AP POlitics :ముక్కోణంలో చీరాల! టీడీపీ X వైసీపీ X కాంగ్రెస్
ABN , Publish Date - May 12 , 2024 | 03:49 AM
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన నియోజకవర్గాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల ఒకటి. తీరప్రాంతంలోని ఈ వాణిజ్య/వ్యాపార కేంద్రంలో బలహీనవర్గాలు అధికం. కొణిజేటి రోశయ్య, ప్రగడ కోటయ్య, సజ్జా చంద్రమౌళి వంటి

టీడీపీ X వైసీపీ X కాంగ్రెస్
వైసీపీ తరఫున బరిలో కరణం కుమారుడు
టీడీపీ నుంచి బీసీ నేత కొండయ్య యాదవ్
కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్
మాజీ ఎమ్మెల్యే పోటీతో వైసీపీ ఓట్లకు గండి?
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన నియోజకవర్గాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల ఒకటి. తీరప్రాంతంలోని ఈ వాణిజ్య/వ్యాపార కేంద్రంలో బలహీనవర్గాలు అధికం. కొణిజేటి రోశయ్య, ప్రగడ కోటయ్య, సజ్జా చంద్రమౌళి వంటి ఉద్దండులను అసెంబ్లీకి పంపిన ఈ నియోజకవర్గంలో ఈ దఫా త్రిముఖ పోటీ నెలకొంది.
తొలుత వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేశ్, టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్య యాదవ్ మధ్యే పోటీ ఉండేది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రె్‌సలో చేరి ఆ పార్టీ తరఫున బరిలో నిలవడంతో ముక్కోణపు పోటీగా మారింది. వైసీపీ ఓట్లనే ఆమంచి చీలుస్తారని.. అదే జరిగితే టీడీపీ విజయం తథ్యమని అంటున్నారు.
పదిసార్లు బీసీలకే పట్టం
చీరాలకు 1952 నుంచి ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరగ్గా.. 10 దఫాలు బీసీ, రెండేసి సార్లు వైశ్య, కాపు, కమ్మ సామాజికవర్గాల వారు గెలుపొందారు. గత ఎన్నికల్లో ఆమంచిపై ఉన్న వ్యతిరేకత బలరాం విజయానికి తోడ్పడింది. నియోజకవర్గంలో 2 లక్షల పైచిలుకు ఓటర్లు ఉండగా.. నాలుగో వంతు దళిత, బలహీనవర్గాలవే. సామాజికంగా చూస్తే పేద కుటుంబాలే అధికం.
గతంలో వస్త్ర వ్యాపారానికి పేరున్నా ప్రస్తుతం ఆ ప్రాభవం కొంత తగ్గింది. చేనేతల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. తీరప్రాంతం కావడంతో రొయ్యల సాగు పెరిగినా స్థానికుల్లో ఆర్థికంగా బలపడిన వారు అతికొద్దిమందే.
ఈ నేపథ్యంలో పార్టీలకు తోడు రంగంలో ఉన్న అభ్యర్థుల సామాజికవర్గాల ప్రభావం కూడా ఎన్నికల్లో అధికంగా కనిపిస్తోంది. తమకు కంచుకోటలాంటి స్థానాల్లో చీరాల కూడా ఉందని నిన్నమొన్నటి వరకు వైసీపీ నేతలు కూడా అంచనా వేశారు.
అయితే ఆమంచి బరిలో దిగడంతో తమ అవకాశాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని, ఆయన తమ ఓట్లను చీలుస్తారని వారు అంగీకరిస్తున్నారు. ప్రధానంగా వైసీపీకి అండగా ఉన్న దళిత, కాపు వర్గాల ఓట్లకు ఆయన గండికొట్టే అవకాశం ఉంది. ముస్లింలలోనూ ఆయన పక్షాన నిలిచేవారు ఉన్నారు.
మత్స్యకారులు, చేనేతల్లోని పద్మశాలీల ఓట్లను రాబట్టుకునేందుకు కరణం ప్రయత్నిస్తున్నారు. అయితే టీడీపీ తరఫున బీసీ అభ్యర్థి అయిన కొండయ్య యాదవ్ పోటీచేస్తుండడంతో వారితోపాటు దేవాంగులు కూడా టీడీపీ వైపే మొగ్గుచూపుతున్నారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ప్రధాన పోటీ వైసీపీ, టీడీపీ మధ్య ఉన్నట్లు కనిపిస్తున్నా.. ఆమంచి అనూహ్యంగా ముందు వరుసలోకి వస్తారా లేక వైసీపీని దెబ్బతీసేందుకే పరిమితమవుతారా అన్నది ఆసక్తిగా మారింది.
- ఒంగోలు, ఆంధ్రజ్యోతి
నియోజకవర్గ స్వరూపం..
(చీరాల, వేటపాలెం మండలాలు)
మొత్తం ఓటర్లు 2,02,711
పురుషులు 98,729
మహిళలు 1,03,958
ట్రాన్స్‌జెండర్లు 24
కీలక సామాజికవర్గాల ఓటర్లు..
పద్మశాలి-29 వేలు, దేవాంగ-26 వేలు, ఎస్సీలు-33 వేలు, యాదవ-26 వేలు,
ఆర్యవైశ్య-22 వేలు, రెడ్లు-12 వేలు, కాపులు-11 వేలు, ముస్లింలు- 11 వేలు, ఎస్టీలు-10 వేలు, మత్స్యకారులు-9 వేలు.
కరణం వెంకటేశ్ బలాలు..
తండ్రి బలరాంకు నియోజకవర్గ ప్రజలతో ఉన్న పరిచయాలు.. వైసీపీ ఓటు బ్యాంకు.
బలహీనతలు..
గత నాలుగేళ్లలో పీఏ ద్వారా చోటుచేసుకున్న అవినీతి వ్యవహారాలు.. ఆమంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండటం.
2. కొండయ్య యాదవ్ బలాలు..
సౌమ్యుడు.. వివాదరహితుడు.. బీసీ నేత కావడం.. మూడేళ్లుగా పార్టీ శ్రేణులతో మమేకం.. ఉద్యోగులు, బలహీనవర్గాలు, తటస్థుల్లో టీడీపీకి ఆదరణ పెరగడం.
బలహీనతలు..
తొలిసారి ఎన్నికల బరిలోకి దిగడంతో పోల్‌మేనేజ్‌మెంట్‌పై అనుభవం లేకపోవడం
3. ఆమంచి బలాలు..
స్థానికుడు.. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా రాజకీయ అనుభవం.. నియోజకవర్గమంతటా పరిచయాలు.. పోల్ మేనేజ్‌మెంట్‌లో దిట్ట.
బలహీనతలు..
కక్షసాధింపు చర్యలకు పాల్పడడం.. అనుచరుల అరాచకాలు.. తరచూ పార్టీలు మారడంతో జనంలో వ్యతిరేకత.