Share News

AP Elections 2024: కర్నూలు ‘సిటీ’ని ఏలేదెవరు..?

ABN , Publish Date - May 09 , 2024 | 03:31 PM

వైసీపీ అభ్యర్థిగా ఎండీ ఇంతియాజ్‌ను బరిలో దింపితే.. కూటమి అభ్యర్థిగా టీజీ భరత్‌ను టీడీపీ బరిలో నిలిపింది. ఇక గత ఎన్నికల్లో కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా హాఫీజ్ ఖాన్ బరిలో నిలిచి.. గెలిచారు..

AP Elections 2024: కర్నూలు ‘సిటీ’ని ఏలేదెవరు..?

ఆంద్రప్రదేశ్‌కు (Andhra Pradesh) మూడు రాజధానులంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఆ క్రమంలో కర్నూలు న్యాయ రాజధానిగా చేస్తామని ఆయన వెల్లడించారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఒక్క అడుగు కూడా నేటికి ముందుకు పడలేదన్న విషయం అందరికీ తెలిసిందే. న్యాయ రాజధాని కోసం ఒక్క కార్యాలయ నిర్మాణానికి కనీసం ఒక్క ఇటుక రాయి కూడా పడకపోవడం గమనార్హం. మరి అలాంటి వేళ.. ఎన్నికల్లో అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను రంగంలోకి దింపాయి. వైసీపీ అభ్యర్థిగా ఎండీ ఇంతియాజ్‌ను బరిలో దింపితే.. కూటమి అభ్యర్థిగా టీజీ భరత్‌ను టీడీపీ బరిలో నిలిపింది. ఇక గత ఎన్నికల్లో కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా హాఫీజ్ ఖాన్ బరిలో నిలిచి.. గెలిచారు.


అందుకే టికెట్!

కర్నూలు నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. దీంతో మైనార్టీ వర్గం వారికే ఎమ్మెల్యే సీటు కేటాయించాలని అధికార వైసీపీ నిర్ణయించింది. ఆ క్రమంలో కర్నూలు జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి ఇంతియాజ్‌ను సీఎం వైయస్ జగన్ ఏరి కోరి మరీ ఎంపిక చేశారు. ఐఏఎస్‌ అధికారిగా ఆయనకు మంచి పేరుంది. అది కూడా ఎంతగా అంటే.. కరోనా సమయంలో ఆయన కృష్ణా జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. సరిగ్గా అదే సమయంలో కర్నూలు జిల్లాలోని స్వగ్రామంలో ఆయన తండ్రి మరణించారు. కానీ ఇంతియాజ్ తన తండ్రి అంత్యక్రియలకు సైతం హాజరు కాలేదు. జిల్లా కలెక్టర్‌గా ఆయన కరోనా విధుల్లో ఉండిపోయారు. వృత్తి పట్ల ఆయన అంత నిబద్దతతో పని చేస్తారనేందుకు ఇదో ఉదాహరణ. కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపికలో వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్.. బాగా ఆలోచించి ఇంతియాజ్‌‌తో ఐఏఎస్ ఉద్యాగానికి రాజీనామా చేయించి.. మరి పార్టీ అభ్యర్థిగా బరిలో దింపారనే ఓ చర్చ అయితే జిల్లాలో నడుస్తుంది.


మంచి పేరు.. సౌమ్యుడు!

ఇక టీజీ భరత్.. ప్రముఖ పారిశ్రామిక వేత్త, రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ కుమారుడు. గతం ఎన్నికల్లో ఆయన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి హఫీజ్ ఖాన్ చేతిలో 5,353 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మళ్లీ ఆయన్నే టీడీపీ మరోసారి బరిలో దింపింది. గత ఎన్నికల్లో టీజీ భరత్ ఓటమి పాలైనా.. నియోజకవర్గ ప్రజల మధ్యే ఆయన ఉన్నారు. వారి సమస్యలు తెలుసుకొని.. వాటిని పరిష్కారించారు. భరత్ విద్యావంతుడు, సౌమ్యుడు అన్న పేరు సైతం నియోజకవర్గ ప్రజల్లో ఉంది. అలాగే నగరంలో ఆయన చేపట్టిన అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువ అయ్యారు. ఇక నగరాభివృద్ధికి ఆయన ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందించి.. దానిని ప్రజల్లోకి తీసుకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు.


భరత్ ప్లస్‌లు ఇవే..!

ఇక ఆయన తండ్రి టీజీ వెంకటేష్‌కు ముస్లిం వర్గాలతో మంచి పరిచయాలున్నాయి. అవి టీజీ భరత్ గెలుపునకు దోహదపడే అవకాశాలున్నాయని చర్చ సాగుతోంది. అదీకాక ఇంతియాజ్ కర్నూలు జిల్లా వాసే కానీ.. స్థానికుడు కాదనే ఓ చర్చ నడుస్తోంది. మరోవైపు ఇటీవల ఓ ముస్లిం కార్పొరేటర్ టీడీపీలో చేరారు. మరికొంత మంది టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు.. వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్‌కి వైసీపీ టికెట్ కేటాయించలేదు. దీంతో పైకి ప్రచారంలో పాల్గొన్నా.. అదంతా అంతంత మాత్రమే. వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్ గెలుపునకు ఆయనతోపాటు ఆయన వర్గం సహకరించట్లేదన్నది స్థానికంగా జరుగుతున్న చర్చ. అయితే గత ఎన్నికల్లో 58 శాతమే పోలింగ్ జరిగింది. ఈ సారి ఆ శాతాన్ని కొద్దిగా పెంచుకుంటే.. టీజీ భరత్ గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందని రాజకీయ విశ్లేషకులు.. కర్నూలు జిల్లా మేధావులు చెబుతున్న పరిస్థితి. ఫైనల్‌గా కర్నూలు కింగ్ ఎవరవుతారో వేచి చూడాల్సిందే మరి.

Read Latest Natinal News And Telugu News

Updated Date - May 09 , 2024 | 04:00 PM