓ ప్రచారం సైతం నడిచింది. మే-14తో ఆ డిప్యూటేషన్ పుణ్య కాలం కాస్తా ముగియనుందని తెలుస్తోంది. అయితే జూన్‌లో ధర్మారెడ్డి పదవి విరమణ చేయనున్నారని.. అప్పటి వరకు ఆయన సేవలు ఏపీలోనే వినియోగించుకోనేలా అనుమతించాలంటూ రాజ్‌నాథ్ సింగ్‌కు రాసిన లేఖలో సీఎం జగన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే మే- 13న ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీతోపాటు లోక్‌సభ ఎన్నికలు సైతం జరగనున్నాయి. ఆ మరునాడే అంటే.. మే 14తో ఏపీలో ధర్మారెడ్డి డిప్యూటేషన్ కాలం ముగియనుంది.

జగన్‌కు ఇంత ప్రేమ ఎందుకో!

మరోవైపు.. ధర్మారెడ్డి వ్యవహారంలో సీఎం జగన్ ఇంతగా తాపత్రయం పడటం వెనుక ఉన్న కారణాలు ఏమై ఉంటాయనే ఓ చర్చ సైతం.. సోషల్ మీడియా, పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతోంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఓ న్యాయమూర్తి ఇంట వేడుకకు హాజరై.. కోట్ల రూపాయిలు విలువైన వాచీ ఆయనకు బహుమతిగా ఇచ్చేందుకు ప్రయత్నించారన్న వ్యవహారం పెను సంచలనమే సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు.. ఏపీలో జగన్ పాలన సులువుగా సాగేందుకు.. ఢిల్లీలో ఎప్పటికప్పుడు పనులు అవ్వడానికి కేంద్రంలోని పెద్దలతో తనకున్న పరిచయాలను ఉపయోగించి ధర్మారెడ్డి చక్రం తిప్పేవారనే టాక్ కూడా గట్టిగానే నడుస్తోంది.

దీనికి తోడు.. రాష్ట్రపతి మొదలుకుని సామాన్యుడి వరకు.. తిరుమలలో కొలువైన ఆ దేవదేవుడిని దర్శించుకొనేందుకు వస్తారు. అలా వచ్చిన వారితో పరిచయాలు పెంచుకొని.. తద్వారా పార్టీ అధినేత, ప్రభుత్వ పెద్దల పనులను చక్క బెట్టేందుకే.. ధర్మారెడ్డిని ఏరీ కోరి మరీ ఆ పదవిలో కూర్చొబెట్టారనే ఓ ప్రచారం సైతం నడుస్తోంది.

నాటి నుంచి నేటి వరకూ..!

వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సైతం ఇదే ధర్మారెడ్డిని.. టీటీడీలో కీలక పోస్ట్‌లో కూర్చోబెట్టారు. అప్పట్లో టీటీడీ చైర్మన్‌గా టి. సుబ్బిరామిరెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించకుండా... ఆయన భార్య ఇందిరా సుబ్బిరామిరెడ్డి చేత.. టీటీడీ సభ్యురాలిగా చేయించారు. దీనిపై ఆరోపణలు వెల్లువెత్తడంతో.. వైయస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ధర్మారెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆ తర్వాత ఆ సస్పెన్షన్‌ ఎత్తి వేయడంతో.. మళ్లీ ఆయన అదే పదవిలో కొనసాగడమే కాదు.. వైయస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మృతి తర్వాత సైతం ధర్మారెడ్డి.. డిప్యూటేషన్‌పై కొనసాగడం గమనార్హం.

వైఎస్సారే కాదు.. ఆయన కుమారుడు జగన్‌ సైతం ఏవీ ధర్మారెడ్డితో అలానే సంబంధాలు కొనసాగించడం చూస్తుంటే.. ధర్మారెడ్డిని వాడుకోవడంలో.. ఈ తండ్రి తనయులకు తెలిసినంతగా మరొకరికి తెలియదనే ఓ ప్రచారం సైతం రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

అంతా అ'ధర్మా'!

టీటీడీ కార్యనిర్వాహణాధికారి పదవి అంటే.. అటు దేవుడికి.. ఇటు ప్రజలకు సేవ చేసుకొనే మహాద్భాగ్యం కలిగిన ఉద్యోగం. అలాంటి పవిత్ర ఉద్యోగం కోసం.. జీవిత కాలంలో ఒకసారి అయినా దక్కాలని రాష్ట్రంలోని సీనియర్లు, సూపర్ సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆశ పడి.. కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు. అలాంటి ఎంతో మంది ఉన్నతాధికారుల ఆశలపై.. తమ పబ్బం గడుపుకొనేందుకు.. గద్దెనెక్కిన రాజకీయ నాయకులు నీళ్లు చల్లుతారనేందుకు ఇది ఒక్క అత్యుత్తమ ఉదాహరణని పొలిటికల్ సర్కిల్‌లో చర్చ నడుస్తోంది.

ఇక తిరుమల కొండపైనే కాదు.. ఆయన పాదాల చెంత, ఆయా పరిసర ప్రాంతాల్లో సైతం ధర్మో రక్షతి రక్షిత: అంటూ పెద్ద పెద్ద హోర్డింగులు 24 గంటలు వెలుగు జిలుగుల్లో దర్శన మిస్తుంటాయి. కానీ ఆ తిరుమల కొండపై కొలువు తీరిన ఆ కొనేటిరాయుడి సన్నిధానంలోనే.. ఈ విధమైన పరిణామాలు చోటు చేసుకొంటుంటే.. ఏమనాలి..? ఇంకేమనాలి అధర్మో రక్షతి రక్షిత: అనడంలో ఎలాంటి తప్పులేదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్నీ ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 24 , 2024 | 04:00 PM