Share News

YCP: ఆ ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయం: వైసీపీ శ్రేణులు

ABN , Publish Date - Jan 07 , 2024 | 09:11 AM

విజయనగరం జిల్లా: శృంగవరపుకోటలో వైసీపీ రాజకీయ కోట పగిలింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాల మధ్య రాజకీయ పోరు రోడ్డున పడింది. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ‘గో బ్యాక్’ అంటూ వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు.

YCP: ఆ ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయం: వైసీపీ శ్రేణులు

విజయనగరం జిల్లా: శృంగవరపుకోటలో వైసీపీ రాజకీయ కోట పగిలింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాల మధ్య రాజకీయ పోరు రోడ్డున పడింది. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ‘గో బ్యాక్’ అంటూ వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే కడుబండికి మళ్లీ టిక్కెట్టు ఇస్తే ఓడిపోతామని పేర్కొంటూ నాలుగు మండలాల నుంచి జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు అధిష్టానాన్ని కలిసేందుకు ప్రత్యేక బస్సుల్లో విజయవాడకు పయనమయ్యారు.

కాగా శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు మరోసారి టిక్కెట్‌ ఇవ్వొద్దంటూ కొత్తవలస మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఉత్తరాంధ్ర రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డికి విన్నవించారు. విశాఖ ఎయిర్‌పోర్టులో ఈనెల 4న అతన్ని కలిసి వేరెవరికైనా టిక్కెట్‌ ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందిస్తూ శనివారం మాట్లాడుకుందామని, లేదంటే సోమవారమైనా చర్చిద్దామని సర్దిచెప్పి పంపించేశారు.

మళ్లీ కడుబండి శ్రీనివాసరావుకే టిక్కెట్‌ ఇస్తే పనిచేయబోమని ఈనెల 2న వైసీపీ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) వద్ద కొత్తవలస మండలానికే చెందిన 12మంది సర్పంచ్‌లు, ఏడుగురు వరకు ఎంపీటీసీలు ఖరాఖండిగా చెప్పేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఇదేం గోలంటూ చిన్న శ్రీను అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

గత నెల 30న రాత్రి కొత్తవలసలోని రాష్ట్ర కొప్పల వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ నెక్కల నాయుడు బాబు కార్యాలయంలో ఆత్మీయ సభ జరిగింది. దీనికి హాజరైనవారిలో అత్యధికులు స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వ్యవహార శైలిని తప్పుపట్టారు. ఈ సారీ స్థానికునికే టిక్కెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు వర్గానికి చెందిన శృంగవరపుకోట, వేపాడ మండలాలకు చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు, నాయకులు ఏడాదిగా ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు కొత్తవలస మండలానికి చెందిన పలువురు కూడా ఇదే బాటపట్టారు. వీరికి ఎల్‌.కోట, జామి మండలాలకు చెందిన మరికొంత మంది ప్రజాప్రతినిధులు, నాయకులు తోడవడంతో వైసీపీలో కాకరేగుతోంది. సీఎం జగన్‌ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టిక్కెట్‌లను నిరాకరించడం, మరో నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా నియమించడం చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో మాత్రం రాజాంకు ప్రాతినిధ్యం వహిస్తున్న కంబాల జోగులను అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఇన్‌చార్జి మార్చారు. రాజాంలో మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య కుమారుడు తలే రాజేష్‌ను ఇన్‌చార్జి చేశారు. ఈ ఒక్కటి తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో ప్రస్తుతానికి మార్పులు, చేర్పులు కనిపించడం లేదు. ఏడాదిగా ఎస్‌.కోట నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కార్యక్రమాలు జరుగుతున్నా.. కీలక నాయకులు వ్యతిరేకిస్తున్నా ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ఆ పార్టీ నాయకులనే ఆశ్చర్యపరుస్తోంది.

ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు గజపతినగరం నియోజకవర్గ పరిధిలోని దత్తిరాజేరు మండలానికి చెందిన వ్యక్తి. ఎస్‌.కోట నుంచి ఎన్నికైన తరువాత ఇక్కడ తనకంటూ సొంత వర్గం ఏర్పరుచుకున్నారు. అయినా గానీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాలైతే నడుస్తున్నాయి. సిట్టింగ్‌కు టిక్కెట్‌ ఇవ్వొద్దంటున్న వారంతా స్థానికం పాటందుకున్నారు. ఎమ్మెల్సీ రఘురాజు పార్టీ అంగీకరిస్తే తానుగాని, తన సతీమణి సుధారాజు (సుబ్బలక్ష్మి) గాని పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నామని బహిరంగంగానే చెబుతున్నారు. ఇంకా నెక్కలనాయుడు బాబు, కొత్తవలసకు చెందిన ఓ వైద్యుడు, రొంగలి జగన్నాథం, వేపాడ ఎంపీపీ దొగ్గ సత్యవంతుడు టిక్కెట్‌ను ఆశిస్తున్నట్లు సమాచారం. వేపాడ ఎంపీపీగా గతంలో పనిచేసిన దొగ్గ శ్రీదేవి, భర్త శ్రీనివాసరావుల పేర్లూ విన్పిస్తున్నాయి. అయితే ఎమ్మెల్యే కడుబండికి వ్యతిరేకింగా అసమ్మతి రాగం వినిపిస్తుండడం వైసీపీ అధిష్టానాన్ని కాస్త కలవరపెడుతుంది. వీరి మాట విని కడుబండిని పక్కకు పెడితే ఇతని వర్గం టిక్కెట్‌ కేటాయించిన వ్యక్తికి సహకరించకపోయినా గెలుపు కష్టమే. ఇప్పుడు ఈ పార్టీకి ముందు నుయ్యి, వెనక గొయ్యిన్న విధంగా పరిస్థితి తయారవడంతో ఎలా చక్కదిద్దాలో తెలియక అధిష్టానం సతమతమవుతున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Jan 07 , 2024 | 09:13 AM